logo

ఉడకని అన్నం.. నీళ్లపప్పు

వసతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా....

Updated : 08 Dec 2021 05:12 IST

వసతి గృహాల్లో విద్యార్థుల అవస్థలు

అటకెక్కిన మెనూ 

అద్దె భవనాల్లో చలికి వణుకుతున్న చిన్నారులు

- ఈనాడు, హైదరాబాద్‌ - శేరిలింగంపల్లి, సరూర్‌నగర్‌, హయత్‌నగర్‌, చేవెళ్ల, న్యూస్‌టుడే,

శేరిలింగంపల్లిలో కనీస సామగ్రి లేని వంటశాల

సతిగృహాలు సమస్యలకు ఆనవాళ్లుగా మారాయి. పర్యవేక్షణ కొరవడి.. వసతులు లేక.. అరకొర భోజనంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నీళ్ల పప్పు.. సరిగా ఉడకని అన్నం.. కూరగాయ ముక్కలు లేని కూరలు.. రుచీపచీ లేకుండా వండి వడ్డిస్తున్నారు. ఇప్పటికే నగరంలో అక్కడక్కడ ఆహారం సరిగా లేదంటూ విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి నగరం, శివారు ప్రాంతాల్లో పలు వసతిగృహాలను సందర్శించగా.. సమస్యలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపించింది. మెనూ పాటించడం లేదు. ఉదయం రాగిజావ, పాలు మొదలుకుని రాత్రి భోజనం వరకు ప్రభుత్వ నిర్దేశిత మెనూను అటకెక్కించేశారు. గుడ్లు పెట్టడం లేదు. ఉదయం అల్పహారం బదులు అన్నం వండి పెడుతున్నారు. కూరలు లేకుండా నీళ్ల చారు పోసుకుని అన్నం తినాల్సి వస్తోందని వాపోతున్నారు. కరోనా కారణంగా ఇప్పటికే విద్యార్థులు పెద్దగా హాస్టళ్లలో ఉండటం లేదు. కొన్నిచోట్ల 10శాతం లోపే హాజరు ఉంటోంది. అయినప్పటికీ ఉన్న విద్యార్థుల తగ్గట్టుగా కూడా మెనూ పాటించకుండా గాలికొదిలేశారు. పెరిగిన కూరగాయల ధరలతో అన్ని కూరలు వండటం లేదంటూ అరకొరగానే కూరలు వండి వదిలేస్తున్నారు.

పాడైపోయిన ఫ్యాన్‌ రెక్కలు

ఇరుకుగదులే దిక్కు
హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని వసతిగృహాల్లో చాలావరకు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో.. వెలుతురు సరిగా లేక అవస్థలు పడుతున్నారు. కిటికీలు, తలుపులు విరిగిపోయి ఉండటంతో చలికి వణికిపోతున్నారు. ప్రభుత్వం నుంచి రగ్గులు, బట్టలు, కార్పెట్లు పంపిణీ చేయలేదు.  

సరూర్‌నగర్‌లో నీటి సదుపాయం లేని సింక్‌లు

మరుగుదొడ్ల నిర్వహణేదీ..?
మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా మారింది. శుభ్రత పాటించకపోవడంతో రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. 15-20 మంది విద్యార్థులకు ఒక మరుగుదొడ్డి అన్నట్లుగా ఉంది. కరోనా మహమ్మారితో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం పెరిగింది. అయినప్పటికీ.. అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు. వారానికోసారి శుభ్రం చేస్తుండటంతో అపరిశుభ్రత తాండవిస్తోంది.

ప్రమాదకరంగా ఫ్యూజ్‌బాక్సు

* సరూర్‌నగర్‌లోని బీసీ బాలుర వసతిగృహం.. చార్మినార్‌, ముషీరాబాద్‌కు సంబంధించిన హాస్టల్‌ కొనసాగుతోంది. దాదాపు పది రోజుల కిందట ఆహారం సరిగా లేక 15 మంది విద్యార్థులు అస్వస్థతకుగురయ్యారు. 820 విద్యార్థులు ఉండాల్సి ఉండగా.. కల్తీ ఆహార ఘటన తర్వాత నుంచి 15 మందే ఉంటున్నారు. అద్దె భవనం కావడంతో వెలుతురు సరిగారాక దారుణంగా ఉంది. పెద్దసంఖ్యలో వస్తే ఇరుకుగదుల్లోనే సర్దుకోవాల్సిన దుస్థితి. మరుగుదొడ్లు సరిపడా లేక అధ్వానంగా మారాయి. తలుపులు, కిటికీలు విరిగిపోయి చలికి గజగజ వణుతున్నారు. స్విచ్‌బోర్డులు పాడయ్యాయి.

* శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతి గృహం. 120 మంది పిల్లలకుగాను 23 మందే ఉంటున్నారు. పిల్లలకు మెనూ పాటించడం లేదు. అన్నంసరిగా ఉడకకుండా రుచి లేకుండా కూరలు వండి పెడుతున్నారు. ‘ఈనాడు’ ప్రతినిధి హాస్టల్‌ ప్రతినిధిని సందర్శించినప్పుడు కిలో ఆలుగడ్డలు, నాలుగు టమాటాలు మినహా కూరగాయలే లేవు. కూరల్లో కూరగాయ ముక్కలు ఏరుకోవాల్సిన పరిస్థితి ఉందని విద్యార్థులు వాపోతున్నారు. దుప్పట్లు ఇవ్వకపోవడంతో ఇంటి నుంచే తెచ్చుకుంటున్నారు.


మెస్‌ ఛార్జీలు పెంచాలి

పెరిగిన ధరలకు తగ్గట్టుగా ప్రభుత్వం మెస్‌ ఛార్జీలు పెంచాలి. హాస్టళ్లలో ఎక్కడా మెనూ పాటించడం లేదు. ఉదయం అల్పాహారం పెట్టడం లేదు. సొంత భవనాలు లేక వేరొక ప్రాంతాల్లో అద్దె భవనాల్లో నిర్వహిస్తుండటంతో వసతులు లేక విద్యార్థులు నానాఅగచాట్లు పడతున్నారు. వెంటనే ప్రభుత్వం ఏ ప్రాంతానికి చెందిన హాస్టల్‌కు అక్కడే సొంత భవనం నిర్మించాలి.

- గడ్డం శ్యామ్‌, పీడీఎస్‌యూ గ్రేటర్‌ హైదరాబాద్‌ కార్యదర్శి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని