logo

Crime News: నీకు మేమక్కర్లేదు.. ఈ జీవితం మాకక్కర్లేదు

‘‘నా హజ్బెండ్‌ సైకో, శాడిస్ట్‌. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడు.  అతడి అనుమానాలను భరించలేను. మా అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది.. చేస్తోంది ఆలోచించుకో. పిల్లలకి, నాకు ఏం చేశావ్‌. జత వస్త్రాలు కొన్నావా!

Published : 12 Dec 2021 07:17 IST

 భర్త వేధింపులు తాళలేక ఇద్దరు పిల్లలు సహా గృహిణి ఆత్మహత్య 

దంపతులు కుసుమ, సాయికుమార్‌

‘‘నా హజ్బెండ్‌ సైకో, శాడిస్ట్‌. ఊరంతా అప్పులు, మా బంగారం అమ్మేశాడు.  అతడి అనుమానాలను భరించలేను. మా అక్క చెల్లెళ్లనీ తప్పుగా చూస్తాడు. సాయి నువ్వు చేసింది.. చేస్తోంది ఆలోచించుకో. పిల్లలకి, నాకు ఏం చేశావ్‌. జత వస్త్రాలు కొన్నావా! చదివిస్తున్నావా! నా పిల్లలకి నేనంటే పిచ్చి. నేను లేందే వాళ్లను ఎవరూ చూస్కోరు. అందుకే తీస్కొని పోతున్నా’’

- ఇంట్లోని గోడపై స్వాతి రాసిన ఆత్మహత్య లేఖ

ఏపీలోని రాజమహేంద్రవరానికి చెందిన జగన్నాథం, శారద దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. రాజేంద్రనగర్‌ ఫోర్టువ్యూ కాలనీకు వచ్చి స్థిరపడ్డారు. రెండో కుమార్తె స్వాతికుసుమ(32) ఇంజినీరింగ్‌ చదివేటప్పుడు వెస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సాయికుమార్‌(32)ను ప్రేమించింది. ఆరేళ్ల క్రితం స్వాతి సోదరి దగ్గరుండి కులాంతర వివాహం జరిపించింది. తొలుత యూసుఫ్‌గూడలో ఉండేవారు. భార్యభర్తలిద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. భార్య గర్భం దాల్చటంతో ఉద్యోగం మాన్పించాడు. అత్తవారింట గొడవల వల్ల ఫోర్టు వ్యూకాలనీకు మకాం మార్చారు. వారికి తన్విక్‌(4), శ్రేయ(3) ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా దంపతుల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. అప్పులు తీర్చాలంటూ భార్యను వేధించసాగాడు. నెల క్రితం అత్త అతనికి రూ.2.50 లక్షల రుణం ఇప్పించింది. శుక్రవారం రాత్రి విధులకు వెళ్లిన సాయికుమార్‌ శనివారం ఉ. 5 గంటలకు వచ్చి హాలులో నిద్రపోయాడు. సాయంత్రం నిద్రలేచి, పడకగదిలో ఉన్న భార్య, పిల్లల్ని పిలిచాడు. స్పందన లేకపోవడంతో తలుపులు పగులకొట్టినట్టు పోలీసులకు తెలిపాడు. అప్పటికే భార్య, పిల్లలు మరణించారని వివరించాడు. స్వాతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు అతడు ఇంట్లోనే ఉన్నాడని ఆరోపిస్తున్నారు. భార్య ఆత్మహత్య చేసుకుంటున్నా సాయి పట్టించుకోలేదని మృతురాలి సోదరి ఆరోపించారు. పిల్లలను అల్లుడే హత్యచేశాడని స్వాతి తల్లి శారద ఆరోపించారు. సాయికుమార్‌ ఓ మహిళతో సన్నిహితంగా మెలుగుతున్నాడని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై భార్య నిలదీయటంతోనే గొడవలు ఎక్కువయ్యాయన్నారు. 

- ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, రాజేంద్రనగర్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని