logo

కేటాయింపుల్లో ఆలస్యం... పండగకు అందని బియ్యం

బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంలో ఓ లబ్ధిదారు రేషన్‌ దుకాణం నుంచి తనకు రావాల్సిన కోటా బియ్యం తీసుకెళ్లారు. ఆ ఇంటి పక్కనే ఉంటున్న అన్నపూర్ణ కార్డు లబ్ధిదారు వారం రోజులుగా దుకాణం చుట్టూ తిరుగుతున్నా ఇంకా బియ్యం రాలేదని

Published : 15 Jan 2022 00:52 IST

న్యూస్‌టుడే,కొడంగల్‌ గ్రామీణం (బొంరాస్‌పేట)

* బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంలో ఓ లబ్ధిదారు రేషన్‌ దుకాణం నుంచి తనకు రావాల్సిన కోటా బియ్యం తీసుకెళ్లారు. ఆ ఇంటి పక్కనే ఉంటున్న అన్నపూర్ణ కార్డు లబ్ధిదారు వారం రోజులుగా దుకాణం చుట్టూ తిరుగుతున్నా ఇంకా బియ్యం రాలేదని అంటున్నారు.

* దౌల్తాబాద్‌ మండల కేంద్రంలో బియ్యం ఇస్తున్నారని చాటింపు చేయటంతో వచ్చి తీసుకెళ్తున్నారు. ఇంకో దుకాణానికి సరఫరా లేకపోవటంతో వారంతా నిత్యం దుకాణం చుట్టూ తిరుగుతున్నారు. మండలంలో 30 దుకాణాలు ఉండగా ఎనిమిదింటికి బియ్యం సరఫరా కాలేదు.

కొడంగల్‌ నియోజకవర్గంలో బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాల్లోని గ్రామాలకు రేషన్‌ బియ్యం అందలేదు. ఒక్కో ఊరులో కొందరికి అందితే మరి కొందరు ప్రదక్షిణ చేస్తున్నారు. ప్రతి నెలా మొదటి వారంలోనే బియ్యం తెచ్చుకునేవారు. అయితే గత నెలతో పోల్చుకుంటే కోటా పెరగటం, ఉద్యోగుల బదిలీలు కారణంగా కేటాయింపుల్లో ఆలస్యం కావటంతో జాప్యం జరుగుతోంది. కరోనా ప్రభావంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలోనే పేదలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అయిదు కిలోల చొప్పున ఒక్కో లబ్ధిదారునికి 10 కిలోలు ఉచితంగా బియ్యం అందించేందుకు ముందుకొచ్చారు. డిసెంబరులో 5 కిలోల చొప్పున ఇచ్చారు. జనవరిలో మళ్లీ 10 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ప్రతి నెలా 25వ తేదీ నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తుండగా, ఒకటో తేదీ నుంచి 15 వరకు లబ్ధిదారులకు సరఫరా చేస్తుండేవారు. రాష్ట్రస్థాయిలోని సాంకేతిక కారణాలు, ఉద్యోగుల బదిలీల కారణంగా బియ్యం కోటా కేటాయింపుల్లోనే ఆలస్యమైంది. స్టేజీ- 1 పాయింట్‌ నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు 4వ తేదీ నుంచి 20 లోపు పంపిణీకి ఆదేశించారు. సకాలంలో రాకపోవటంతో నియోజకవర్గ స్థాయిలోని గోదాముల నుంచి బియ్యం సరఫరాలో ఆలస్యం జరిగింది. కొడంగల్‌లోని ఎల్‌ఎంఎస్‌ పాయింట్‌ నుంచి బొంరాస్‌పేట, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల్లోని గ్రామాలకు బియ్యం సరఫరా చేస్తుంటారు. మూడు మండలాల్లోని 90 చౌకధరల దుకాణలకు బియ్యం అందించాల్సి ఉండగా 13 నాటికి 74 గ్రామాలకు బియ్యం సరఫరా చేశారు. పండగకు 16 గ్రామాలకు బియ్యం అందలేదు. రాష్ట్రస్థాయిలో జరిగిన కేటాయింపులతోనే సరఫరాలో ఆలస్యం జరిగిందని  కొడంగల్‌ గోదాం ఇన్‌ఛార్జి రవి అన్నారు. కొన్ని గ్రామాలకు సగం కోటాతో పంపించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని