logo

మహిళా పర్యాటకులకు..వసతి గృహం

గ్రేటర్‌లో మొట్టమొదటి మహిళా పర్యాటకుల వసతి గృహం నిర్మాణం కాబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా భవనాన్ని నిర్మించాలనేది జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రచించింది.

Published : 08 Dec 2021 03:06 IST

స్థాయీ సంఘానికి చేరిన పలు ప్రతిపాదనలు

నాంపల్లిలోని చారిత్రక సరాయి

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో మొట్టమొదటి మహిళా పర్యాటకుల వసతి గృహం నిర్మాణం కాబోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సేఫ్‌ సిటీ ప్రాజెక్టులో భాగంగా భవనాన్ని నిర్మించాలనేది జీహెచ్‌ఎంసీ ప్రణాళిక రచించింది. అన్ని రకాల వసతులతో అతిథి గృహం నిర్మించి, దేశ, విదేశాల నుంచి వచ్చే మహిళా పర్యాటకులకు వసతి కల్పించాలనేది లక్ష్యం. ఈ తరహా భవనాలు పర్యాటకంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాచుర్యం పొందాయని, వాటిని స్ఫూర్తిగా తీసుకుని 1919లో నిర్మించిన చరిత్రాత్మక కట్టడమైన నాంపల్లి సరాయి(అతిథి గృహం) పక్కన నిర్మించనున్నట్లు జీహెచ్‌ఎంసీ వెల్లడించింది. ఆధునిక రెస్టారెంటును పోలి ఉండేలా రూ.11కోట్లతో 187 మందికి అత్యాధునిక సౌకర్యాలతో వసతి కల్పించేలా నిర్మించాలని ప్రతిపాదనలు రూపొందించారు.

మొదటి సమావేశం నేడు
జీహెచ్‌ఎంసీకి గతేడాది చివర్లో ఎన్నికలు జరిగి, 2021 ప్రారంభంలో కొత్త పాలకమండలి ఏర్పాటైంది. ఇటీవల స్థాయీ సంఘానికి సభ్యుల ఎన్నిక పూర్తయింది. భారీ అభివృద్ధి పనులు ఆమోదించే అధికారం, వాటి ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపే అధికారం స్థాయీ సంఘానికి ఉండటంతో.. బుధవారం జరగబోయే సమావేశం ముందు అధికారులు మొత్తం 22 ప్రతిపాదనలు ఉంచారు. అందులో మహిళా పర్యాటకుల విశ్రాంతి భవనంతోపాటు జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు పక్కనున్న మల్కారం చెరువును రూ.251కోట్లతో శుద్ధి చేసే ప్రాజెక్టూ ఉంది. నెహ్రూ జంతు ప్రదర్శనశాలలోని సఫారి పార్కు నుంచి కిషన్‌బాగ్‌ రోడ్డు వరకు ప్రహరీ నిర్మాణం, పలు చెరువుల వద్ద వరదనీటి కాలువలు, ఒప్పంద ఇంజినీర్ల పదవీకాలం పొడిగింపు, కాటేదాన్‌ క్రీడా ప్రాంగణంలో పలు అభివృద్ధి పనులను పూర్తిచేయడం వంటివి ఉన్నాయి. ఈ అంశాలను మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి ఆధ్వర్యంలో సభ్యులు చర్చిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని