logo

TS News: తండ్రి, కుమార్తెను బలిగొన్న విద్యుత్తు తీగలు

బతుకు దెరువు కోసం వచ్చిన ఓ కుటుంబంలో విద్యుదాఘాతం చీకట్లు కమ్ముకునేలా చేసింది. ఇంటి యజమాని, చిన్న కుమార్తె కరెంట్‌ షాక్‌తో మృత్యువాతపడగా, భార్య ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉంది.

Updated : 28 Dec 2021 07:02 IST

 తల్లి పరిస్థితి విషమం

 

మృతులు బసుదేవమల్లిక్‌, కున్నుమల్లిక్‌

పటాన్‌చెరు అర్బన్‌, న్యూస్‌టుడే: బతుకు దెరువు కోసం వచ్చిన ఓ కుటుంబంలో విద్యుదాఘాతం చీకట్లు కమ్ముకునేలా చేసింది. ఇంటి యజమాని, చిన్న కుమార్తె కరెంట్‌ షాక్‌తో మృత్యువాతపడగా, భార్య ఆసుపత్రిలో విషమ పరిస్థితిలో ఉంది. పాఠశాలకు వెళ్లడంతో పెద్ద కుమార్తె పెను ప్రమాదం నుంచి తప్పించుకుంది. పటాన్‌చెరు సీఐ శ్రీనివాసులు, ఎస్సై రామునాయుడు వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన బసుదేవ మల్లిక్‌(36) పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం పటాన్‌చెరు వచ్చి పాశమైలారం పారిశ్రామికవాడలో కిర్బీ పరిశ్రమలో పని చేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో ఇస్నాపూర్‌ ప్రముఖ్‌నగర్‌లో ఓ భవనం రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం పక్క గదిలో ఓ బాలుడు లోపల నుంచి గడియ పెట్టుకోవడంతో కిటికీలో నుంచి ఇనుప చువ్వ సాయంతో బసుదేవ మల్లిక్‌ తీసే ప్రయత్నం చేశాడు. వెనుక ఉన్న 11 కేవీ విద్యుత్తు తీగలకు ఇనుప చువ్వ తగిలి విద్యుదాఘాతం అయ్యింది. అతనితోపాటు కాళ్ల వద్ద ఉన్న రెండో కుమార్తె కున్నుమల్లిక్‌(2) అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అతని భార్య రేణు మల్లిక్‌ తీవ్రంగా గాయపడింది. పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను చందానగర్‌లో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో వారి పెద్ద కుమార్తె బిద్యాద్రి మల్లిక్‌ పాఠశాలకు వెళ్లింది. ఘటనా స్థలాన్ని డీఎస్పీ భీమ్‌రెడ్డి పరిశీలించారు. పెద్దకుమార్తెను ఇస్నాపూర్‌లో ఉంటోన్న ఆమె చిన్నాన్న తీసుకెళ్లాడు.

రేణు మల్లిక్‌

ఇళ్లకు దగ్గరగా.. పటాన్‌చెరు నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు ఇళ్లకు దగ్గరగా ఉండటంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని