logo

ఆనందాల జల్లు నవకాంతుల పొదరిల్లు

సంక్రాంతి.. జీవితంలో కొత్త వెలుగులను పంచుతుంది. చీకటి నుంచి వెలుగు, అజ్ఞానం నుంచి విజ్ఞానం, చెడు నుంచి మంచి వైపు నడిపిస్తుంది. వారం ముందు నుంచే ఊరావాడ.. చిన్నాపెద్దను ఏకం చేస్తూ..

Published : 15 Jan 2022 01:49 IST

న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

సంక్రాంతి.. జీవితంలో కొత్త వెలుగులను పంచుతుంది. చీకటి నుంచి వెలుగు, అజ్ఞానం నుంచి విజ్ఞానం, చెడు నుంచి మంచి వైపు నడిపిస్తుంది. వారం ముందు నుంచే ఊరావాడ.. చిన్నాపెద్దను ఏకం చేస్తూ.. ఎన్నో ఆనందాలను నింపుతుంది. ఎన్నో ప్రత్యేకతలు, విశేషాల సమాహారమే ఈ వేడుక. మూడు రోజులు.. ఆద్యంతం అలరిస్తుంది. భోగితో మొదలై.. సం‘క్రాంతి’ రూపంలో జీవితంలో నవ కాంతులను నింపుతుంది. కనుమ ద్వారా కనువిందు చేస్తుంది. పతంగుల రెపరెపలు.. అప్పాల కరకరలు.. రంగవళ్లులతో వాకిళ్ల అలంకరణలు.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆస్వాదిస్తే అద్భుతః అనాల్సిందే.

ఎన్నో విశిష్టతలు..
సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చేది మకర సంక్రాంతి. ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. సూర్య భగవానుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతారు. ఈ రోజు నుంచి స్వర్గ ద్వారాలు తెరిచి ఉంటాయని పురాణాలు సూచిస్తున్నాయి. ఈ పండుగ పుష్యమాసంలో వస్తుంది. పుష్యం అనగా పోషణశక్తి కలదని అర్థం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం కావడం వల్ల పండుగలన్నింటిలో ఇది విశిష్టమైంది. దేవతలకు ఇష్టమైన కాలం. కనుమ కర్షకుల పండగ. పాడి పంటలు, పశు సంపద, లక్ష్మీ స్వరూపంగా అర్పించే రోజు.

ముగ్గులో నైపుణ్యం..
ఈ పండగ రాగానే గుర్తుకొచ్చేది ముగ్గులే. మగువలు ముంగిళ్లను రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతారు. ప్రతి వాకిలి.. శోభాయమానంగా వెలుగొందుతుంది. ఇందుకు మగువలు.. ముందు నుంచే సన్నద్ధమవుతారు. చుక్కల ముగ్గులు సహా విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దుతూ ఔరా అనిపిస్తున్నారు. పండుగ రోజు వాకిళ్లు నూతన శోభను సంతరించుకుంటాయి. ఇక ఈ మాసంలో క్రిమికీటకాలు, ఇతరత్రావి ఇళ్లలోకి రాకుండా పేడతో తయారు చేసిన గొబ్బెమ్మలను ఇంటి ముందు, గడపపై పెడతారు.

ఘుమఘుమల వెనుక..
పిండివంటలు.. నోరూరిస్తాయి. సుమారు వారానికి పైగా రకరకాల రుచులను ఆస్వాదిస్తాం. అప్పాలు.. చేగోళ్లు.. సఖినాలు.. మురుకులు.. నువ్వుల ముద్దలు.. అరిసెలు.. ఇలా ఎన్నో ప్రత్యేక వంటలు ఆకట్టుకుంటాయి. వాటిల్లో పోషకాలు పుష్కలం. వాడే పదార్థాలన్నీ రోగ నిరోధకశక్తిని పెంపొందిస్తాయి. వివిధ రకాల విటమిన్లు అందుతాయి. బెల్లంతో తయారు చేసే పిండివంటల ద్వారా కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం లభిస్తాయి.

బుడతల్లో హుషారు..
అప్పటి వరకు బద్ధకంగా ఉండే చిన్నారులు సంక్రాంతి వస్తుందంటే వారిలో ఎంతో హుషారు కనిపిస్తుంది. పతంగుల రెపరెపలు.. దాదాపు నెల రోజుల పాటు కొనసాగుతాయంటే అతిశయోక్తి కాదేమో. చిన్నాపెద్ద కేరింతలు కొడుతూ.. గాలిపటాలు ఎగురవేస్తుంటారు. పతంగం అంటే గరుడపక్షి. కాలస్వరూపుడైన తన వాహనం పక్షిపై దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపు ప్రయాణిస్తున్నాడని చెప్పడానికి సంకేతంగా గాలిపటాలు ఎగురవేస్తుంటారు.


మదిలో కొలువైన ‘మల్లన్న’
మూడు నెలల పెద్దజాతర

న్యూస్‌టుడే, చేర్యాల: తెలంగాణ గ్రామీణ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనం కొమురవెల్లి మల్లన్న ఆలయం. మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా మాలెగాం ప్రాంతంలో ‘ఖండోబా’ (మల్లికార్జున స్వామి) ఆలయం ఉందని, అక్కడి పూజారికి కలలోకి స్వామి వచ్చి తాను కొమురవెల్లిలోని పర్వత గుహలో వెలిశానని చెప్పడంతో ఆయన ఈ ప్రాంతానికి వచ్చి చూడగా.. గుహలో శివలింగం కనిపించింది. ఎదురుగా కూర్చొని పూజలు చేయగా, కొన్నాళ్లకు శివలింగంపై పుట్ట పెరిగిందని, అదే పుట్టమట్టితో ‘మాలెగాం’లోని స్వామి రూపంలో విగ్రహాన్ని నిర్మించారని ప్రతీతి. శివుడే మల్లన్న రూపంలో వెలిశాడని భక్తుల విశ్వాసం. మల్లికార్జున స్వామికి బలిజ మేడలమ్మ, గొల్ల కేతమ్మ ఇద్దరు భార్యలు. స్వామివారి విగ్రహం ‘నాభి’యందు పుట్టు లింగం ఉండటంతో మట్టితో చేసిన విగ్రహమే అయినా శతాబ్దాలు గడుస్తున్నా చెక్కు చెదరడం లేదని పూజారులు చెబుతారు. రేణుకా ఎల్లమ్మ, అంజనేయ స్వామి, వీరభద్రుడి ఆలయాలున్నాయి. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామి కల్యాణోత్సవం జరుగుతుంది. సంక్రాంతి పండగ ముగిశాక వచ్చే మొదటి ఆదివారం మొదలయ్యే జాతర నుంచి ఉగాది ముందు వచ్చే ఆదివారం (పాల్గుణ మాసం చివరిది) రాత్రి జరిగే అగ్నిగుండాలతో ముగుస్తుంది. ఇలా మూడు నెలల పాటు వేడుకలు జరుగుతాయి.


ప్రతి ఆదివారం సందడే..

న్యూస్‌టుడే, శివ్వంపేట: మండలంలోని సికింద్లాపూర్‌ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మూడు నెలల పాటు ప్రతి ఆదివారం జాతర జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి తరలివచిచ స్వామిని దర్శించుకుంటారు. మొక్కులు తీరిన వారు కోరికల రూపంలోనే వెండి, బంగారంతో చేయించి వివిధ రూపాల్లో కానుకలు సమర్పించుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లోనే మరెక్కడా లేనట్లుగా మూడున్నర అడుగుల ఎత్తయిన పాలరాతి లక్ష్మీనరసింహస్వామి విగ్రహం గుట్టపై ప్రతిష్ఠించడం విశేషం. జాతర సందర్భంగా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.


వెయ్యేళ్ల చరిత్ర..

మల్లన్న స్వామి ఆలయం

మిరుదొడ్డి, న్యూస్‌టుడే: మిరుదొడ్డి మండలం వీరారెడ్డిపల్లి, జంగపల్లి గ్రామ శివారులోని బండ మల్లన్న ఆలయంలో జరిగే జాతర జానపదుల జన జాతరగా ప్రసిద్ధి చెందింది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ఏటా సంక్రాంతి నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహిస్తారు. బోనాల ఊరేగింపు, బండ్ల ప్రదర్శన ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడి బండపై వెలిసిన మల్లన్న కొలిచిన భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. గుట్టపై మల్లికార్జున స్వామి, అభయాంజనేయ స్వామి, రాజరాజేశ్వర స్వామి, ఎల్లమ్మ, పోచమ్మ, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాలున్నాయి. సంక్రాంతి రోజు సాయంత్రం చుట్టూపక్కల రైతులు తమ ఎండ్లను, బండ్లను అందంగా అలంకరించి డప్పు చప్పుళ్ల మధ్య ఆలయానికి తీసుకొచ్చి ప్రదర్శన నిర్వహిస్తారు. ఇక గుట్టపై ఉన్న గుండం ఏ కాలంలోనూ ఎండిపోకుండా ఉండటం విశేషం. ఇందులోని జలం తీయగా ఉంటాయి. ప్రజలంతా ఒకే రోజు సామూహికంగా బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది.


ప్రదర్శనగా తరలివెళ్లి..

భక్తులు సమర్పించిన కానుకలతో కొత్తకొండ (మెడలో నోట్లదండ ఉన్న వ్యక్తి)

న్యూస్‌టుడే, అక్కన్నపేట (హుస్నాబాద్‌ గ్రామీణం): అక్కన్నపేట మండలం జనగామ గ్రామంలో సంక్రాంతి వచ్చిందంటే ఎక్కడ లేని సందడి కనిపిస్తుంది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో జరిగే వీరభద్రస్వామి జాతరకు గ్రామస్థులందరూ ఎడ్లబండ్లపై ప్రదర్శనగా వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. జాతరకు 15 రోజుల ముందు నుంచే బండ్లను సిద్ధం చేస్తుంటారు. ఎడ్లు, బండ్లు లేని వారు ప్రత్యేకించి కొనుగోలు చేస్తారు. సంక్రాంతి రోజున అందంగా ముస్తాబు చేసి పూజలు జరుపుతారు. ఇక ఆ రోజు డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగిస్తారు. కత్తులతో ఖడ్గాలు వేస్తారు. వీరభద్రస్వామికి ప్రతినిధిగా భావించే కొత్తకొండ అనే వ్యక్తికి భక్తులు కానుకలు సమర్పిస్తారు. ఆయా వాటిని ఎడ్లబండిపై కొత్తకొండకు వెళ్లి వీరభద్రస్వామికి సమర్పిస్తారు. అతను నెల రోజులు ఉపవాసం చేస్తారు. 60 ఏళ్లుగా సంప్రదాయాన్ని సాగిస్తున్నారు.


ప్రత్యేకం గేవర్‌..

ఇంటి వద్ద గేవర్‌ తయారు చేస్తున్న హన్మప్ప కుటుంబ సభ్యులు

న్యూస్‌టుడే, తాండూరు టౌన్‌: సంక్రాంతి పండగకు తాండూరు పట్టణంలో ఎక్కువగా వినిపించే తీపి వంటకం గేవర్‌. ఇక్కడి హన్మప్ప కుటుంబం దీని తయారీలో సిద్ధహస్తులు. 80 ఏళ్ల కిందట మొదలైన ఈ వంటకం తయారీని ఇప్పటికీ ఓ సంప్రదాయంగా కొనసాగిస్తూ వస్తున్నారు. ఏటా డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు మాత్రమే దీన్ని తయారు చేస్తారు. ఈ సమయంలో కుటుంబసభ్యులంతా శాఖాహారాన్నే తీసుకుంటూ పూర్తి నిష్ఠ పాటిస్తారు. కుటుంబంలోని 24 మంది కలిసి తయారు చేసి విక్రయిస్తుంటారు. గేవర్‌ తయారీకి మైదా పిండితో పాటు నెయ్యి, డాల్డా, పంచదార వినియోగిస్తారు. ఇక్కడి వారు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో ఉండేవారికి ఈ సమయంలో పంపిస్తుంటారు. ఇలా సంక్రాంతి వచ్చిందంటే గేవర్‌ కోసం బారులు తీరుతుండటం ఇక్కడ కనిపిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని