logo

పక్కాగా.. పంటల వివరాలు

యాసంగిలో రైతులు పండిస్తున్న పంటలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని ముందస్తు ప్రకటన నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఏ పంటను సాగు చేసినా సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉంటేనే రాయితీలైనా

Published : 17 Jan 2022 03:27 IST

క్షేత్రస్థాయిలో వ్యవసాయశాఖ ఆరా


పొలంలో పరిశీలిస్తున్న అధికారులు

న్యూస్‌టుడే, పరిగి: యాసంగిలో రైతులు పండిస్తున్న పంటలపై వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రభుత్వం వరి సాగు చేయవద్దని ముందస్తు ప్రకటన నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టారు. ఏ పంటను సాగు చేసినా సమగ్ర సమాచారం అధికారుల వద్ద ఉంటేనే రాయితీలైనా ఇతర ప్రయోజనాలైనా వారి చెంతకు చేరుతుంది. లేదంటే చివరకు రైతులకే అన్యాయం జరిగే అవకాశముంది. ఇందుకోసం క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలనకు శ్రీకారం చుట్టింది. గతంలో విక్రయాల సమయంలో రైతులు పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. కొందరు చివరకు చేసేదేమీ లేక ఇతరుల పేర్లమీద పంట ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వచ్చింది. సదరు రైతు బ్యాంకుల్లో అప్పు ఉంటే బ్యాంకర్లు పట్టుకోవడం అసలు రైతులకు సకాలంలో డబ్బులు అందక పడిన యాతన అంతా ఇంతా కాదు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వ్యవసాయ శాఖ చెబుతోంది.

కమిషనర్‌ కార్యాలయం నుంచే..

తాండూరు, పరిగి, వికారాబాద్‌, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో 2,57,148 మంది రైతులు ఉన్నారు. యాసంగి సాధారణ సాగు 78,985 ఎకరాలు ఉండగా వరి పంట కాకుండా ఇప్పటికే 48వేల ఎకరాలకు పైగా వివిధ రకాల పంటలు సాగులోకి వచ్చాయి. లెక్కల్లో ఎక్కడా పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఒకటికి రెండు సార్లు నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో ఉండే ఏఈఓలు వివరాలను సేకరిస్తే మండల స్థాయిలో వ్యవసాయాధికారులు, డివిజన్‌ స్థాయిలో సహాయ సంచాలకులు, జిల్లా స్థాయిలో జిల్లా వ్యవసాయాధికారులు భాగస్వామ్యం కానున్నారు. ప్రతి వారం విధిగా రెండు గ్రామాలు 20 సర్వేనంబర్లను పరిశీలించాలని వారికి వ్యవసాయ శాఖ కమిషనర్‌ లక్ష్యంగా నిర్ణయించారు. ఎవరెవరు ఏయే మండలాలు, ఏ గ్రామాలు, ఏ సర్వేనంబర్లలో పరిశీలించాలన్నది ఏరోజుకారోజు మాత్రమే కమిషనర్‌ కార్యాలయం నుంచి సమాచారం అందజేస్తున్నారు. దీంతో వారంతా పొలం బాట పట్టారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 20వేల మంది రైతులు 32వేల ఎకరాల్లో సర్వే పూర్తి చేశారు. బషీరాబాద్‌ మండలంలో ఏకంగా మూడు వారాల పాటు పూర్తిచేశారు. దీనిని సత్వరం పూర్తిచేసే విధంగా వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఆమేరకు కసరత్తు చేస్తోంది.

పారదర్శకంగా ఉండాలనే..: గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

చిన్న పొరపాట్లతోనే అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకే ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వాస్తవంగా పండిస్తున్న పంటలు ఏవీ? దిగుబడుల అంచనాల కోసమే పరిశీలన నిర్వహిస్తున్నాం. తాము సాగు చేస్తున్న పంటల వివరాలను కచ్చితంగా నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత వారిదే. లెక్కలు పారదర్శకంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అన్నదాతలు అధికారులకు సహకరించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు