logo

ఇంటింటా.. కొలువుల కాంతులు

అది ఓ మారుమూల తండా. రహదారులు, రవాణా సౌకర్యాలు లేవు. నివాస సముదాయాల్లో అధ్వాన పరిస్థితులు. అన్ని విధాలా  వెనకబడిన తండా అది. అలాంటి తండా నుంచి అధిక శాతం ప్రభుత్వం ఉద్యోగాలను సాధించిన వారున్నారంటే... నిజంగానే

Published : 18 Jan 2022 02:25 IST

స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహ్మదాబాద్‌ తండా
న్యూస్‌టుడే, నర్సాపూర్‌

అది ఓ మారుమూల తండా. రహదారులు, రవాణా సౌకర్యాలు లేవు. నివాస సముదాయాల్లో అధ్వాన పరిస్థితులు. అన్ని విధాలా  వెనకబడిన తండా అది. అలాంటి తండా నుంచి అధిక శాతం ప్రభుత్వం ఉద్యోగాలను సాధించిన వారున్నారంటే... నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది. కానీ ఇది స్ఫూర్తినందించే వాస్తవం. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉన్నత పదవుల్లో ఉన్నారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న నర్సాపూర్‌ మండలం మహ్మదాబాద్‌ తండాపై ‘న్యూస్‌టుడే’ కథనం..

నాలుగు రాష్ట్రాల జీఎం...
తండాకు చెందిన ఛత్రూనాయక్‌ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్రలకు చెందిన భారత ఆహార సంస్థలో జనరల్‌ మేనేజర్‌గా కొనసాగుతున్నారు. జన్మనిచ్చిన గడ్డపై మమకారంతో ఇతని భార్య సంధ్యారాణి నాయక్‌ను ఎంపీటీసీగా గెలిపించుకున్నారు. ఇతన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలను చేపట్టారు. ఛత్రూనాయక్‌ కుమారుడు అనురాగ్‌ సినిమాల్లో నటిస్తుంటారు. తద్వారా తండాకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.

ఆర్‌ అండ్‌ బిలో రాజునాయక్‌ జూనియర్‌ టెక్నికల్‌ అధికారిగా సంగారెడ్డిలో పనిచేస్తున్నారు. తూప్రాన్‌లో రాజ్‌కుమార్‌ వెటర్నరీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎం.చందర్‌ ఆరోగ్య పర్యవేక్షకుడిగా, ఎల్‌.విఠల్‌ సహకార బ్యాంకులో, కిషన్‌ రైల్వే శాఖలో, సౌమ్య ఎల్‌ఐసీలో డీవోగా, తుక్యా కెనరా బ్యాంకులో, రాంసింగ్‌ ఉపాధ్యాయుడిగా, దుర్గాప్రసాద్‌ ఏఈవోగా, రాత్ల విఠల్‌ జియోలాజికల్‌ విభాగంలో, ఎం. శ్రీనివాస్‌ పోలీస్‌ కానిస్టేబుల్‌గా, అపర్ణ ఉపాధ్యాయురాలిగా, శారద ప్ర.జూ కళాశాలలో రికార్ట్‌ అసిస్టెంట్‌, సురేశ్‌ హైదరాబాద్‌ కెనరా బ్యాంకులో పనిచేస్తున్నారు. మరో సురేశ్‌ హిందూస్థాన్‌ సంస్థలో సూపర్‌వైజర్‌గా కొనసాగుతున్నారు. వీణ, లలితలు అంగన్వాడీ ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఇలా అన్ని శాఖల్లో ఈ తండా వారు ఉద్యోగాలు చేపట్టడం విశేషం. ఛత్రూనాయక్‌ అనే మరో యువకుడు ఖాన్‌పూర్‌ ఐఐటీలో చదివి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా ఏకమై విరాళాలు వేసుకుని తండాలో జగదాంబమాత ఆలయ నిర్మాణం చేపట్టి ఊరికి కొత్త రూపు కల్పించారు.  

వెనకడుగు వేయలేదు
నియోజకవర్గ, డివిజన్‌ కేంద్రమైన నర్సాపూర్‌కు ఐదు కి.మీ. దూరంలోనే మహ్మదాబాద్‌ తండా ఉంది. అక్కడి వారంతా నర్సాపూర్‌లోనే చదువులు కొనసాగించారు. పట్టణానికి దగ్గరగా ఉండటంతో ఉన్నత చదువుల వైపు అడుగులు వేశారు. రెక్కాడితే డొక్కాడని శ్రమ జీవులు, పిల్లలను చదివించడంలో మాత్రం వెనకడుగు వేయలేదు. పస్తులుండి కూడా చదివించారు.


లక్ష్యంతో చదువుతున్నారు: ఛత్రూనాయక్‌, జీఎం, భారత ఆహార సంస్థ
తండాలోని యువత లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో కృషి చేస్తున్నారు. రెండున్నర దశాబ్దాల క్రితం ఒకరిద్దరు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరారు. దీంతో తండాలోని మిగిలిన వారూ ఆసక్తి పెంచుకున్నారు. ప్రతి సంవత్సరం కొందరు ప్రభుత్వ ఉద్యోగాలు చేపట్టడం ఆనందంగా ఉంది. ఈ స్ఫూర్తి కొనసాగాలని యువతను ప్రోత్సహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు