logo

నింగికేగిన సైనిక శిఖరం..భాగ్యనగరిలో పదిలం

‘‘మీరు ఇక్కడికి దేశం కోసం వచ్చారు.. 140కోట్ల మందిలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం, అదృష్టం దక్కుతుంది. ఇల్లు, కుటుంబం తర్వాత.. దేశమే ముందు కావాలి.. ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి’’ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ హోదాలో మూడేళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు ఈ గడ్డ ఇంకా మర్చిపోలేదు.

Updated : 09 Dec 2021 09:24 IST

త్రివిధ దళాధిపతి  బిపిన్‌ రావత్‌కు నగరంతో ప్రత్యేక అనుబంధం  
వివిధ హోదాల్లో పలు మార్లు సైనిక శిక్షణ కేంద్రాల సందర్శన
ఈనాడు, హైదరాబాద్‌, కంటోన్మెంట్‌, న్యూస్‌టుడే

2017: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌

‘‘మీరు ఇక్కడికి దేశం కోసం వచ్చారు.. 140కోట్ల మందిలో చాలా తక్కువ మందికి ఈ అవకాశం, అదృష్టం దక్కుతుంది. ఇల్లు, కుటుంబం తర్వాత.. దేశమే ముందు కావాలి.. ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉండాలి’’ చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ హోదాలో మూడేళ్ల కిందట ఆయన చెప్పిన మాటలు ఈ గడ్డ ఇంకా మర్చిపోలేదు. ఇక్కడి సైనికులు ఆ మాటల్ని గుర్తుచేసుకుంటూ స్ఫూర్తి పొందుతుంటారు. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకుంటుంటారు. ఆయన లేరనే విషయం తెలిసి విషాదంలో మునిగిపోయారు.
భారత త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధులిక హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం నగరవాసుల్ని తీవ్రంగా కలిచివేసింది. వీరితో పాటు మరో 12 మంది సైనిక అధికారులు మృత్యువాత పడిన ఘటన అందర్ని ఒక్కసారిగా నిశ్చేష్టులను చేసింది. ఆర్మీ చీఫ్‌గా, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ హోదాల్లో ఆయన పలుమార్లు హైదరాబాద్‌లోని వైమానిక, సైనిక శిక్షణ కేంద్రాలను సందర్శించారు. పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లలో పాల్గొన్నారు. వ్యక్తిగతం కోసం కాకుండా దేశం కోసం పనిచేయాలని చెప్పేవారు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా దేశమే మొదటిది కావాలని చెప్పేవారు.. నగరంతో ఆయనకు ఎంతో అనుబంధం ఉంది. రాజకీయ నాయకులు, సినిమా తారలకు మాదిరి.. రావత్‌ సైతం తన ధైర్య సాహసాలతో ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్నారు.  
*చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతి పట్ల ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రావత్‌తో పాటు ఆయన సతీమణి, సైన్యాధికారులను కోల్పోవడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన కెప్టెన్‌ వరుణ్‌సింగ్‌ వేగంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్‌ వేదికగా ఒవైసీ పేర్కొన్నారు.

టాసా జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఎన్‌ఎస్‌.రావుతో రావత్‌

నగరానికి ఎప్పుడెప్పుడు వచ్చారు?
* 2018 డిసెంబరు 14: చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ హోదాలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ సికింద్రాబాద్‌లోని మిలిటరీ కాలేజ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. 27 మంది అధికారులకు ఇంజినీరింగ్‌ డిగ్రీలు ప్రదానం చేశారు. తెలంగాణ అండ్‌ ఆంధ్రా సబ్‌ ఏరియా(టాసా) ప్రధాన కార్యాలయంలో సైనిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈఎంఈ గ్రంథాలయాన్ని సందర్శించారు.
* 2017 సెప్టెంబరు 17:  దుండిగల్‌లోని భారత వాయుసేన అకాడమీలో జరిగిన కంబైన్డ్‌ గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
* 2016 జనవరి 15: సదరన్‌ కమాండ్‌ జనరల్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్‌ హోదాలో సికింద్రాబాద్‌లో జరిగిన ఆర్మీ డే వేడుకలో పాల్గొన్నారు.
* బేగంపేట, బంజారాహిల్స్‌లో జరిగిన వివిధ సదస్సులకు ఆయన హాజరయ్యారు.

ఆర్మీ స్టాఫ్‌ కాలేజ్‌ వేడుకలో..

 

సికింద్రాబాద్‌ టాసా కార్యాలయంలో సైనికాధికారుల సమీక్షలో..


చిరునవ్వే ఆయన చిరునామా 

 -రిటైర్డ్‌ బ్రిగేడియర్‌ శ్రీరాములు
త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి మధులిక రావత్‌లు హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఎంతగానో కలిచివేసింది. 1986లో నేను, దల్బీర్‌సింగ్‌ మేజర్లుగా ఉన్న సమయంలో బిపిన్‌ రావత్‌ కెప్టెన్‌గా ఉన్నారు. ముగ్గురం కలిసి డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో ఇన్‌స్ట్రక్టర్లుగా పనిచేశాం. అప్పట్లో నేను, దల్బీర్‌సింగ్‌, బిపిన్‌ రావత్‌లు ఒకే కాలనీలో నివాసముండేవారం. ఎంతో స్నేహపూరితంగా మెలిగే బిపిన్‌ రావత్‌ చిరునవ్వే ఆయన చిరునామాగా ఉండేది. అప్పగించే పనులను సమర్థంగా పూర్తి చేసి అద్భుత ఫలితాలు వచ్చేలా చేసేవారు. ప్రపంచస్థాయిలో ఆలోచన చేసే ఆయన.. ముందున్న ముప్పును ముందుగానే పసిగట్టి అందుకు ఎలా సన్నద్దం కావాలో కేంద్ర క్యాబినెట్‌కు సవివరంగా వివరించి, ఒప్పించే దక్షత కలిగినవారు. ఉన్నత స్థానాలను అధిరోహించినా ఓ సాధారణ వ్యక్తిగానే ఉండే గొప్ప మానవతావాది.


నమ్మశక్యంగా లేదు..  

  -శ్రీనేష్‌ కుమార్‌ నోరి, ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి
అత్యంత భద్రత కలిగిన రష్యా హెలికాప్టర్‌ ప్రమాదానికి గురికావడం నమ్మశక్యంగా లేదు. అందులో బయలుదేరడానికి ముందు మూడంచెల్లో తనిఖీలు ఉంటాయి. పక్కాగా తనిఖీల తర్వాతే ప్రయాణానికి అనుమతి ఇస్తారు కాబట్టి మానవ తప్పిదం జరిగే అవకాశం లేదు. కుట్ర కోణం ఉందేమోననే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా పొంచి ఉన్న దాడుల నేపథ్యంలో ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. మనవద్ద అత్యంత పటిష్ఠమైన ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ ఉంది. ఇలాంటిదేమైనా ఉంటే నిఘా సంస్థలు హెచ్చరించేవి. వాతావరణం బాగా లేకపోవడమే కారణమై ఉండొచ్చు. కొండ ప్రాంతాల్లో హఠాత్తుగా వెలుతురు తగ్గిపోతుంది. వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సుశిక్షితులైన పైలెట్లు కాబట్టి దీన్ని సైతం ఎదుర్కొనగలరు. విచారణలోనే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని