logo

అగ్గి ఎలా అంటుకుంది?

సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్గి ఎలా అంటుకుంది? అన్న అంశంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం జరిగిందని క్లబ్‌ అధ్యక్షుడు రఘురామరెడ్డి ఫిర్యాదుతో ఉత్తర మండలం

Updated : 18 Jan 2022 06:44 IST

సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రమాదంపై భిన్న కోణాల్లో విచారణ

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: సికింద్రాబాద్‌ క్లబ్‌లో అగ్గి ఎలా అంటుకుంది? అన్న అంశంపై పోలీసులు దృష్టి కేంద్రీకరించారు. విద్యుదాఘాతంతోనే ఈ ప్రమాదం జరిగిందని క్లబ్‌ అధ్యక్షుడు రఘురామరెడ్డి ఫిర్యాదుతో ఉత్తర మండలం పోలీసులు సోమవారం దర్యాప్తు చేపట్టారు. ఒక్కసారిగా మంటలు ఎలా వ్యాపించాయి? క్లబ్‌లో నిప్పును ఆర్పేసే వ్యవస్థే లేదా.. అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. అగ్ని ప్రమాదంలో కాలిపోయిన కలప, ఇనుప వస్తువులు ఇంకా పైనే వేలాడుతున్నాయని, ఇప్పుడు వెళ్తే ప్రమాదమంటూ అగ్నిమాపక శాఖ అధికారులు సూచించిన నేపథ్యంలో పోలీసులు, క్లూస్‌ బృందాలు సోమవారం క్లబ్‌ లోపలికి వెళ్లలేదు. క్లబ్‌లో విధులు నిర్వహించినవారి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అనంతరం పంచనామా నిర్వహించారు.

విద్యుత్తు.. క్లూస్‌ బృందాలు.. సాక్ష్యాధారాలు
అగ్ని ప్రమాదం జరిగిన తీరును తెలుసుకునేందుకు పోలీసులు క్లూస్‌ బృందాలను రప్పించారు. విద్యుత్తుశాఖ అధికారులు పంపించిన ప్రత్యేక బృందం సభ్యులతో కూడా మాట్లాడారు. క్లూస్‌ బృందం కాలిపోయిన విద్యుత్తు తీగలు, కలప, బూడిద తదితర నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. ఘటనపై చర్చించేందుకు కమిటీ సమావేశమైందని క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. జరిగిన నష్టం రూ.20కోట్లపైనే ఉంటుందని, విలువైన కలప, వస్తువులు, ఇతరాలు పరిగణలోకి తీసుకుంటే రూ.50కోట్ల వరకు నష్టం ఉండవచ్చని అంచనా వేశారు.

న్యాయస్థానంలో వివాదాలు
మొత్తం 21 ఎకరాల ఆవరణలో ఉన్న సికింద్రాబాద్‌ క్లబ్‌ స్థలం కేంద్ర రక్షణ శాఖకు చెందినదైనా.. క్లబ్‌ నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తులున్న కమిటీ నిర్వహిస్తోందని కంటోన్మెంట్‌ బోర్డు సీఈవో అజిత్‌ రెడ్డి తెలిపారు. రక్షణ శాఖ స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయకూడదు. క్లబ్‌ కమిటీ గతంలో ఓ షెడ్డు నిర్మించా అప్పటి సీఈవో ఆదేశాలతో అధికారులు షెడ్డును కూల్చేశారు.  న్యాయస్థానంలో కేసులూ ఉన్నాయని అధికారులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని