logo

TS News: అవినీతిపై శివరాజ్‌సింగ్‌ మాట్లాడటం విడ్డూరం: హరీశ్‌రావు

జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని

Updated : 08 Jan 2022 16:26 IST

సిద్దిపేట: జీవో 317పై రాజకీయ లబ్ధి కోసమే భాజపా నాటకాలు ఆడుతోందని మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. భాజపా జాతీయ నాయకులు ఇష్టారీతిన అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిన్న హైదరాబాద్‌లో తెరాస ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై హరీశ్‌రావు స్పందించారు. సిద్దిపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ 14కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రయత్నిస్తుంటే భాజపా అడ్డుకుంటోదని హరీశ్‌రావు ఆరోపించారు. అవినీతిపై శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వంటి నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 

‘‘శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అవాకులు చవాకులు పేలారు. కుంభకోణాల్లో మునిగిన శివరాజ్‌ సింగ్‌ కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. వంద ఎలుకలు తిన్న పిల్లి శాకహారిని అన్నట్లు ఉంది. శివరాజ్‌సింగ్‌కు తెరాసను, కేసీఆర్‌ను విమర్శించే నైతిక హక్కు లేదు. దొడ్డిదారిన ఎమ్మెల్యేలను కొని శివరాజ్‌సింగ్‌ సీఎం అయ్యారు. తెలంగాణకు మధ్యప్రదేశ్‌కు పోలికే లేదు. ఏ రంగంలో మధ్యప్రదేశ్‌ అభివృద్ధి సాధించింది?మధ్యప్రదేశ్‌లో వ్యాపం కుంభకోణం సంగతి ఏంటి?కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్రమే చెప్పింది’’ అని హరీశ్‌రావు అన్నారు. 

శివరాజ్‌సింగ్‌ దొడ్డిదారిన సీఎం అయ్యారు.. 

శివరాజ్‌సింగ్‌ వ్యాఖ్యలపై హైదరాబాద్‌లో తెరాస మంత్రులు స్పందించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కలిసి శ్రీనివాస్‌గౌడ్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘ సీఎం కేసీఆర్‌కు శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌కు పోలికే లేదు. దొడ్డిదారిన శివరాజ్‌సింగ్ సీఎం అయ్యారు. ప్రజలే అధిష్ఠానంగా కేసీఆర్‌ సీఎం అయ్యారు. ప్రధాని, భాజపా సీఎంలు.. కేసీఆర్‌ను ప్రశంసించలేదా? భాజపా నేతలకు ఉద్యోగులపై నిజంగా ప్రేమ ఉందా?తెలంగాణ మాదిరిగా భాజపా పాలిత ప్రాంతాల్లో జీతభత్యాలు ఇస్తున్నారా?’’ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశ్నించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు