logo

రాత్రి ఇంట్లోంచి వెళ్లి... తెల్లారి శవమై..

రాత్రి ఇంట్లోంచి వెళ్లిన యువకుడు తెల్లారేసరికి మృతి చెందిన సంఘటన తాండూరు మల్‌రెడ్డిపల్లిలో జరిగింది. పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం మల్‌రెడ్డిపల్లికి చెందిన కుర్వ నవీన్‌(22) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు

Published : 09 Dec 2021 02:26 IST

తాండూరు టౌన్‌, (న్యూస్‌టుడే): రాత్రి ఇంట్లోంచి వెళ్లిన యువకుడు తెల్లారేసరికి మృతి చెందిన సంఘటన తాండూరు మల్‌రెడ్డిపల్లిలో జరిగింది. పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డి తెలిపిన ప్రకారం మల్‌రెడ్డిపల్లికి చెందిన కుర్వ నవీన్‌(22) వ్యవసాయ పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఇదే క్రమంలో బంధువులతో కలిసి మంగళవారం సాయంత్రం వరకు పొలంలో పనులు చేశాడు. ఇంటికి వచ్చాక, రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి, ఎంతకూ తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు స్నేహితులను అడిగినా ఆచూకీ లభించలేదు. బుధవారం గ్రామానికి దగ్గరలోని కాలిపోయిన గడ్డివాములో మృతదేహం ఉండటాన్ని స్థానికులు గమనించి ఊర్లో చెప్పడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి వెళ్లారు. సంఘటన స్థలంలో ఉన్న ద్విచక్రవాహనం నవీన్‌దేనని గుర్తించి, మృతి చెందింది అతడేనని కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేశారు. మృతదేహన్ని జిల్లా ఆస్పత్రి శవాగారానికి తరలించి పరీక్షల అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ఎన్నో అనుమానాలు...: నవీన్‌ గడ్డివాము వద్దకు ఎందుకు వెళ్లాడు? ఒక్కడేనా, లేక మరెవరైనా ఉన్నారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మద్యం తాగి, ఆ మత్తులో గడ్డికుప్పకు నిప్పంటించి ప్రమావవశాత్తు పడిపోయాడా? లేక ఎవరైనా తోశారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. చెరువుకట్ట వైపు ద్విచక్ర వాహనంపై ఒక్కడే వెళ్లాడని గ్రామస్థులు చెప్పారని పోలీసులు పేర్కొంటున్నారు. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. గతేడాది ఓ అమ్మాయితో పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు చర్చించుకున్నారని, ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. ఈ విషయమై మనస్థాపం చెందాడా అనే అనుమానాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని