logo

మార్గనిర్దేశం సరే.. అమలెప్పుడో మరి!

పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేశారు. నెలలు గడిచినా అమలుకు నోచుకోవడం

Published : 15 Jan 2022 00:52 IST

ముద్రిత పత్రాల జారీలో ఇదీతీరు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ  

కరణ్‌కోట పంచాయతీ కార్యాలయంలో విగణిత

పౌరసేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేయాలని ఆదేశించింది. ఉన్నతాధికారులు సమావేశాలు నిర్వహించి కిందిస్థాయి సిబ్బందికి మార్గదర్శనం చేశారు. నెలలు గడిచినా అమలుకు నోచుకోవడం లేదు. వెరసి వందలాది మంది గ్రామీణులు పట్టణాలు, మండల కేంద్రాల్లోని మీసేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తిస్థాయిలో ప్రారంభిస్తే సౌకర్యంగా మారనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిపై ‘న్యూస్‌టుడే’ పరిశీలనాత్మక కథనం.
జిల్లాలో పంచాయతీలు: 566
విగణితలున్నవి: 225
ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేస్తున్నవి: 20లోపు మాత్రమే

జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు మినహా మిగిలినవి గ్రామాలే. డెబ్భై శాతంపైగా కుటుంబాలు ఇక్కడే నివాసముంటున్నాయి. ఈ క్రమంలో విద్య, ఉద్యోగం, ఉపాధి, ప్రభుత్వ పథకాలు పొందేందుకు, రాయితీల మంజూరుకు, ఉన్నత, గురుకుల విద్యా ప్రవేశ పరీక్షలకు జనన, నివాస, కుల, ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా మారాయి. ముఖ్యంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఏటా ధ్రువపత్రాలు పొందాల్సిన పరిస్థితి. వీటిని సులువుగా పొందేందుకు ప్రభుత్వం చేతిరాతతో పని లేకుండా నేరుగా ఆన్‌లైన్‌లో ముద్రిత పత్రాలు పొందేలా సాంకేతిక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసి నిర్ణీత గడువులోగా తిరిగి అక్కడే ధ్రువపత్రాన్ని పొందే వెసులుబాటు కల్పించింది. ఈక్రమంలో జిల్లా వ్యాప్తంగా 60 మీసేవా కేంద్రాలు మాత్రమే ఉండటంతో గ్రామీణులు మండల కేంద్రాలు, పట్టణాలకు వచ్చి పత్రాలను పొందేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. రవాణా ఛార్జీలు భరించి రావడంతో ఆర్థిక భారంతోపాటు సమయం వృథా అవుతోంది.

పౌరులకు సౌకర్యంగా ఉండేందుకు..
పౌరులు ఇబ్బందులు పడకుండా స్థానికంగా పత్రాలు పొందేలా పంచాయతీరాజ్‌ శాఖ కసరత్తు చేసింది. ఈక్రమంలో ముద్రిత జనన ధ్రువ పత్రాలను గ్రామ పంచాయతీల్లో జారీ చేయాలని ఆదేశించింది. గతంలో పంచాయతీలకు సమకూర్చిన విగణిత, ప్రింటర్‌, స్కానర్‌, బ్యాటరీ వంటి సామగ్రి ద్వారా ఇవ్వాలని సూచించింది. ఈమేరకు డీఎల్‌పీఓ చంద్రశేఖర్‌రావు తాండూరు నియోజకవర్గంలోని పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. నెలలు గడిచినా ఈ ప్రక్రియ మొదలవడం లేదు. కొందరు ఇస్తున్నా, చేతి రాతతో స్టాంపు వేసి ఇస్తున్నారు. దీంతో పారదర్శకతకు వీల్లేకుండాపోతోంది. దీనికితోడు వీటిని నవోదయ, సైనిక్‌ స్కూల్‌ వంటి ప్రవేశ పరీక్షల దరఖాస్తు సమయంలో నిరాకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకం దరఖాస్తులోనూ చేతిరాతలతో జారీ చేసిన జనన ధ్రువపత్రాలను బ్యాంకర్లు అంగీకరించడం లేదు. దీంతో తల్లిదండ్రులు ముద్రిత జనన ధ్రువపత్రాలు పొందేందుకు మీసేవ కేంద్రాలు, తహసీల్‌, ఆర్డీఓ కార్యాలయాలకు చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. పంచాయతీల్లోనే ముద్రిత ధ్రువపత్రాలు జారీ చేస్తే లక్షల మంది గ్రామీణ ప్రజలకు లబ్ధి చేకూరనుంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ దిశగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

ఇలా చేస్తే మేలు..
* పంచాయతీలకు గతంలో సరఫరా చేసిన విగణితలు, సామగ్రిని అందుబాటులోకి తీసుకురావాలి.

* కార్యదర్శుల ద్వారా ముద్రిత ధ్రువపత్రాల జారీ తప్పనిసరి చేయాలి.

* కొత్త పంచాయతీలకు సామగ్రిని సమకూర్చాలి.

* పంచాయతీలకు సమకూర్చిన అంతర్జాల కనెక్షన్‌ ప్రజావసరాలకు వినియోగించాలి.

* ఈ ప్రక్రియను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.

* నామమాత్రపు రుసుం విధిస్తే ఆదాయం సమకూరడంతో నిర్వహణ భారం తప్పనుంది.

* గ్రామస్థులకు సమయం, రవాణా ఛార్జీలు ఆదా అయ్యేందుకు తోడ్పడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని