logo

ప్రయోగాత్మక సాగు.. లాభాలు బాగు..

మారుతున్న కాలానికి అనుగుణంగా స్వల్ప నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడో రైతు. ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా 25 కూరగాయల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామానికి చెందిన బొడ్డు నర్సింహులు

Published : 09 Dec 2021 02:26 IST

● ఎకరం విస్తీర్ణంలో పాతిక రకాల పంటలు

● ఆదర్శబాటలో నర్సింహులు

న్యూస్‌టుడే, ములుగు


టమాటా, మిరప, బీర తోటలో నర్సింహులు

మారుతున్న కాలానికి అనుగుణంగా స్వల్ప నీటి వినియోగం.. తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు సాగు చేసి లాభాలు గడిస్తున్నాడో రైతు. ఎకరం భూమిలో ప్రయోగాత్మకంగా 25 కూరగాయల పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌ గ్రామానికి చెందిన బొడ్డు నర్సింహులు. సంప్రదాయానికి భిన్నంగా పంటలు సాగు చేసి లాభాలు గడించాలని కొత్తగా ఆలోచించారు. దీంతో తనకున్న ఎకరం భూమిలో తీగ జాతి పంటల సాగుకు పందిరి ఏర్పాటు చేయించారు. దానిపై బీర, కాకర, సొర, చిక్కుడు, దొండ, పొట్ల తదితరాలు సాగు చేశారు. ఒక్కో పంటకు గుంటన్నర భూమి కేటాయించారు. పందిరి కింద అంతర పంటగా మిరప, టమాటా, క్యాబేజీ, పుదీనా, వంగ, కీర, దోస, గోరుచిక్కుడు, క్యాప్సికం, క్యారెట్‌, కాలీఫ్లవర్‌, బ్రకోలి, కొత్తిమీర, పాలకూర, తోటకూర, ర్యాడీస్‌, బఠానీ, మెంతులు, బచ్చలకూర తదితరాలు సాగు చేశారు. ఇలా చేయడం వల్ల ఒక పంటకు వచ్చిన తెగుళ్లు మరో పంటకు రావని చెబుతున్నారు. తాను సాగు చేసిన కొన్ని కూరగాయలకు మార్కెట్‌లో డిమాండ్‌ లేకపోయినా మిగిలిన వాటికి ఎక్కువ ధర పలుకుతుండటంతో నష్టం వచ్చే పరిస్థితి లేదంటున్నారు. భిన్న పంటలు వేయడం వల్ల కలుపు నివారణ ఎంతో సులభమవుతుందన్నారు.

మెచ్చుకున్న ముఖ్యమంత్రి

వివిధ కూరగాయలను పండిస్తున్న రైతు నర్సింహులు కృషిని ఉద్యాన శాఖ అధికారులు గుర్తించారు. నియోజకవర్గ కేంద్రం గజ్వేల్‌లో నమూనాగా నిర్మించిన సమీకృత మార్కెట్‌ను సీఎం కేసీఆర్‌ రెండేళ్ల కిందట ప్రారంభించారు. ఈ సందర్భంగా సేంద్రియ విధానంలో ఎక్కువ పంటలు పండిస్తున్న విషయం సీఎం దృష్టికి వెళ్లింది. దీంతో నర్సింహులును చెంతకు పిలిపించుకుని సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రైతుకు మీరు ఆదర్శం కావాలంటూ అభినందించారు.

రూ.2 లక్షలకు పైగా ఆదాయం: నర్సింహులు

పాతిక రకాల కూరగాయల పంటలను సేంద్రియ ఎరువులతో పండిస్తున్నా.. అందుకు రూ.50 వేల వరకు ఖర్చు అవుతోంది. మార్కెట్‌లో మంచి ధర వస్తోంది. ఖర్చులు పోనూ ఒక్కో పంట కాలానికి (ఆరు నెలలు) రూ.2 లక్షలకు పైగా ఆదాయం వస్తోంది. కుటుంబ సభ్యులు సహకారం అందిస్తున్నారు.

పదేళ్లుగా సేంద్రియం...

ఈ రైతు పదేళ్లుగా సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తూ వస్తున్నారు. పదేళ్లుగా జీవామృతం తయారు చేసుకొంటూ వాటి ద్వారానే పంటలు పండిస్తున్నారు. ఈయనకు ములుగులోని సురక్ష రైతు ఉత్పత్తిదారుల సంఘం సమన్వయకర్త శ్రీశైలం ఎప్పటికప్పుడు అవసరమైన సలహాలు సూచనలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయలను రైతుల నుంచి సురక్ష రైతు ఉత్పత్తిదారుల సంఘం కొనుగోలు చేసి.. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలకు తరలించి విక్రయిస్తోంది. వీటికి మార్కెట్‌లో అధిక ధర లభిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు