logo

Crime News: భారత్‌ స్విస్‌బ్యాంక్‌.. ఖాతాలో రూ.10వేల కోట్లు!

అడ్డదారిలో రూ.కోట్లు కొట్టేసేందుకు మాయగాళ్లు వేసిన ఎత్తుగడను నమ్మి ఎంతోమంది కోట్లాది రూపాయలు మోసపోయారు.  పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.1.31 కోట్లు, కారు, సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

Published : 16 Dec 2021 08:43 IST

ఈనాడు, హైదరాబాద్‌ జీడిమెట్ల, న్యూస్‌టుడే: అడ్డదారిలో రూ.కోట్లు కొట్టేసేందుకు మాయగాళ్లు వేసిన ఎత్తుగడను నమ్మి ఎంతోమంది కోట్లాది రూపాయలు మోసపోయారు.  పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి రూ.1.31 కోట్లు, కారు, సెల్‌పోన్లు, ల్యాప్‌ట్యాప్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.కోటి 76 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. బుధవారం బాలానగర్‌ డీసీపీ కార్యాలయంలో డీసీపీ పి.వి.పద్మజ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. దేవనాగేరి సత్యనారాయణ(53) స్వస్థలం కర్ణాటకలోని బెల్గాం. ఇనుము తుక్కు వ్యాపారి. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో లక్షలాదిరూపాయలు మోసపోయి మాయగాడిగా కొత్త అవతారమెత్తాడు. వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని పథకాన్ని అమలు పరిచాడు. ఉక్కు పరిశ్రమలో పనిచేసేటప్పుడు యజమాని తన పేరిట సెకండ్‌ఛానల్‌ (ఐసీఐసీఐ) ఖాతాలో రూ.10,000 కోట్లు జమ చేశారని, యజమాని మరణంతో లావాదేవీలు నిలిచిపోయాయంటూ కొన్ని పత్రాలను రుజువుగా చూపేవాడు.

ఆ ఖాతాలోని నగదును ఇతర ఖాతాల్లోకి మళ్లించేందుకు సెకండ్‌ ఛానల్‌లో ఖాతా తెరవాలి. రహస్య బ్యాంకు ఖాతా ద్వారా ట్రేడ్‌ ప్రాఫిట్‌ ఫండ్‌ తో 1:3 నిష్పత్తిలో లాభాలు వస్తాయంటూ ఆశ చూపేవాడు. దీనిపై మరింత నమ్మకం కలిగించేందుకు బాధితులను విమానాల్లో దిల్లీ తీసుకెళ్లేవాడు. అక్కడ ఖరీదైన హోటళ్లలో విందులు, వినోదాలతో ముంచేవాడు. అక్కడ సత్యనారాయణ సెకండ్‌ఛానల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ అంటూ అజయ్‌పాల్‌సింగ్‌ అలియాస్‌ ప్రియరంజన్‌ నాయక్‌ను పరిచయం చేసేవాడు. సమావేశాల్లో బాధితులను అకట్టుకునేలా కోట్లల్లో లావాదేవీలు జరుగుతున్నట్టు చర్చించేవాడు. దిల్లీలోని సెకండ్‌ఛానల్‌ బ్యాంకు వద్దకు తీసుకెళ్లి హడావుడి చేసేవాడు. ఖాతా తెరిచేందుకు స్లాట్‌బుకింగ్‌, ఎకౌంట్‌రెంట్‌, మీటింగ్స్‌ తదితర వాటికి ఛార్జీలు చెల్లించాలంటూ బాధితులతో రూ.18 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకూ తన ఖాతాల్లో నగదు జమ చేయించుకున్నాడు. సత్యనారాయణ తన కమీషన్‌ను మినహాయించుకుని మిగతా సొమ్మును రేఖామూవీస్‌ పేరుతో ఉన్న ఖాతాకు మళ్లించేవాడు. నగరానికి చెందిన ముగ్గురు బాధితులు.. ఇది నిజమని భావించి రూ.2.1కోట్లు అతడు చెప్పిన బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. మోసపోయినట్టు పోలీసులకు ఫిర్యాదుతో చేయడంతో ముఠా బండారం బట్టబయలైంది. దేవనాగేరి సత్యనారాయణ, ప్రియరంజన్‌నాయక్‌, కూడికల ప్రేమ్‌ కిషోర్‌, విశాల్‌ సక్పాల్‌, సుశాంత్‌ ప్రేమ్‌ దాస్‌ గౌరవ్‌లను నిందితులుగా గుర్తించారు. వీరిలో ప్రియరంజన్‌ నాయక్‌, సుశాంత్‌ప్రేమ్‌దాస్‌ గౌరవ్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. నిందితులను పోలీసు కస్టడీకు తీసుకున్నారు.

అసలు సూత్రధారి బ్యాంకు ఉద్యోగి.. భారతదేశంలో స్విస్‌బ్యాంకు. ఐసీఐసీఐ ద్వారా జరిగే ఆర్థిక లావాదేవీల్లో రూ.వేలకోట్ల నగదు ఉంది. రహస్యంగా జరిగే ట్రేడింగ్‌తో రూ.కోటి పెట్టుబడితో రూ.70లక్షలు లాభం పొందవచ్చంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాలో కీలక సూత్రదారి కూడికల ప్రేమ్‌కిషోర్‌(48) దమ్మాయిగూడ వాయుశక్తినగర్‌ నివాసి. ఐసీఐసీఐలో గృహరుణాల విభాగంలో పనిచేశాడు. బ్యాంకులో జరిగే లావాదేవీలపై పట్టుంది. దిల్లీలోని ఒక బ్యాంకు 3శాతానికే రుణాలు ఇస్తున్నట్టు తెలుసుకుని పరిశీలించేందుకు అక్కడకు వెళ్లాడు. అడ్డదారిలో డబ్బు సంపాదనకు మోసాలను మార్గంగా ఎంచుకున్నాడు. అజయ్‌పాల్‌సింగ్‌, సత్యనారాయణతో కలసి పక్కా పథకం ప్రకారం సెకండ్‌ ఛానల్‌ ఖాతాలను తెరమీదకు తెచ్చాడు. కొద్దిపెట్టుబడితో లాభాలు వస్తాయనే ఆశతో వచ్చిన వారిని నమ్మించేలా నక్షత్రాల హోటళ్లలో సమావేశాలు, విమానాల్లో ప్రయాణాలు ఏర్పాటు చేసేవాడు. సింగపూర్‌, మలేషియా వంటి ప్రాంతాలకూ తీసుకెళ్లేవాడు. ఐసీఐసీఐ సెకండ్‌ఛానల్‌ ఖాతాలు ఉన్నట్టు రుజువులుగా నకిలీ పత్రాలతో చూపేవాడు. ట్రేడింగ్‌ ద్వారా ఖాతాలను తిరిగి వాడుకలోకి తీసుకు వచ్చేందుకు వివిధ రకాల రుసుముల పేరుతో బాధితుల నుంచి తమ బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ చేయించుకునేవాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని