logo

పండగ పూట కూకట్‌పల్లిలో విషాదం

పండగ పూట రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధి తాళ్లగడ్డకు చెందిన వహీద్‌(22) రెండేళ్లుగా కూకట్‌పల్లి పరిధిలోని

Updated : 17 Jan 2022 05:41 IST

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: పండగ పూట రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడం ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపిన ఘటన కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సీఐ నర్సింగరావు కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పరిధి తాళ్లగడ్డకు చెందిన వహీద్‌(22) రెండేళ్లుగా కూకట్‌పల్లి పరిధిలోని బాలాజీనగర్‌లో ఉంటూ సెంట్రింగ్‌ పనిచేస్తున్నాడు. అతనికి తండ్రి లేడు. తల్లి, దివ్యాంగ సోదరుడు, సోదరి ఉన్నారు. వహీద్‌ సంపాదనే కుటుంబానికి ఆధారం. శనివారం మధ్యాహ్నం మిత్రుడు అమీన్‌పూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌(24)తో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ప్రవీణ్‌ వాహనం నడుపుతున్నాడు. కడప జిల్లా ఖాజీపల్లికి చెందిన చంద్రఓబుల్‌రెడ్డి(27) చింతల్‌ నుంచి మిత్రుడిని కలిసేందుకు కూకట్‌పల్లికి వచ్చాడు. పిల్లర్‌ నంబరు 808 వద్ద జాతీయ రహదారి దాటుతుండగా, ప్రవీణ్‌ వాహనాన్ని వేగంగా నడుపుతూ వచ్చి ఓబుల్‌రెడ్డిని ఢీకొట్టాడు. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. వహీద్‌, ప్రవీణ్‌లను స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వహీద్‌ పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతి చెందాడు. ప్రవీణ్‌ కూకట్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ఓబుల్‌రెడ్డి బంధువులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసి, తాము చికిత్స చేయించుకుంటామని సొంతూరుకు తీసుకెళ్లారు. ఆదివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో అతను చనిపోయినట్లు సమాచారం అందడంతో.. శవపరీక్ష నిమిత్తం ఇక్కడి నుంచి ఏఎస్సై జంగయ్య, కానిస్టేబుల్‌ సురేశ్‌లు అక్కడకు వెళ్లారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందడంతో పాటు మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో మూడు కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని