logo

Cyber Crime: హైదరాబాద్‌లో సైబర్‌ క్రైమ్‌.. అమెరికా పోలీసుల దర్యాప్తు

హైదరాబాద్‌లో జరిగిన సైబర్‌ నేరంపై అమెరికా పోలీసులు(ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేపట్టారు. జంతువులకు వేసే కరోనా టీకా నూనెతో వ్యాపారం చేద్దామంటూ గీతానారాయణ్‌, బెంజిమెన్‌,

Updated : 17 Dec 2021 07:37 IST

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో జరిగిన సైబర్‌ నేరంపై అమెరికా పోలీసులు(ఎఫ్‌బీఐ) దర్యాప్తు చేపట్టారు. జంతువులకు వేసే కరోనా టీకా నూనెతో వ్యాపారం చేద్దామంటూ గీతానారాయణ్‌, బెంజిమెన్‌, లక్ష్మి పేర్లతో ముగ్గురు నైజీరియన్లు తన వద్ద రూ.11.80 కోట్లు స్వాహా చేశారంటూ ప్రవాస భారతీయ(ఎన్నారై) వైద్య నిపుణుడు డాక్టర్‌ చంద్రశేఖర్‌ హైదరాబాద్‌లో నాలుగు నెలల క్రితం ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆతర్వాత అమెరికా వెళ్లిన బాధితుడు సెయింట్‌ లూసియానా పోలీసులకూ ఫిర్యాదు చేశారు. నైజీరియన్లు నగదు కొల్లగొట్టి మళ్లించిన ఖాతాలు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో ఉండడంతో ఎఫ్‌బీఐ పోలీసులు వేగంగా స్పందించారు. కొద్ది రోజుల్లోనే దుబాయ్‌, అమెరికాలోని ఆ బ్యాంకు శాఖల నుంచి వేర్వేరు ఖాతాలకు వెళ్లిన రూ.1.80 కోట్లను ఫ్రీజ్‌ చేశారు. బాధితుడికి మెయిల్స్‌ పంపేందుకు నైజీరియన్లు ఉపయోగించిన ఐపీ చిరునామాలు దుబాయ్‌వని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. ఇలా రెండు దేశాల్లో నమోదైన సైబర్‌ నేరంపై పోలీస్‌ అధికారులు సమాంతరంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు దుబాయ్‌లో ఉన్నారా? లేదా కొద్దిరోజులు అక్కడికెళ్లి సైబర్‌ నేరం చేశారా? అన్న కోణాల్లో సైబర్‌క్రైమ్‌ పోలీసులు పరిశోధిస్తున్నారు. ఈ మోసానికి సంబంధించిన సమాచారాన్ని ఎఫ్‌బీఐ అధికారులకు పంపించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని