logo

మద్యం మత్తులో బావమరిది హత్య

పండగ పూట మద్యం తాగుతూ సరదాగా మొదలైన ముచ్చట్లు మాటామాటా పెరిగి చివరికి కత్తిపోట్లకు దారి తీశాయి. నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలం వాడిలో శుక్రవారం రాత్రి బావ కత్తితో దాడి చేయగా బావమరిది చనిపోయాడు. మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు..

Updated : 17 Jan 2022 05:28 IST

మాచారెడ్డి, న్యూస్‌టుడే: పండగ పూట మద్యం తాగుతూ సరదాగా మొదలైన ముచ్చట్లు మాటామాటా పెరిగి చివరికి కత్తిపోట్లకు దారి తీశాయి. నిజామాబాద్‌ జిల్లా మాచారెడ్డి మండలం వాడిలో శుక్రవారం రాత్రి బావ కత్తితో దాడి చేయగా బావమరిది చనిపోయాడు. మాచారెడ్డి ఎస్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాలు.. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం లింగయ్యపల్లి తండాకు చెందిన కేతావత్‌ పెంట్యా (37), బావ మలోత్‌ చందర్‌లు వాడి గ్రామంలో చెరకు కొట్టేందుకు వచ్చారు. శుక్రవారం పండగ నేపథ్యంలో ఇద్దరూ కలిసి మద్యం తాగేందుకు సన్నద్ధమయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా మాటామాటా పెరిగింది. ఆగ్రహానికి గురైన చందర్‌ చెరకు నరికే కత్తితో బావమరిదిపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన పెంట్యాను నిజామాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి చనిపోయాడు. పెంట్యా భార్య అనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


భర్తపై కత్తితో దాడి చేసిన భార్య

మెహిదీపట్నం, న్యూస్‌టుడే: భర్తపై భార్య కత్తితో దాడి చేసిన ఘటన లంగర్‌హౌస్‌ ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. శంకర్‌పల్లికి చెందిన సంపూర్ణ(24), అదే ప్రాంతానికి చెందిన కృష్ణ(35) 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. లంగర్‌హౌస్‌ గాంధీనగర్‌కు చెందిన మహిళతో కృష్ణ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సంక్రాంతి రోజున కృష్ణ ఇంటికి రాకపోవడంతో సంపూర్ణ ఆదివారం మధ్యాహ్నం ఆ మహిళ ఇంటికి వెళ్లింది. కృష్ణ అక్కడే ఉండడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. సంపూర్ణ కోపంతో కత్తితో కృష్ణపై దాడి చేసి గాయపర్చింది. అనంతరం స్వయంగా తానే డయల్‌ 100 నంబరుకు ఫోన్‌ చేసి, జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


క్రెడిట్‌ కార్డు పాయింట్లు పెంచుతామని మోసం

నారాయణగూడ, న్యూస్‌టుడే: క్రెడిట్‌ కార్డు రిడీమ్‌ పాయింట్లు పెంచుతామని నమ్మించి రూ.39,612 దోచేశారని ఓ బాధితుడు నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేశారు. హిమాయత్‌నగర్‌ వీధి నంబరు 12లో నివసించే దేవ్‌ ఖివ్‌సారేకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ డివిజన్‌ నుంచి మాట్లాడుతున్నట్లు తెలిపాడు. క్రెడిట్‌ కార్డు రిడీమ్‌ పాయింట్లు పెంచుతామని నమ్మించాడు. రెండు క్రెడిట్‌ కార్డుల నంబర్లతో పాటు సీవీవీ సంఖ్యలు చెప్పమని ఓటీపీలు పంపించాడు. ఆ నంబర్లు సైతం బాధితుడు చెప్పగా ఓ కార్డు నుంచి రూ.39,612 విత్‌డ్రా అయినట్లు సందేశం వచ్చింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ భూపతిగట్టుమల్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని