logo
Published : 09/12/2021 02:29 IST

కూలిన గూడు.. పేదల గోడు

 బసవతారకనగర్‌లో అక్రమణలని 220కి పైగా గుడిసెలు నేలమట్టం

బసవతారకనగర్‌లో కూల్చివేతలు

రాయదుర్గం, న్యూస్‌టుడే: పోలీసుల భారీ బందోబస్తు.. పెద్దఎత్తున రెవెన్యూ సిబ్బంది.. పది వరకు జేసీబీలు.. పరిస్థితి చేయి దాటితే అదుపు చేసేందుకు వజ్రా వాటర్‌ కెనాన్‌ వాహనం, అగ్నిమాక శకటం, అంబులెన్స్‌తో పాటు వైద్య సిబ్బంది తదితర పకడ్బందీ ఏర్పాట్లతో గౌలిదొడ్డి బసవ తారకనగర్‌ ప్రాంతాన్ని  బుధవారం ఉదయం 8గంటలకే చుట్టుముట్టారు. సర్వే నంబరు 37లోని దాదాపు 6 ఎకరాల ప్రభుత్వ స్థలంలో వెలసిన గుడిసెలు, రేకుల షెడ్లను కూల్చేందుకు పూనుకున్నారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేసినా.. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేసినా వారిని ఆపలేకపోయారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధుల రోదనలతో ఆ ప్రాంతం మార్మోగింది. రాజేంద్రనగర్‌ ఆర్డీఓ చంద్రకళ, శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వంశీమోహన్‌ పర్యవేక్షణ, మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసీపీ రఘునందన్‌రావు నేతృత్వంలో బందోబస్తు మధ్య.. సాయంత్రానికల్లా పూర్తిగా నేలమట్టం చేశారు.
ఈ స్థలంలో రెండు దశాబ్దాలుగా.. స్థానికంగా క్రషర్స్‌లో పనిచేసే, కూలీలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారు. అలా క్రమంగా 220కి పైగా గుడిసెలు పుట్టుకొచ్చాయి. కొందరు స్థానిక నాయకులూ భారీఎత్తున డబ్బులు వసూలు చేసుకుని పేదలతో గుడిసెలు వేయించారు. అక్కడి చిరునామాలపైనే వారు ఆధార్‌కార్డు, ఓటర్‌ ఐడీ పొందారు. అధికారులు విద్యుత్‌, తాగునీటి వసతులూ కల్పించారు. బాధితులకు మద్దతుగా వచ్చిన గచ్చిబౌలి కార్పొరేటర్‌ గంగాధర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న బాధితులు

మిన్నంటిన రోదనలు
తాము పుట్టి పెరిగిన గూళ్లు నేలమట్టమవడంతో చిన్నారులతో పాటు స్థానిక మహిళల రోదనలతో ఆ ప్రాంతమంతా మోర్మోగింది. బయటపడిన సామగ్రితో స్థానికులు ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచక బిక్కుబిక్కుమంటూ ఉండిపోయారు.

రూ.3 లక్షలిచ్చి గృహ ప్రవేశం
రేకుల షెడ్డు నిర్మించుకొని నెల రోజుల క్రితమే గృహప్రవేశం చేశామని, రూ.3 లక్షలు తీసుకుని ఓ నేత ఇల్లు కట్టుకోమనడంతోనే అలా చేశామని ఓ మహిళ వాపోయింది.

ఒంటిపై కిరోసిన్‌ పోసుకున్న యువకుడు
నిర్వాసితులు మధ్యాహ్నం గోపన్‌పల్లి-నానక్‌రాంగూడ ప్రధాన రహదారిపై బైఠాయించారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఓ యువకుడు ఒంటిపై కిరోసిన్‌ పోసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. పోలీసులు వెంటనే నీరు పోసి కాపాడారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సాయంత్రం ఆర్డీఓ చంద్రకళ స్పందించి.. అందరి వివరాలు సేకరించామని, రెండు పడక గదుల ఇళ్లు అందేలా ప్రభుత్వానికి నివేదిస్తునట్లు చెప్పడంతో వారు విరమించారు.

 

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని