logo

TS News:అడ్డదారిలో సంపాదిద్దామని అడ్డంగా బుక్కయ్యారు!

ఏపీ నుంచి తెలంగాణలోకి గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా రాచకొండ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడింది. ముఠాలోని వి.తిరుపతి(27), అతడి తమ్ముడు మక్తా(25),

Published : 11 Jan 2022 06:58 IST

గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా అరెస్ట్‌


స్వాధీనం చేసుకున్న గంజాయిని పరిశీలిస్తున్న సీపీ మహేశ్‌భగవత్‌

ఈనాడు, హైదరాబాద్‌ నాగోలు, న్యూస్‌టుడే : ఏపీ నుంచి తెలంగాణలోకి గంజాయి రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠా రాచకొండ ఎస్‌వోటీ పోలీసులకు పట్టుబడింది. ముఠాలోని వి.తిరుపతి(27), అతడి తమ్ముడు మక్తా(25), పి.రవీందర్‌(24), వి.కళ్యాణ్‌(19)లను అరెస్ట్‌ చేసి, వారి వద్ద నుంచి 2 కార్లు, 294 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బుచ్చిబాబు, కారం సురేంద్ర దొర కోసం గాలిస్తున్నారు. సోమవారం ఎల్బీనగర్‌ క్యాంపు కార్యాలయంలో రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేసులో ప్రధాన సూత్రదారి వి.తిరుపతి సొంతూరు నాగర్‌కర్నూలు జిల్లా కిస్టంపల్లి తండా. క్యాబ్‌ డ్రైవరైన ఇతను.. ఏడాది క్రితం కారు కొనుగోలు చేశాడు. ఆర్థిక ఇబ్బందులతో వాయిదాలు చెల్లించలేకపోయాడు. గతంలో గంజాయి సరఫరా చేస్తూ జైలు కెళ్లొచ్చాడు. ఈ నేపథ్యంలోనే 25 రోజుల క్రితం మహారాష్ట్రకు చెందిన వ్యక్తి కారు కిరాయికి కుదుర్చుకుని రంపచోడవరం తీసుకెళ్లాడు. అక్కడ నుంచి నగరానికి గంజాయి చేర్చినందుకు రూ.20,000 కిరాయి గిట్టుబాటైంది. ఆ సమయంలో దళారి బుచ్చిబాబు అలియాస్‌ బాపూజీతో పరిచయం ఏర్పడింది. అతడి సహాయంతో గంజాయి రవాణా చేసి ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నాడు. వి.తిరుపతి, అతడి తమ్ముడు మక్తా, పి.రవీందర్‌, వి.కళ్యాణ్‌లు ఈ నెల 7న రెండు కార్లలో రంపచోడవరం చేరారు. బుచ్చిబాబు సహకారంతో అక్కడ 294 కిలోల సరకు కొనుగోలు చేశారు. 8వ తేదీ అర్ధరాత్రి దాటాక బుచ్చిబాబు రెండు కార్లను అటవీ ప్రాంతం దాటించాడు.

ఎస్కార్ట్‌తో పక్కా ప్రణాళిక

ముందు ఎస్కార్ట్‌ వాహనం. వెనుక గంజాయి ఉన్న కారు. వాటి మధ్య కనీసం 2 కి.మీ దూరం. పోలీసుల తనిఖీలను ఎప్పటికప్పుడు చేరేలా ఏర్పాట్లు. చౌటుప్పల్‌ టోల్‌ప్లాజా వద్ద పోలీసు తనిఖీలను గమనించి.. గంజాయి ఉన్న కారును రామన్నపేట వైపు వెళ్లేందుకు మలుపు తిప్పారు. అక్కడ మఫ్టీలో ఉన్న పోలీసులు కారును వెంబడించారు. రామన్నపేట పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకున్నారు. వి.తిరుపతి, మంక్తా, రవీందర్‌, కళ్యాణ్‌లను అరెస్ట్‌ చేశారు. పరారీలో ఉన్న బుచ్చిబాబు, కారం సురేంద్ర దొర కోసం గాలిస్తున్నారు.

ఎవరీ బుచ్చిబాబు?

బుచ్చిబాబు అలియాస్‌ బాబూజీ సొంతూరు దారకొండ. రంపచోడవరం - హైదరాబాద్‌ గంజాయి చేరవేయటంలో కీలకసూత్రదారి. పెద్ద మొత్తంలో సరకు రవాణా చేస్తుంటాడు. ఏజెన్సీ ప్రాంతంలో కొద్దిమేర అడ్వాన్స్‌ చెల్లించి గంజాయి ఇచ్చేందుకు సహకారం అందిస్తాడు. బుచ్చిబాబు కనుసన్నల్లోనే గంజాయి రవాణా సాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతడిపై ఏపీ, తెలంగాణల్లోనూ పలు కేసులున్నట్లు సమాచారం. ఇతడు పట్టుబడితే కీలక సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని