logo

ప్రైవేటు మళ్లీ ఆన్‌లైన్‌ బాట

నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విభాగంలో 19.87 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 10.26 లక్షల మంది

Published : 18 Jan 2022 02:25 IST

ఈనాడు, హైదరాబాద్‌: నగరంలోని ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలు ఆన్‌లైన్‌ బోధన ప్రారంభించాయి. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విభాగంలో 19.87 లక్షల మంది విద్యార్థులు ఉండగా.. 10.26 లక్షల మంది తరగతులకు హాజరవుతున్నారు. సంక్రాంతి తర్వాత హాజరు శాతం పెరుగుతుందని ప్రైవేటు యాజమాన్యాలు భావించాయి. కరోనా కేసుల పెరుగుదలతో విద్యాసంస్థలను ఈ నెల 30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు మళ్లీ ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితం కావాల్సిన పరిస్థితి. మూడు జిల్లాల్లో ప్రభుత్వ విభాగంలో 2,513 పాఠశాలలు ఉండగా.. 3,51,768 మంది విద్యార్థులున్నారు. వీరికి ఆన్‌లైన్‌ బోధన అందడం లేదు. 2020లో కరోనా ప్రబలిన తర్వాత తిరిగి విద్యాసంస్థలు తెరచుకోకపోవడంతో ప్రైవేటు ఉపాధ్యాయులను యాజమాన్యాలు తొలగించాయి. గతేడాది సెప్టెంబరులో తిరిగి పూర్తిస్థాయిలో బోధన ప్రారంభం కావడంతో మళ్లీ ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకున్నాయి. తాజాగా మరోసారి కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా విద్యాసంస్థలను మూసివేయడంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.  


ప్రత్యామ్నాయాలు ఆలోచించాలి
వెంకటసాయినాథ్‌, హైదరాబాద్‌ పాఠశాలల తల్లిదండ్రుల సంఘం సంయుక్త కార్యదర్శి

విద్యాసంస్థల మూసివేతలో పక్కా ప్రణాళిక లేకుండా ప్రభుత్వం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు మరింత దెబ్బతినే ప్రమాదముంది. షిఫ్టు పద్ధతి లేదా రోజు విడిచి రోజూ పాఠశాలలు నడిపించడం, ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి.


పాఠశాలలే ఎందుకు మూసివేస్తున్నారు..?
కె.ఉమామాహేశ్వరరావు, ట్రస్మా హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడు

అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నప్పుడు పాఠశాలలనే ఎందుకు మూసివేయాల్సి వస్తోందో ప్రభుత్వం చెప్పాలి. ఇప్పటికే ఆన్‌లైన్‌ బోధన కారణంగా విద్యార్థులు ఎంతో నష్టపోయారు. మధ్య, దిగువ మధ్య తరగతి పిల్లలపైనే అధిక ప్రభావం పడుతోంది. విద్యాసంస్థల నిర్వహణపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. అకడమిక్‌ క్యాలెండర్‌ పెంచమని కోరుతున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని