logo

అందుబాటులో అవకాశం.. దృష్టి సారిస్తే ఆదాయం

వ్యాపార రంగంలో పరిగి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. మేజర్‌ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారిన అనంతరం పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ప్రధానంగా గృహ నిర్మాణాలు ముమ్మరమయ్యాయి. నియోజకవర్గ

Published : 15 Jan 2022 00:52 IST

ప్రహరీ వద్ద డబ్బాలు తొలగించిన అనంతరం ఇలా..

పరిగి,న్యూస్‌టుడే: వ్యాపార రంగంలో పరిగి పట్టణం దినదినాభివృద్ధి చెందుతోంది. మేజర్‌ పంచాయతీ నుంచి పురపాలక సంఘంగా మారిన అనంతరం పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ప్రధానంగా గృహ నిర్మాణాలు ముమ్మరమయ్యాయి. నియోజకవర్గ కేంద్రం కావడం, స్థానికంగా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాలు, గురుకులాలు ఉండటంతో స్థానికంగా ఉండేందుకు పరిసర ప్రాంతాలకు చెందిన వారు ఆసక్తి చూపుతున్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా 18,241 ఉంటే ప్రస్తుతం రెట్టింపు స్థాయికి చేరింది. కొత్త కాలనీలు ఏర్పాటయ్యాయి. చిరు వ్యాపారాలు చేస్తూ వేలాది మంది జీవనం కొనసాగిస్తున్నారు. స్టీలు కర్మాగారాలు, పత్తి మిల్లులు, ట్రాక్టరు షోరూంలు ఇలా వివిధ రంగాల్లోనూ ముందడుగు పడుతోంది. దీంతో నిత్యం పట్టణం ప్రజల రాకపోకలతో రద్దీగా మారింది. నగరంలోని కాటేదాన్‌ నుంచి  రాకంచర్లకు పరిశ్రమలు క్రమక్రమంగా తరలిరానున్నాయి. దీంతో వాటి ప్రభావం కూడా పడనుంది. ఇప్పటికే పట్టణంలో దుకాణ సముదాయాలకు డిమాండ్‌ ఏర్పడింది. ప్రధాన రహదారులపై ఉన్న వాటికి అయితే రూ.2నుంచి రూ.5లక్షల వరకు అడ్వాన్సులు చెల్లించి నెల అద్దె రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ఇస్తున్నారు.

ఇదిగో ఇలా..: ఆర్టీసీకి డిపోకు 7.16 ఎకరాలు, బస్టాండుకు 3.09ఎకరాలు కలిపి మొత్తంగా 10.25ఎకరాల విస్తీర్ణంలో స్థలం ఉంది. పట్టణాభివృద్ధిలో భాగంగా మున్సిపల్‌ అధికారులు గంజ్‌రోడ్డులో ఆర్టీసీ బస్టాండు ప్రహరీకి ఆనుకుని ఉన్న డబ్బాలను తొలగించి సింగిల్‌ రోడ్డును విస్తరిస్తున్నారు. పట్టణంలో వ్యాపార పరంగా ఇదే ప్రధాన రహదారి. డబ్బాలను తొలగిస్తే తమకు ఉపాధి లేకుండా పోతోందని కనీసం దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి తమకు ప్రాధాన్యత ఇవ్వాలని గత కొంత కాలంగా చిరు వ్యాపారులు కోరుతున్నారు. కనీసం 40దుకాణాలను ఏర్పాటు చేసేందుకు అనువైన వసతి ఉంది. నెలకు లక్షలాది రూపాయల ఆదాయం సంస్థకు సమకూరనుంది. నష్టాల్లో ఉన్న సంస్థ అదనపు ఆదాయ వనరులపై దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. స్థానికంగా మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రయాణికులు పడరాని పాట్లు పడుతున్నారు. పరిశుభ్రత, పచ్చదనం కూడా కొరవడింది. డిపో అభివృద్ధికి చొరవ చూపాలని కోరుతున్నారు.

ఇలా చేస్తే...: పరిగి డిపోలో సంస్థకు చెందినవి 44, అద్దె బస్సులు 39 ఉన్నాయి. ఇవి నిత్యం సుమారు 30వేల కిలోమీటర్లు రాకపోకలు సాగిస్తున్నాయి. కరోనా కారణంగా గతేడాది నుంచి ఇప్పటి వరకు సుమారు రూ.10కోట్ల నష్టాల్లో కొనసాగుతోంది. ఇంధన ధరలు పెరుగుతున్న కారణంగా సంస్థకు నష్టాలే మిగులుతున్నాయి. బస్టాండు నుంచి డిపోకు, డిపో నుంచి బస్టాండుకు బస్సుల రావాలంటే రోడ్డెక్కుతున్నాయి. మధ్య దూరం సుమారు రానుపోను 300మీటర్ల దూరం ఉంది. దీంతో డీజిల్‌ వృథాగా కాలుతోంది. బస్టాండుకు, డిపోకు మధ్య ఉన్న ప్రహరీని బస్సుల రాకపోకలకు అనువుగా ఉండేంత వరకు తొలగిస్తే చాలు వేల లీటర్ల డీజిల్‌ను ఆదా చేసుకునేందుకు అవకాశముంది. దీంతో నష్టాల నుంచి బయటపడేందుకు మరో మార్గమని పలువురు సూచిస్తున్నారు. డిపో మేనేజర్‌ కార్యాలయం ముందు కూడా దుకాణ సముదాయానికి అవకాశముంది.

ఉన్నతాధికారులకు విన్నవిస్తాం: బద్రీనారాయణ, డిపో మేనేజర్‌
స్థానికంగా దుకాణ సముదాయాలకు ఉన్న డిమాండ్‌ను, అవకాశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం. బస్‌డిపో నుంచి బస్టాండులోకి బస్సుల రాకపోకలకు ప్రహరీ తొలగించాలని గతంలో ఓసారి పరిశీలించారు. దీనిని కూడా వివరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని