logo

Crime News: హైదరాబాద్‌ శివారులో పంజా విసిరిన దొంగలు

నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగల ముఠా పంజా విసిరింది. ఏకంగా పది ఇళ్లలోకి చొరబడి

Published : 18 Dec 2021 08:38 IST

అబ్దుల్లాపూర్‌మెట్‌, న్యూస్‌టుడే: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాటసింగారంలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగల ముఠా పంజా విసిరింది. ఏకంగా పది ఇళ్లలోకి చొరబడి అందినకాడికి సొత్తు ఎత్తుకెళ్లారు. పోలీసులు, స్థానికులు, బాధితుల కథనం ప్రకారం.. బాటసింగారంలోని మోడెపు శివుడు, పొన్నాల మంగ, బొంతల రాజు, అబ్దుల్‌మజీద్‌, ఎర్రవెళ్లి మురళిచారి, కాసుల రమేష్‌, ఎం.గోవింద్‌, సరిపల్లి వెంకటేష్‌, శ్రీనివాస్‌ తదితరుల ఇళ్ల తాళాలు గురువారం రాత్రి బద్దలుగొట్టిన దొంగలు.. బంగారు, వెండి నగలు, నగదు అపహరించుకెళ్లారు. శుక్రవారం ఉదయం చోరీలు జరిగినట్లు గుర్తించిన స్థానికులు ఆయా ఇళ్ల యజమానులకు, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆయా ఇళ్లను ఎల్బీనగర్‌ డీసీపీ సన్‌ప్రీత్‌ సింగ్‌, క్రైం డీసీపీ యాదగిరి, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, అబ్దుల్లాపూర్‌మెట్‌ సీఐ స్వామి పరిశీలించారు. మొత్తం తొమ్మిది ఇళ్ల తాళాలు పగలగొట్టిన దొంగలకు ఆరు ఇళ్లలో సొత్తు చేతికి చిక్కింది. మూడు ఇళ్లలో చోరీకి విఫలయత్నం చేశారు. మొత్తం 4.2 తులాల బంగారం, 85 తులాల వెండి ఆభరణాలు, రూ.35వేల నగదు చోరీ అయినట్లు పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఇది కరడుగట్టిన ముఠా పని అయిఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల నిఘా లేనివి, గ్రామానికి చివర తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకోవడం చూస్తే ఈ తరహా దొంగతనాల్లో ఆరితేరిన ముఠా పనిఅయి ఉంటుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని