logo
Updated : 31 Dec 2021 12:01 IST

Thagulla Gopal: పశువులు కాసి చదువుకొని..పేదరికాన్ని అక్షరబద్ధం చేసి

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత తగుళ్ల గోపాల్‌

తల్లి ఎల్లమ్మతో గోపాల్‌

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మాడ్గుల: అది 2007 సంవత్సరం. ఎనిమిదో తరగతి చదువుతున్న రోజులు.. నాగార్జునసాగర్‌ వద్ద బీసీ హాస్టల్‌లో ఉన్నా. వాన పడుతోంది. ఆ సమయంలోనూ నా తల్లి ఒక పచ్చడి డబ్బా పట్టుకుని నాకోసం వచ్చి హాస్టల్‌ ముందు నిల్చుని ఉంది. ఆ డబ్బాలోని పచ్చడి నుంచి నూనె కారుతుండటం నాకు ఇప్పటికీ గుర్తే..!

‘‘దారి తెల్వకున్నా..
ఎన్నో దూరాలు దాటి..
నూనె కారిపోతున్న చట్నీ డబ్బాతో..
మా హాస్టల్‌ ముందు నిలబడ్డ
దేవగన్నేరు పువ్వు.. అమ్మ!

- అమ్మ కష్టాన్ని, పరిస్థితిని అక్షరబద్ధం చేసిన క్రమం అద్భుతం.!

కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం అందుకున్న రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి చెందిన తగుళ్ల గోపాల్‌.. ప్రస్తుతం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలం అజీలాపూర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను అనుభవించి చదువు కొనసాగించారు. ఐదో తరగతి పూర్తయ్యాక కుటుంబ పరిస్థితుల దృష్ట్యా చదువు మానేసి పశువులు కాయాల్సి వచ్చింది. గోపాల్‌ ప్రతిభను గమనించిన అదే గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు రాజవర్ధన్‌రెడ్డి ఎంతో ప్రోత్సాహం అందించారు. చదువు కొనసాగించాలని తల్లిదండ్రులను ఒప్పించారు. అలా ఉదయం, సాయంత్రం గొర్రెలు, ఆవులు కాస్తూ మధ్యలో పాఠశాలకు వెళ్లారు. కల్వకుర్తిలో ఇంటర్‌ పూర్తి చేశారు. ఆ సమయంలోనూ రాజవర్ధన్‌రెడ్డి చేయూత అందించారు. తర్వాత నేరెడ్‌మెట్‌లో డీఎడ్‌ పూర్తి చేశారు. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ, పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ తెలుగు పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా స్థిరపడ్డారు.

కవితా ప్రయాణం.. అలా మొదలు..
టీటీసీ చేస్తున్నప్పుడు నగరంలోని త్యాగరాయగాన సభలో ఓ సదస్సుకు హాజరయ్యారు. అక్కడ నారాయణ శర్మ రాసిన అస్తిత్వ పుష్పాలు అనే పుస్తకం చదివారు. అప్పుడే నానీలు రాయడం ప్రారంభించారు. తర్వాత వచన కవిత్వం వైపు మళ్లారు. సమాజంలో అసమానతలు.. పేదరికం.. ఈ రెండూ ప్రాతిపదికగా పాఠకుడికి అర్థమయ్యే భాషలో కవిత్వం రాయడం ప్రారంభించారు. పేదరికాన్ని ఎత్తిచూపుతూ మానవ సంబంధాలు, విలువలను అక్షరబద్ధం చేసి సాధారణ పాఠకుడిలోనూ ఆలోచన రేకెత్తించడం గోపాల్‌ కవిత్వానికే సాధ్యం.

అక్క చనిపోవడం విషాదకర ఘటన
గోపాల్‌కు పదేళ్ల వయస్సు ఉన్నప్పుడు అక్క హంసమ్మ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సంఘటన అతని జీవితంలో తీవ్ర దుఃఖాన్ని నింపింది. అందుకే ఆయన కవిత్వంలో అక్కపై ప్రత్యేకంగా వాక్యాలు రాశారు.

పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు
చిన్నప్పుడు తాను పడిన కష్టాలు మరెవరూ అనుభవించ కూడదని గోపాల్‌ భావిస్తుంటారు. అందుకే ఎనిమిదేళ్లుగా ఊళ్లోని పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెబుతున్నారు.

కవితలు.. పురస్కారాలు
అమ్మపోసిన గంజినీరుపై రాసిన ‘గంజి’, పశువులను కాసిన బాల్యపు స్మృతుల ‘ముల్లుపాఠం’, మహిళలపై అకృత్యాలపై ‘నా బంగారం కదూ’, కుల పట్టింపులపై ‘నొసటిపై గాయం’  కవితలు ఎంతో పేరు తెచ్చాయి. దండకడియం కవితా సంపుటికి 2019లో పాలమూరు సాహితీ పురస్కారం లభించింది. ఈ ఏడాది తెలంగాణ సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు.


దండకడియం వెనుక స్ఫూర్తి అదే

దండకడియం కవితా సంపుటిని తన తాత, ఆయనలాంటి ఎంతోమంది కష్టాలను గమనించి రాసినట్లు చెబుతున్నారు గోపాల్‌. గొర్రెల కాపర్ల వేదన, పేదల జీవితంలో ఎదుర్కొనే ఒడుదొడుకులను పొందుపరిచినట్లు చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని