logo
Published : 08/12/2021 03:06 IST

నలుగురి ప్రాణాలు బలిగొన్న అతివేగం

లారీలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు

విభాగినిని వ్యాను ఢీకొనడంతో మరొకరు

బిచిత్రనంద సాహు

నందిగామ, శంషాబాద్‌, గచ్చిబౌలి, న్యూస్‌టుడే: అతివేగం కారణంగా వేర్వేరు ప్రాంతాల్లో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. లారీ అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన నందిగామ మండలం అయ్యప్ప గుడి సమీపంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. షాద్‌నగర్‌ నుంచి కొత్తూరు వైపు లారీ అతి వేగంగా వెళ్తూ ప్రమాదవశాత్తు అదుపుతప్పింది. ఈ క్రమంలో రహదారి పక్కన ఓ చెట్టును రాసుకుంటూ రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంతో ఆగి ఉన్న వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో జంగోనిగూడకు చెందిన సురేష్‌కుమార్‌ (27) అక్కడికక్కడే మృతి చెందగా.. శ్రీధర్‌ (55) షాద్‌నగర్‌ కమ్యూనిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీధర్‌ కాలేజీనుంచి వస్తూ హైవే వద్ద బస్సులో దిగే తన కుమార్తెను ఇంటికి తీసుకెళ్లేందుకు నిత్యం జాతీయ రహదారి చెంతకు వస్తారు. ఈ క్రమంలో తన గ్రామానికే చెందిన సురేష్‌కుమార్‌ కనిపించడంతో ఆగి ఇద్దరూ మాట్లాడుకుంటుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. శ్రీధర్‌కు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పోలీసులు లారీ డ్రైవర్‌ యశ్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ప్రమాదంలో అతి వేగంగా ప్రయాణిస్తున్న  క్యాబ్‌ విభాగిని ఢీకొన్న ప్రమాదంలో ఓ ప్రయాణికుడు మృత్యువాత పడ్డాడు. శంషాబాద్‌ ఆర్జీఐఏ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన బిచిత్రనంద సాహు(42) ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చాడు. మాదాపూర్‌లోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.  స్వగ్రామానికి వెళ్లడానికి  శంషాబాద్‌ విమానాశ్రయానికి  క్యాబ్‌లో బయలుదేరాడు. అతి వేగం కారణంగా క్యాబ్‌ విమానాశ్రయం ప్రధాన ద్వారం వద్దకు రాగానే అదుపు తప్పి విభాగినితో పాటు విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బిచిత్రనందను ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరో ఘటనలో.. వేగంగా దూసుకు వచ్చిన టిప్పర్‌ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి దుర్మరణం చెందాడు. గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ గోనే సురేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఆకాసపు శ్రీనివాస్‌(28).. సనత్‌నగర్‌లో నివాసముంటూ బేగంపేటలోని వీకొల్లబ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు శంకర్‌పల్లి సమీపంలోని మోకిలలో ఉంటున్న స్నేహితుడు ఉదయ్‌ను కలిసేందుకు ద్విచక్రవాహనం మీద బయలుదేరాడు. వట్టినాగులపల్లి సమీపాన ఔటర్‌ రింగురోడ్డు సర్వీసు రోడ్డు వద్దకు రాగానే ఎదురుగా అతి వేగంగా దూసుకువచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతిచెందాడు. తలకు శిరస్త్రాణమున్నా బెల్టు పెట్టుకోలేదు. శ్రీనివాస్‌కు పెళ్లి చేసేందుకు సంబంధాలు చూస్తున్న తరుణంలో అనుకొని ప్రమాదంలో అతను మరణించడం కుటుంబసభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని