logo

TS News: ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులకు డబ్బులు వసూలా?

ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 సంచలన తీర్పు వెలువరించింది.

Updated : 21 Dec 2021 08:17 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ముద్రిత లోగో ఉన్నా లేకున్నా వినియోగదారులకు ఉచితంగానే చేతి సంచులు(క్యారీబ్యాగ్స్‌) ఇవ్వాలంటూ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌-3 సంచలన తీర్పు వెలువరించింది. వినియోగదారుల వద్ద చేతి సంచి కోసం వసూలు చేసిన రూ.3.50 తిరిగి చెల్లించడంతో పాటు, పరిహారంగా రూ.1,000, న్యాయ సేవాకేంద్రానికి రూ.1,000 చెల్లించాలని హైదర్‌నగర్‌ డీమార్ట్‌ శాఖను ఆదేశించింది. తార్నాకకు చెందిన భగేల్కర్‌ ఆకాశ్‌కుమార్‌ 2019 మే 11న హైదర్‌నగర్‌లోని డీమార్ట్‌లో సరకులు కొనుగోలు చేశారు. బిల్లు రూ.602.70 అయ్యింది. ఇందులో ప్లాస్టిక్‌ బ్యాగుకు రూ.3.50 వసూలు చేశారు. సంస్థ పేరు ముద్రించినా తన వద్ద ఛార్జీ వసూలు చేశారంటూ ఫిర్యాదీ హైదరాబాద్‌ జిల్లా వినియోగదారుల కమిషన్‌ని ఆశ్రయించారు. స్పందించిన డీమార్ట్‌ సంస్థ.. ఫిర్యాదీవన్నీ నిరాధార ఆరోపణలని రాతపూర్వక వివరణ ఇచ్చింది. తమ వద్ద బ్రాండ్‌ పేరుతో ఉన్నవి, లేని బ్యాగులున్నాయని తెలిపింది. అవి తీసుకోవాలా వద్దా? అనేది వినియోగదారుల ఐచ్ఛికమని, వారి సంచులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ వాదనను బెంచ్‌ తోసిపుచ్చింది. వాదనలకు, వాస్తవానికి పొంతన లేదని, వినియోగదారులు తెచ్చుకుంటున్న సంచులను ప్రవేశద్వారం వద్ద ప్రత్యేక కేంద్రంలో ఉంచాలని సూచించడం సబబేనా అని ప్రశ్నించింది. ప్లాస్టిక్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ 2011 ప్రకారం చేతి సంచులు ఉచితంగా ఇవ్వకూడదని సూచిస్తోందని తెలిపింది. 2018 మార్చి 27న సవరించి నోటిఫై చేసిన నిబంధనల ప్రకారం వినియోగదారులకు ఉచితంగానే ఇవ్వాలని సూచించినట్లు బెంచ్‌ వ్యాఖ్యానించింది. పాత నిబంధనలు చూపుతూ వినియోగదారుల నుంచి రుసుము వసూలు చేయడం సబబు కాదని బెంచ్‌ వ్యాఖ్యానించింది. ఇది సేవల్లో లోపమే కాకుండా వినియోగదారులను దోచుకోవడమేనని పేర్కొంది. 45 రోజుల్లో తీర్పు అమలు కాకపోతే చెల్లించాల్సిన మొత్తానికి 18శాతం వడ్డీ కలిపి ఇవ్వాలని ఆదేశించింది.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని