logo

Cyber Crime: పెళ్లి పేరిట.. ఐదుగురు యువతులకు రూ. లక్షల్లో టోకరా

‘‘నాపేరు డాక్టర్‌ హెర్మాన్‌. .లండన్‌లో స్థిరపడిన భారతీయుణ్ణి. వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను. దక్షిణ భారత్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవారు నాతో మాట్లాడండి’ అంటూ వివాహ వేదికల్లో ప్రకటనలిస్తున్న నైజీరియన్‌ నేరాల చరిత్రను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు

Updated : 05 Jan 2022 07:32 IST

ఒయోంకా

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘నాపేరు డాక్టర్‌ హెర్మాన్‌. .లండన్‌లో స్థిరపడిన భారతీయుణ్ణి. వైద్య నిపుణుడిగా పనిచేస్తున్నాను. దక్షిణ భారత్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఆసక్తి ఉన్నవారు నాతో మాట్లాడండి’ అంటూ వివాహ వేదికల్లో ప్రకటనలిస్తున్న నైజీరియన్‌ నేరాల చరిత్రను సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు. కొద్ది నెలల్లోనే ఐదుగురు యువతులను మోసం చేసి రూ.52లక్షలు స్వాహా చేశాడని తెలుసుకున్నారు. పెళ్లి చేసుకుంటాను.. ముందుగా బహుమతులు పంపుతున్నానంటూ యువతులను నమ్మించేవాడు. తరువాత అతడే విమానాశ్రయ అధికారిగా మాట్లాడి రూ.లక్షల్లో నగదు బదిలీ చేయించుకున్నాడు. దిల్లీలో నివాసముంటున్న నైజీరియన్‌ ఒయోంకాను కొద్దిరోజుల కిందట ఇన్‌స్పెక్టర్‌ గంగాధర్‌ బృందం అరెస్టు చేసింది. కస్టడీకి తీసుకుని విచారించగా.. ఐదుగురు యువతులను మోసం చేసినట్టు అతడు అంగీకరించాడు.

అసోం యువతి సహకారంతో.. దక్షిణాఫ్రికా నుంచి మూడేళ్ల కిందట ఒయోంకా సోల్మన్‌ దిల్లీకి వచ్చాడు. అక్కడుంటున్న నైజీరియన్లను కలిసి వారు చేస్తున్న మోసాలను తెలుసుకున్నాడు. అనంతరం జనక్‌పురిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ల్యాప్‌టాప్‌ కొనుగోలు చేసి వివిధ అంతర్జాల వివాహ వేదికల్లో తనను వైద్య నిపుణుడిగా పరిచయం చేసుకుంటూ వివరాలు అప్‌లోడ్‌ చేశాడు. ఈ క్రమంలోనే అసోంకు చెందిన యువతి దుర్గాదేవి పరిచయమైంది. ఆమెకు తన పథకాన్ని వివరించగా.. అంగీకరించింది. అక్టోబరు 2020నుంచి ఇద్దరూ కలిసి పెళ్లి పేరుతో మోసాలకు తెరతీశారు. ఒయోంకా యువతులతో మాట్లాడుతుండగా.. దుర్గాదేవి కస్టమ్స్‌ అధికారినంటూ బాధితులనుంచి నగదు బదిలీ చేయించేది. ఆ సొమ్ములో పది శాతాన్ని ఆమెకు ఇచ్చేవాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని