Ts News: క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారు: శశాంక్ గోయల్
హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్‌కాస్టింగ్, వీడియోగ్రఫీ ద్వారా పోలింగ్ ప్రక్రియను రికార్డ్ చేస్తామని తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓటరు స్లిప్పులను ఇప్పటికే ఓటర్లకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు శశాంక్ గోయల్ వివరించారు. ఓటర్లందరూ మాస్క్ ధరించి పోలింగ్ కేంద్రానికి రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. క్యాంపు రాజకీయాలపై ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెల్లడించారు. క్యాంపు రాజకీయాలపై అధికారులు దర్యాప్తు చేశారని శశాంక్ గోయల్ చెప్పారు.