logo

లక్ష్యానికి ప్రాణం.. జీవాలకు జీవం

ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి మనుషులు గాయపడితే వెంటనే అంబులెన్స్‌ వస్తుంది. సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర సేవలు అందిస్తారు. అదే మూగజీవాలను ఎవరూ పట్టించుని చికిత్స అందించరు. ఇదే ఓ యువతిని

Published : 15 Jan 2022 01:43 IST

గాయపడ్డ పక్షులు, వీధి కుక్కల సంరక్షణ

ఆదర్శంగా నిలుస్తున్న యువ వైద్యురాలు

ఈటీవీ, హైదరాబాద్‌: ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగి మనుషులు గాయపడితే వెంటనే అంబులెన్స్‌ వస్తుంది. సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర సేవలు అందిస్తారు. అదే మూగజీవాలను ఎవరూ పట్టించుని చికిత్స అందించరు. ఇదే ఓ యువతిని ఆలోచింపజేసింది. మూగజీవాల కోసం ఏదైనా చేయాలన్న ఆమె తలంపు వందలాది శునకాలు, పక్షులు, పిల్లులు, కోతులకు కొత్త జీవితాన్నిచ్చింది.

వేతనంలో నుంచి వెచ్చిస్తూ..
కొత్తపేట చెరుకుతోట కాలనీకి చెందిన డా.సింధూర పోతినేని 2018లో బీడీఎస్‌ పూర్తి చేసింది. అమీర్‌పేట ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తోంది. పీజీ కోసం సిద్ధమవుతున్న ఆమె రోడ్డు, ఇతరత్రా ప్రమాదాల్లో గాయపడిన శునకాలు, పతంగులు ఎగురవేసే క్రమంలో మాంజాకు చిక్కుకుని గాయపడి, విద్యుదాఘాతానికి గురైన పక్షులు విలవిల్లాడి చనిపోకుండా చేరదీసి చికిత్స అందించి ప్రాణం పోస్తోంది. తనకు తెలిసిన ఓ ఆర్నిథాలజిస్ట్‌ సూచనలు స్వీకరించి పక్షులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన ఆమె 120 పైగా పక్షులను కాపాడి స్వేచ్ఛగా వదిలేసింది. మరో 36 రకాల జాతులకు జీవం పోసింది. తండ్రి రాజేంద్రబాబు, తల్లి వనజ ప్రోత్సాహంతోపాటు తనకు వచ్చే వేతనంలో కొంత వెచ్చిస్తూ వాటిని సంరక్షిస్తోంది. ఇప్పటి వరకు 350 పైగా శునకాల్ని కాపాడింది. వీటిలో 150 పైగా తీసుకొచ్చిన కాలనీల్లో వదిలేసింది. 250 పైగా శునకాలకు టీకా వేయించింది. పునరావాసం కల్పించి సంరక్షిస్తున్న శునకాలకు లైలా, బ్రౌనీ, బఠానీ అని పేర్లు పెట్టి ముద్దుగా పిలుస్తుంటే అవి చేసే గారాబం, అల్లరి అంతా ఇంతా కాదు. వీధి కుక్కలే కాకుండా కోతులు, పిల్లులు, కోతులు, బల్లులు, తొండలు, ఉడతలు, పక్షులు, ఇతర మూగజీవాలను రక్షించి సంక్షిస్తుండటంలో నిమగ్నమైంది.

లాక్‌డౌన్‌ వేళ ఆహారం  
శునకాలకు ఆహారం అందిస్తున్న క్రమంలో సరూర్‌నగర్‌ విక్టోరియా మెమోరియల్‌ హోం ప్రాంగణంలో శ్రీవిద్య మట్టిపతి అనే గృహిణి పరిమయమయ్యారు. అప్పటికే ఆమె ఎన్నో వీధి శునకాలను దత్తత తీసుకుని పెంచుతున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో కుటుంబాలు వదిలేసిన ఎన్నో కుక్కలు, ఆకలి అలమటించేవాటిని ఈ ఇద్దరూ చేరదీశారు. ఒక్కో రోజు 200 కుక్కలకు భోజనం పెట్టిన దాఖలాలూ ఉన్నాయి. ఆర్థిక భారమైనా సరే ఈ ఇద్దరూ కలిసి రోజు 125 పైగా కుక్కులకు భోజనం అందించడం ఓ వ్యాపకంగా పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు.

హాని లేని దారంతో పతంగులు ఎగర వేయాలి
- డా.సింధూర పోతినేని

సంక్రాంతి వేళ యువత పతంగుల కోసం వాడే మాంజా గుడ్ల గూబలు, గద్దలు, ఇతర పక్షుల ప్రాణం మీదకు తెస్తోంది. దీన్ని తప్పించడానికి పక్షులకు హాని కలిగించని దారంతో ఎగరేసి సంబరాలు జరుపుకోవాలి. ఇంట్లోనే అత్యాధునిక ఇంక్యుబేటర్లు, కేజెస్‌తో పక్షుల సంరక్షణ కేంద్రం నెలకొల్పాలన్నది నా లక్ష్యం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు