logo

Hyderabad News: బేగంపేట్‌ క్లబ్‌ టాలీవుడ్‌లో యువతుల అసభ్య నృత్యాలు 

యువతులతో అసభ్యంగా నృత్యాలు చేయిస్తూ.. అర్ధరాత్రిదాటాక కూడా మద్యం సరఫరా చేస్తున్న క్లబ్‌టాలీవుడ్‌ పబ్‌పై ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ....

Updated : 12 Dec 2021 10:10 IST

ఇద్దరు పబ్‌ యజమానుల అరెస్ట్‌ 

ఈనాడు,హైదరాబాద్‌, న్యూస్‌టుడే, పంజాగుట్ట: రాజధాని నగరం నడిబొడ్డున బేగంపేట్‌లోని కంట్రీక్లబ్‌లో యువతులతో అసభ్యంగా నృత్యాలు చేయిస్తూ.. అర్ధరాత్రిదాటాక కూడా మద్యం సరఫరా చేస్తున్న క్లబ్‌ టాలీవుడ్‌ పబ్‌పై ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు శుక్రవారం అర్ధరాత్రి వేళ దాడులు నిర్వహించారు. మూడుగంటల పాటు తనిఖీలు నిర్వహించి పబ్‌ యజమానులు ఎన్‌.వేణుగోపాల్‌, ఆర్‌.సాయిభరద్వాజ్‌ను అరెస్ట్‌ చేశారు. పబ్‌లో ఉన్న 33 మంది పురుషులు, అసభ్యంగా నృత్యాలు చేస్తున్న 9మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. పబ్‌ మేనేజర్‌ రాము పారిపోగా, ఇద్దరు మేనేజర్లు సహా 42మందిని పంజాగుట్ట పోలీసులకు అప్పగించామని టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు తెలిపారు. గతంలో లిస్బన్‌ పబ్‌ పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తుంటే  కఠిన చర్యలు తీసుకున్నారు. మళ్లీ క్లబ్‌ టాలీవుడ్‌ అంటూ పేరు మార్చారని వివరించారు. 

కురచ దుస్తులు... ప్రత్యేక గదులు...

మద్యం తాగేందుకు వచ్చే యువకులు, వృత్తినిపుణులు, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లను ఆకర్షించేందుకు వేణుగోపాల్‌, సాయిభరద్వాజ్‌లు నాలుగైదేళ్ల నుంచి అనైతిక కార్యక్రమాలకు తెరతీశారు. పబ్‌కు వస్తున్న కొందరు యువతులకు డబ్బు ఆశచూపించి.. కురచదుస్తులు వేసుకుని అసభ్యంగా నృత్యాలు చేయాలంటూ సూచించేవారు. పబ్‌కు వస్తున్న యువకులను ఆకర్షించేందుకు యువతులు వారివద్దకు వెళ్లి నృత్యాలు చేసేవారు. మరికొందరు యువతులను ప్రత్యేక గదుల్లోకి పంపించేవారు. వారికి రోజుకు రూ. వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. పోలీసుల దాడుల్లో పబ్‌లో అసభ్య, అశ్లీల కార్యకలాపాలు వెలుగుచూశాయి. 

నాలుగేళ్ల నుంచీ అంతే...

బేగంపేట్‌లో లిస్బన్‌ పబ్‌ నిర్వాహకులు నాలుగేళ్ల నుంచి అసభ్య, అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తున్నారంటూ పోలీసులు తెలిపారు. తమకు సమాచారం అందినప్పుడల్లా వెళ్లి యజమానులను అరెస్ట్‌ చేస్తున్నామని వివరించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో దాడులు నిర్వహించి లైసెన్స్‌ సీజ్‌ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరగా.. కొద్దిరోజులు పబ్‌ను మూసేసిన వేణుగోపాల్‌ తర్వాత క్లబ్‌ టాలీవుడ్‌ పేరుతో పబ్‌ ప్రారంభించాడని పోలీసులు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని