logo

Hyderabad News: ఆ ఐదుగురు ఎవరు? మారుపేర్లతో రూ.కోట్ల మత్తు వ్యాపారం

యువతను మత్తుకు బానిసలు చేస్తూ మాఫియా కోట్లు కూడబెడుతోంది. గోవా, ముంబయిల్లో ఉంటూ నగరంలో చక్రం తిప్పుతోంది. మాదకద్రవ్యాల రవాణా మూలాలను నాశనం....

Updated : 11 Jan 2022 08:20 IST

 సరకు నగరం చేరే వరకు వారి కనుసన్నల్లోనే 

ఈనాడు, హైదరాబాద్‌ రెజిమెంటల్‌బజార్‌, న్యూస్‌టుడే: యువతను మత్తుకు బానిసలు చేస్తూ మాఫియా కోట్లు కూడబెడుతోంది. గోవా, ముంబయిల్లో ఉంటూ నగరంలో చక్రం తిప్పుతోంది. మాదకద్రవ్యాల రవాణా మూలాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో పోలీసు యంత్రాంగం సిద్ధమైంది. ముమ్మరంగా చేపట్టిన తనిఖీల్లో చాలామంది దొరుకుతున్నారు. తాజాగా పోలీసువర్గాలు సేకరించిన సమాచారంలో కీలక వివరాలు వెలుగు చూసినట్లు తెలిసింది. సికింద్రాబాద్‌, పాతబస్తీ, జీడిమెట్ల, కూకట్‌పల్లి, గోల్కొండల్లో మకాం వేసిన సూత్రధారులు తెరవెనుక చక్రం తిప్పుతున్నారు. వీరిలో ఐదుగురు దేశ, విదేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే దళారులు, సరఫరాదారులు, కొనుగోలుదారులతో లావాదేవీలు జరుపుతున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. సముద్రమార్గంలో గోవా, ముంబయిలకు చేరిన మాదకద్రవ్యాలను అక్కడి వ్యాపారుల ద్వారా ప్రధాన సరఫరాదారులకు చేరిన సరకును హైదరాబాద్‌ తీసుకొచ్చేంత వరకూ ఈ ఐదుగురు సమన్వయం చేసుకుంటారని తెలుస్తోంది. మారుపేర్లతో లావాదేవీలు నిర్వహించే వీరిలో ఇద్దరు నైజీరియన్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముంబయి, దిల్లీ, గోవా వంటి ప్రధాన నగరాలకు పర్యాటక వీసాపై వచ్చిన నైజీరియన్లు అక్కడి స్మగ్లర్ల ద్వారా సరుకు సేకరించి.. హైదరాబాద్‌లో చదువుకుంటున్న తమ దేశస్థులకు చేరవేస్తున్నారు. నైజీరియన్లపై సరైన నిఘా లేకపోవటం, మాదకద్రవ్యాల స్మగ్లింగ్‌పై అవగాహన లోపం మాఫియాకు అనుకూలంగా మారాయనే విమర్శలున్నాయి. 

మైనర్లతో సరఫరా.. 

ముంబయి, గోవాల నుంచి బస్సు, ప్రయివేటు వాహనాల ద్వారా మత్తుపదార్థాలు నగరానికి చేరుతున్నాయి. బ్యాగుల్లో కొద్దిమొత్తంలో సరకు తీసుకొస్తుంటారు. ఇటీవల చిక్కిన విక్రేతలు, కొనుగోలు దారుల సెల్‌ఫోన్లలో నెంబర్ల ఆధారంగా పోలీసులు నిఘా పెంచారు. అప్రమత్తమైన స్మగ్లర్లు వాటి రవాణాకు మైనర్లను రంగంలోకి దింపారు. మైనర్ల చేతికి కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ వంటి మత్తుపదార్థాలను ఇచ్చి కొనుగోలుదారుల వద్దకు చేరవేస్తున్నారు. పిల్లల కదలికలను గమనించేందుకు కొందరు ద్విచక్రవాహనాల్లో అనుసరిస్తున్నారు. పుస్తకాల బ్యాగుల్లో ప్యాకెట్లను ఉంచుతున్నారు. 12-15 సంవత్సరాల లోపు బాలురు కావడంతో పోలీసులు అనుమానించరనే ఉద్దేశంతో ఈ మార్గం ఎంచుకున్నట్లు సమాచారం. ముంబయిలో కత్రినా, కరీనా, సల్మాన్‌ తదితర సినీతారల పేర్లను మత్తుపదార్థాల కోడ్‌ భాషగా ఉపయోగిస్తున్నారు. నగరంలో ఆర్డీఎక్స్‌, ఎండీ, స్టఫ్‌, మాల్‌, సినిమా పేర్లను కోడ్‌ పదాలుగా వాడుతున్నారు. 


రూ.వెయ్యి కోట్ల పైమాటే.. 

కొకైన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ ఖరీదైన మత్తుపదార్థాలు. గోవా, ముంబయి నగరాల నుంచి హైదరాబాద్‌ చేర్చితే నాలుగైదు రెట్లు లాభం. ఇక్కడ దాన్ని గ్రాములుగా మార్చి గమ్యానికి చేర్చితే పదిరెట్లు డబ్బు జేబులో పడినట్టే. తేలికమార్గంలో డబ్బు సంపాదనకు యువత స్మగ్లర్లుగా మారుతున్నారు. గ్రేటర్‌ పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్లలో 2021లో పట్టుబడిన మత్తుపదార్థాల విలువ సుమారు రూ.200-250 కోట్ల పైమాటే అని అంచనా. ఖాకీల కన్నుగప్పి, అబ్కారీ దాడులకు దొరక్కుండా నగరంలోకి చేరే వాటి విలువ రూ.1000 కోట్ల వరకూ ఉంటుందంటూ ఓ పోలీసు ఉన్నతాధికారి విశ్లేషించారు. అసలు సూత్రదారులు ఎవరు? తెర వెనుక నుంచి ఇంత పెద్ద మాఫియాను నడిపిస్తున్నదెవరనే వివరాలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మత్తుపదార్థాల రవాణాపై కఠిన వైఖరి అవలంబించటంతో మూడు కమిషనరేట్ల పరిధిలో యాంటీ నార్కొటిక్‌ సెల్‌లను ప్రారంభించి ప్రత్యేక దృష్టిసారించారు. తాజాగా నగర పోలీసులు మాఫియా రాకెట్‌ను ఛేదించారు. అక్కడ లభించిన సమాచారం ఆధారంగా కూపీ లాగుతున్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని