logo

చేవెళ్లలో విలేకరిపై ఎస్సై దాడి

రహదారి పక్కన వాహనాన్ని నిలిపితే చలానా వేయాలి గాని స్వాధీనం చేసుకోవడం తగదని ఓ వాహనదారు పోలీసులతో వాగ్వాదం చేస్తుండగా వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన విలేకరిపై చేెవెళ్ల ప్రొబేషనరీ ఎస్సై దాడికి పాల్పడ్డాడు.

Published : 15 Jan 2022 01:43 IST

సస్పెండ్‌ చేయాలంటూ పాత్రికేయులు, ప్రజాసంఘాల నిరసన

పాత్రికేయులతో మాట్లాడుతున్న మంత్రి సబితారెడ్డి

చేవెళ్ల, న్యూస్‌టుడే: రహదారి పక్కన వాహనాన్ని నిలిపితే చలానా వేయాలి గాని స్వాధీనం చేసుకోవడం తగదని ఓ వాహనదారు పోలీసులతో వాగ్వాదం చేస్తుండగా వివరాలు తెలుసుకునేందుకు వెళ్లిన విలేకరిపై చేెవెళ్ల ప్రొబేషనరీ ఎస్సై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు, సంఘాల నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి చేవెళ్లకు చెందిన ఓ వ్యక్తి రహదారి పక్కన ద్విచక్రవాహనం నిలిపి మెడికల్‌ షాపులోకి వెళ్లాడు. సమీపంలో చేవెళ్ల ఠాణా పోలీసులు ప్రొబేషనరీ ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి నేతృత్వంలో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. రహదారి పక్కన నిలిపిన వాహనాన్ని పోలీసులు తీసుకెళ్తున్న క్రమంలో వాహన యజమానికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సమీపంలో ఉన్న న్యూస్‌టుడే విలేకరి వివరాలు తెలుసుకునేందుకు వెళ్లగా ...ప్రొబేషనరీ ఎస్‌ఐ విలేకరిని దుర్భాషలాడుతూ, కాలర్‌ పట్టుకుని ఠాణాలోకి లాక్కెళ్లి సెల్‌లోకి నెట్టేశాడు. అనంతరం చేయితో కొట్టగా మరో ఎస్‌ఐ అడ్డుకుని వారించారు. ఈలోగా కొందరు జర్నలిస్టులు అక్కడికి చేరుకుని ధర్నా చేపట్టారు. దీంతో ఏసీపీ రవీందర్‌రెడ్డి వచ్చి విలేకరిని ఇంటికి పంపించారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టు, ప్రజాసంఘాల ప్రతినిధులు శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున రహదారిపై బైఠాయించి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యాదయ్య, ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రొబేషనరీ ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆయన్ని సస్పెండ్‌ చేసేవరకు నిరసన విరమించేది లేదని నినదించారు. చేవెళ్లలో రైతుబంధు విజయోత్సవ సంబరాలలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి సబితారెడ్డి ధర్నా స్థలికి చేరుకుని నిరసనకారులతో మాట్లాడి విషయం తెలుసుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రొబేషనరీ ఎస్సైపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని