Hyderabad News: నాకు సలాం చేయవా?
వ్యాపారిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే.. కేసు నమోదు
చాంద్రాయణగుట్ట, న్యూస్‌టుడే: ‘25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న నాకు సలాం చేయవా’ అంటూ ఓ యువకుడిపై దాడి చేసిన చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌పై హుస్సేనీ ఆలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ నరేష్ కథనం ప్రకారం చార్మినార్ పంచమొహల్లా ప్రాంతంలో ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ఇంటి పక్కన నివసించే సెల్ఫోన్ల వ్యాపారి గులాం గౌస్ జిలాని(35) శనివారం అర్ధరాత్రి తన ఇంటి ముందు స్నేహితునితో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో తన ఇంటికి కారులో చేరుకున్న ఎమ్మెల్యే కారు దిగి ఇద్దరు గన్మెన్లతో జిలాని వద్దకు వచ్చి నాకు సలాం చేయవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు వచ్చిన విషయం గమనించలేదని, అయినా నేనెందుకు సలాం చేయాలని అతడు ప్రశ్నించాడు. దీంతో ఎమ్మెల్యే దుర్భాషలాడుతూ చెంప దెబ్బలు కొట్టాడు. ఎమ్మెల్యే తనయులు, మజ్లిస్ కార్యకర్తలు అతడ్ని బెదిరించారు. ఎమ్మెల్యే తనను దుర్భాషలాడి దాడి చేశారని, ఆయన కుమారులు బెదిరింపులకు దిగారని, బంధువు రివాల్వర్‌తో బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ముంతాజ్ అహ్మద్ ఖాన్‌పై ఐపీసీ 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేపై మజ్లిస్ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సైతం ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.