ట్యాంక్‌లోని మృతదేహం కిశోర్‌గా గుర్తింపు

తాగునీటి ట్యాంక్‌లోని మృతదేహం కేసు కొలిక్కి వచ్చింది. మృతుడు రాంనగర్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్‌(26)గా పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం...రాంనగర్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పుష్పలత,

Updated : 09 Dec 2021 16:37 IST

రాంనగర్‌, న్యూస్‌టుడే: తాగునీటి ట్యాంక్‌లోని మృతదేహం కేసు కొలిక్కి వచ్చింది. మృతుడు రాంనగర్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన కిశోర్‌(26)గా పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ జహంగీర్‌ యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం...రాంనగర్‌ డివిజన్‌ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన పుష్పలత, ఈశ్వర్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు వివాహం కావడంతో కవాడిగూడలో ఉంటూ రాంగోపాల్‌ పోలీసు స్టేషన్‌లో హౌస్‌ కీపింగ్‌గా పనిచేస్తోంది. ఈశ్వర్‌ ఐదేళ్ల క్రితం చనిపోవడంతో పుష్పలత తన చిన్న కూతురు, ఇద్దరు కుమారులతో కలిసి అంబేడ్కర్‌నగర్‌లో అద్దె ఇంట్లో ఉంటోంది. కిశోర్‌ గంజాయి, మద్యానికి బానిసయ్యాడు. సెప్టెంబర్‌ 19న రాత్రి కిశోర్‌ మద్యం తాగి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఇంటి నుంచి వెళ్లిన కిశోర్‌.. స్నేహితుడు మధును కలిసి అర్ధరాత్రి వరకు  రిసాలగడ్డ జలమండలి రిజర్వాయర్‌ వద్ద మద్యం తాగాడు. అనంతరం కిశోర్‌.. స్నేహితుని చెప్పులు వేసుకుని వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు సెప్టెంబర్‌ 23న చిక్కడపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. కిశోర్‌ది హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

క్లోరినేషన్‌ ప్రక్రియే కాపాడిందా?
ఈనాడు, హైదరాబాద్‌: 50 రోజులుగా వాటర్‌ ట్యాంక్‌లోనే మృతదేహం ఉండటం...ఆ నీరే నాలుగు బస్తీలకు సరఫరా అవుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. దాదాపు నాలుగు కాలనీలకు చెందిన 15-20 వేల మందిపై ఈ ప్రభావం పడింది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్యంపై ఆరా తీశారు.  బుధవారం స్థానికంగా వైద్య శిబిరాలు నిర్వహించింది. పలువురికి పరీక్షలు నిర్వహించారు. ఇద్దరు, ముగ్గురు తమకు వాంతులు అయ్యేలా ఉన్నాయని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకెళ్లడంతో పరిశీలించి మందులిచ్చారు. రిసాలగడ్డ రిజర్వాయర్‌ సామర్థ్యం 900 కిలోలీటర్లు. బాకారం, శివస్తాన్‌పూర్‌, రిసాలగడ్డ, ఎస్‌ఆర్‌కేనగర్‌ బస్తీలకు ఈ జలాన్ని రోజు విడిచి రోజు సరఫరా చేస్తుంటారు. జలమండలి మూడు విడతల్లో నీటిని క్లోరినేషన్‌ చేస్తుంది. తొలుత ప్రధాన రిజర్వాయర్‌లోకి చేరకముందే  క్లోరిన్‌ కలుపుతుంది. అక్కడ నుంచి సర్వీసు రిజర్వాయర్‌లోకి వచ్చేటప్పుడు నీటిలో క్లోరిన్‌ కలుపుతుంది. తుదిగా ట్యాంకు నుంచి ఇళ్లకు చేరేటప్పుడు మరోసారి క్లోరినేషన్‌ ప్రక్రియను చేస్తుంది. దీంతో ట్యాంకులో శవం చాలా రోజులు ఉన్నా అనారోగ్య సమస్యలు తలెత్తలేదని వైద్య సిబ్బంది తెలిపారు. ఎంత క్లోరినేషన్‌ చేసినా.. నీటిని బాగా మరిగించి, చల్లారిన తర్వాత వడబోసి తాగడం మేలని వైద్యులు సూచిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని