logo

‘సైబర్‌’ వలకు చిక్కి.. రూ.62 వేలు కోల్పోయి..

సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్న ఆన్‌లైన్‌ మోసాలు అందుకు దర్పణం పడుతున్నాయి. బాధితులు సత్వరం స్పందించం ద్వారా కోల్పోయిన సొమ్మును ఫ్రీజ్‌ చేయడానికి వీలవుతోంది.

Published : 15 Jan 2022 00:52 IST

సకాలంలో స్పందించడంతో సొమ్ము ఫ్రీజ్‌

సిద్దిపేట టౌన్‌, వర్గల్‌, న్యూస్‌టుడే: సైబర్‌ నేరగాళ్లు పెట్రేగిపోతున్నారు. జిల్లాలో తరచూ వెలుగు చూస్తున్న ఆన్‌లైన్‌ మోసాలు అందుకు దర్పణం పడుతున్నాయి. బాధితులు సత్వరం స్పందించం ద్వారా కోల్పోయిన సొమ్మును ఫ్రీజ్‌ చేయడానికి వీలవుతోంది. సిద్దిపేటలో శుక్రవారం పోలీసు కమిషనర్‌ శ్వేత తెలిపిన వివరాలు ఇలా.. వర్గల్‌ మండలం సీతారాంపల్లి గ్రామానికి చెందిన నవీన్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. యజమాని సూచన మేరకు ఈ నెల 12న హైదరాబాద్‌లో సామగ్రిని లోడ్‌ చేసి వరంగల్‌లో ఖాళీ చేశారు. తిరుగు ప్రయాణంలో లారీ ఖాళీగా వెళ్లాల్సి రావడంతో కిరాయి నిమిత్తం ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో రవాణా అవసరమైన వారి వివరాలు వెతికాడు. ఆ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌లో తనను సైనికుడిగా పరిచయం చేసుకున్నాడు. వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు ఇంటి సామగ్రి తీసుకు వెళ్లాలని నమ్మబలికాడు. ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్సు కార్డులను వాట్సాప్‌లో పంపించాలనే సూచనతో నవీన్‌ ఆ మేరకు పంపించాడు. ఈ క్రమంలో వరంగల్‌ ఎయిర్‌పోర్టు సమీపంలో సైనిక చెక్‌ పోస్టు వద్ద లారీ లోనికి రావడానికి రూ.20 వేలు కట్టాలని ఉంటుందని సూచించాడు. మొత్తం సొమ్ము కలిపి ఇస్తానని భరోసా ఇచ్చాడు. అందుకు తొలుత వాట్సాప్‌లో క్యూఆర్‌ కోడ్‌ ద్వారా బాధితుడి ఫోన్‌కు రూపాయి పంపించాడు. అతని మాటలు నమ్మిన లారీ డ్రైవర్‌ రూ.20 వేలు పంపించారు. అలా ఏమార్చి మూడు విడతల్లో రూ.62 వేలు ఖాతా నుంచి లూఠీ చేశాడు. తరువాత సదరు నంబరుకు ఫోన్‌ చేయగా స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో అతని సోదరుడు రవీందర్‌కు ఫోన్‌ చేయగా అవగాహన కలిగి ఉన్న అతను జాతీయ సైబర్‌ క్రైమ్‌ రిపోర్టింగ్‌ పోర్టల్‌ హెల్ప్‌ లైన్‌ నంబరు 155260కు ఫిర్యాదు చేశారు. పోలీసులనూ ఆశ్రయించారు. దీంతో కోల్పోయిన సొమ్ము రూ.62 వేలు ఫ్రీజ్‌ అయినట్లు బాధితుడి చరవాణికి సందేశం వచ్చిందని సీపీ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని