logo

రూపొందిన ప్రణాళిక.. అటకెక్కిన ఆచరణ

స్వయం సహాయక సంఘాల సభ్యులతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సర్కారు సంకల్పించింది. తద్వారా ఆదాయం సమకూర్చడంతోపాటు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిశ్రమల ప్రారంభానికి ఆమోదం

Published : 18 Jan 2022 02:25 IST

ఏడాది గడిచినా అడుగులుపడని వైనం
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

నిరుపయోగంగా అతిథిగృహం

నిధులు: రూర్బన్‌ పథకం
నిర్వహణ: గ్రామీణాభివృద్ధి శాఖ
కార్యాచరణ: రెండు చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు
పురోగతి: భవనాల ఎంపికకే పరిమితం
స్వయం సహాయక సంఘాల సభ్యులతో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు సర్కారు సంకల్పించింది. తద్వారా ఆదాయం సమకూర్చడంతోపాటు, ఉపాధి కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి పరిశ్రమల ప్రారంభానికి ఆమోదం తెలిపారు. ఏడాది గడిచినా ఆచరణకు నోచడంలేదు. వెరసి వందలాది మంది మహిళలకు ఎదురుచూపులే మిగిలాయి. ఈనేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం.

రూర్బన్‌ పథకం నిధులతో తాండూరు మండలంలో చిన్నతరహా పరిశ్రమలను నెలకొల్పేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు ఖరారు చేశారు. శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారీ, ప్లాస్టిక్‌ రహిత విస్తరాకుల తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. వాటి నిర్వహణ బాధ్యత బృందాలకే అప్పగించాలని నిర్ణయించారు. ఉత్పత్తులను జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసేందుకు సన్నాహాలు చేశారు. తద్వారా పదులసంఖ్యలో అతివలకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు డ్వాక్రా సంఘాలకు విరివిగా ఆదాయం పొందేలా కసరత్తు చేశారు. వ్యాపార కార్యకలాపాల్లో వారు రాణించేలా, భవిషత్తులో మరిన్ని కంపెనీల నిర్వహణకు బాటలు పడేలా ప్రోత్సహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈమేరకు ప్రణాళికలు రూపొందించి, రూర్బన్‌ పథకం నుంచి వెచ్చించేందుకు సమాయత్తమయ్యారు.

వృథాగా మహిళా స్త్రీ శక్తి భవనం

భవనాలను ఎంపిక చేసి...: ప్రతిపాదనలను ఆచరణలో పెట్టాలని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భవనాల అన్వేషణ ఆరంభించారు. ఈక్రమంలో పాలనాధికారిణి పౌసుమిబసు, డీఆర్‌డీఓ కృష్ణన్‌ల బృందం తాండూరులో పర్యటించింది. పలు భవనాలను పరిశీలించారు. చివరకు తాండూరు మండల పరిషత్‌ కార్యాలయ పరిసరాల్లో నిరుపయోగంగా ఉన్న అతిథిగృహాన్ని పరిశీలించారు. ఇక్కడి భవనంలోని విశాలమైన గదులను పరిశీలించి శానిటరీ న్యాప్‌కిన్స్‌ తయారీ కేంద్రం ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. పైకప్పుపై చిన్న మరమ్మతు చేయాల్సి ఉండగా వెంటనే పూర్తి చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ డీఈ వెంకట్రావ్‌, ఏఈ సంతోష్‌ను ఆదేశించారు. అనంతరం సమీపంలో వృథాగా ఉన్న మహిళా స్త్రీశక్తి భవనంలో ప్లాస్టిక్‌ రహిత విస్తరాకుల తయారీ కేంద్రం నెలకొల్పేందుకు పచ్చజెండా ఊపారు. పర్యావరణానికి హాని తలపెట్టని రీతిలో విస్తరాలకు తయారీ, ఇతర ప్రాంతాలకు ఎగుమతులతో కాలుష్య నివారణకు కొంతైనా దోహదపడుతుందని వెంటనే  ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. అంతలోనే పాలనాధికారిణి బదిలీపై వెళ్లారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా స్థాయి అధికారులు విస్మరించారు. ప్రతిపాదనలు, ప్రణాళికలు అటకెక్కించారు. ఏకంగా జిల్లా పాలనాధికారిణి భవనాలు పరిశీలించి ఆమోదం తెలిపి ఏడాది గడిచినా పరిశ్రమల ఏర్పాటుకు నోచకపోవడంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకటిరెండు నెలల్లో రెండు పరిశ్రమలు అందుబాట్లోకి వస్తాయని అంతా భావించినా ఏడాది నుంచి ఎదురుచూపులు మిగలడంపై పెదవి విరుస్తున్నారు.

నిధులు సిద్ధంగా ఉన్నా..

రూర్బన్‌ పథకం ద్వారా తాండూరు మండలానిక రూ.18కోట్లు మంజురయ్యాయి. వాటిలో ఇప్పటివరకు దాదాపు రూ.14కోట్లు వెచ్చించి వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. ఇంకా రూ.4కోట్లు మిగిలిఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసి చిన్నతరహా పరిశ్రమలను ప్రారంభిస్తే తాండూరు, యాలాల, బషీరాబాద్‌, పెద్దేముల్‌ మండలాలతోపాటు పట్టణంలోని మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఇక్కడి పరిశ్రమలు విజయవంతమైతే జిల్లాలోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రారంభించేందుకు ఆస్కారమేర్పడనుంది. తద్వారా జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తులు, ఎగుమతులు మొదలైతే జిల్లావాసులు నగరాల నుంచి దిగుమతులు చేసుకునే బాధలు తప్పనున్నాయి. అవసరమైతే సరిహద్దునున్న కర్ణాటకకు ఎగుమతి చేస్తే మహిళలకు మరింత ఆదాయం, ఉపాధికి భరోసా లభించనుంది. స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు విస్తరించేందుకు తోడ్పడనున్నాయి. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని మహిళలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు