logo

భక్తిభావ ప్రభంజని.. మోతీమాత!

ఆలయానికో చరిత్ర ఉంటుంది.. దానికి ఎంతో విశిష్టత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది.. అదే భక్త జనవాళి నమ్మకం. మోతీమాత చరిత్ర ఆలాంటిదే. తండాల్లో మలేరియా, ప్లేగు, వంటి వ్యాధులు చుట్టుముట్టి జనం మృత్యువాత పడుతున్న విషాద

Published : 15 Jan 2022 00:52 IST

ఈనెల 16, 17 తేదీల్లో బంజారా జాతర

రాష్ట్రంలోనే ఏకైక ఉత్సవంగా ప్రసిద్ధి

న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌

భవానీమాత

లయానికో చరిత్ర ఉంటుంది.. దానికి ఎంతో విశిష్టత, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఉంటుంది.. అదే భక్త జనవాళి నమ్మకం. మోతీమాత చరిత్ర ఆలాంటిదే. తండాల్లో మలేరియా, ప్లేగు, వంటి వ్యాధులు చుట్టుముట్టి జనం మృత్యువాత పడుతున్న విషాద సమయాన.. జనజాగృతికి ఆమె ఎంతో కృషి చేసింది. ప్రత్యేక పూజలు చేయించి, జనాన్ని ఆధ్యాత్మిక మార్గం వైపు నడిపించింది. ఈ పరిణామాలతో ప్రాణాంతక వ్యాధులు తగ్గుముఖం పట్టాయని పెద్దలు చెబుతుంటారు. అనంతరం ఆమె తండా కూడలిలోని భవానీమాత ఆలయంలో వంద రోజులు అనుష్టానం చేసి, అక్కడే సమాధి అయింది. ఆమె లంబాడీల ఆరాధ్య దైవం మోతీమాత. మొగడంపల్లి మండలం విఠునాయక్‌తండాకు చెందిన మారోణిబాయి, భిక్కునాయక్‌ దంపతుల సంతానం మోతీబాయి ఉప్పర్‌పల్లి తండా కోడలు. భర్త రేఖునాయక్‌ మద్యం బానిసై భార్యాపిల్లలను పట్టించుకోకపోయినా అధ్యాత్మిక చింతనలో గడిపేది.

తెలంగాణ ప్రాంతంలోనే ఏకైక లంబాడీల కుల దైవంగా ఈ ఆలయం ప్రసిద్ధి. తెలంగాణ-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని మొగడంపల్లి మండలం ఉప్పర్‌పల్లి తండాలోని మోతీమాత 27వ జాతర ఆది, సోమవారాల్లో కనులపండువగా జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్నారు. కొవిడ్‌ ఆంక్షల మధ్య ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు భక్తులు మాస్కులు ధరించి రావాలని ఇప్పటికే ప్రచారం ముమ్మరం చేశారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేసి విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఇక్కడి ముడుపుల వృక్షం ప్రత్యేకంగా నిలిచింది.

ఉత్సవాలకు ముస్తాబైన ఆలయం

ఏర్పాట్లు ఇలా..
రెండు రోజుల పాటు జరిగే జాతరకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది. దర్శనంలో ఇక్కట్లు తలెత్తకుండా బారికేడ్లు బిగించారు. చుట్టూ కిలోమీటరు పరిధిలో మినీట్యాంకులతో పాటు నీటి సరఫరా ట్యాంకర్లను ఏర్పాటుచేశారు. అంతర్గత దారులు, హోమ గుండం, టెంకాయలు కొట్టేందుకు ప్రత్యేకంగా దిమ్మె తదితరాలను సిద్దం చేశారు. సమీప తండాల నుంచి కాలినడకన తరలివచ్చి భక్తులు అమ్మవారికి భక్ష్యాలను నైవేద్యంగా సమర్పిస్తారు. మహిళలు సంప్రదాయ నృత్యాలతో తరలివస్తారు.

అధికార యంత్రాంగం సన్నద్ధం..
కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు, రెవెన్యూ, అబ్కారీ శాఖలు పటిష్ట బందోబస్తు నిర్వహించనున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 6న ఎమ్మెల్యే మాణిక్‌రావు సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. 100 మందికి పైగా పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారు. వైద్య శిబిరాలతో పాటు అత్యవసరానికి 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు. ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను సైతం ఏర్పాటుచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని