logo

మనమే ముందు

కిక్కిరిసిన రహదారులు.. గంటల తరబడి ట్రాఫిక్‌జాంలు.. రణగొణధ్వనులతో నిత్యం పడుతూలేస్తూ ప్రయాణిస్తున్న మెట్రోనగరాల్లో హైదరాబాద్‌ భిన్నంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాంలు మినహా రాజధాని నగరంలో

Published : 18 Jan 2022 08:04 IST

రహదారులపై గంటకు 25కిలోమీటర్ల సగటు వేగం

మెట్రోనగరాల్లో హైదరాబాద్‌కు ప్రథమ  స్థానం

ఈనాడు, హైదరాబాద్‌: కిక్కిరిసిన రహదారులు.. గంటల తరబడి ట్రాఫిక్‌జాంలు.. రణగొణధ్వనులతో నిత్యం పడుతూలేస్తూ ప్రయాణిస్తున్న మెట్రోనగరాల్లో హైదరాబాద్‌ భిన్నంగా నిలిచింది. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌జాంలు మినహా రాజధాని నగరంలో రహదారులపై సగటువేగం గంటకు 25కిలోమీటర్లకు పెరిగింది. కొన్ని ప్రైవేటు సంస్థలు, రవాణా సంస్థలు గతేదాడి మెట్రోనగరాలు దిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లతోపాటు పుణె నగరాల్లో ‘స్పీడ్‌’ సర్వే నిర్వహించాయి. కరోనా వైరస్‌ తీవ్ర ప్రభావం చూపించిన ఏప్రిల్‌, మే నెలలు మినహా జనవరి 2021 నుంచి డిసెంబరు నెల వరకు రద్దీ రహదారులు, అనుసంధాన మార్గాల్లో వాహనాల సరాసరి వేగాన్ని నిర్ధారించాయి. ఆయా నగరాల్లో రహదారుల విస్తీర్ణం, వాహనాల సాంద్రత, మౌలికసదుపాయాల ఆధారంగా సగటు వేగాన్ని లెక్కగట్టాయి. హైదరాబాద్‌ నగరం గంటకు 25కిలోమీటర్లతో ప్రథమస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో చెన్నై, మూడో స్థానంలో బెంగళూరు నిలిచాయి.

జీహెచ్‌ఎంసీ, జాతీయ రహదారుల అథారిటీలతో సమన్వయం
హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌రద్దీని తగ్గించేందుకు, మౌలిక సదుపాయాలు సమకూర్చేందుకు పోలీస్‌ అధికారులు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌, జాతీయ రహదారుల అథారిటీ అధికారులతో సమన్వయం చేసుకుని ట్రాఫిక్‌జాంలను తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కరోనా తర్వాత బస్సులు, రైళ్లలో ప్రయాణిస్తే వైరస్‌ సోకుతోందన్న భావనతో మధ్యతరగతికి చెందిన చాలామంది కార్లు కొనుగోలు చేయడంతో రహదారులపై రద్దీ మరింత పెరిగింది. రోజువారీ ట్రాఫిక్‌ను నియంత్రించడంతోపాటు అప్పటికే మొదలైన ఎస్‌ఆర్డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) పనులు, జాతీయ రహదారులపై మరమ్మతుల వేగం పెరగడంతో కొన్ని కొత్త రహదారులు అందుబాటులోకి వచ్చాయి.

కలిసొచ్చిన పై వంతెనలు.. విస్తరణలు
హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల్లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న పై వంతెనలు, ఇతర వంతెనలు గతేడాది అందుబాటులోకి వచ్చాయి. దీంతోపాటు శివారు ప్రాంతాల్లో రహదారుల విస్తరణ పూర్తవడంతో వాహనాల సగటు వేగం పెరిగింది. దుర్గంచెరువు పైవంతెన, ఎల్బీనగర్‌ ఫ్లైఓవర్‌ సహా మరికొన్ని ప్రజారవాణాకు అందివచ్చాయి. దుర్గం చెరువు పైవంతెనతో జూబ్లీహిల్స్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు దాదాపుగా పరిష్కారమయ్యాయి. షేక్‌పేట ఫ్లైఓవర్‌, సంతోష్‌నగర్‌ ఫ్లైఓవర్‌లు పాతబస్తీలో అవస్థలు తగ్గించాయి.


సాఫీ ప్రయాణం... సురక్షిత గమ్యస్థానం
ఏవీ రంగనాథ్‌, సంయుక్త కమిషనర్‌(ట్రాఫిక్‌)

హైదరాబాద్‌ రహదారులపై సాఫీ ప్రయాణమే లక్ష్యంగా నాలుగైదేళ్ల నుంచి జీహెచ్‌ఎంసీతో కలిసి పనిచేస్తున్నాం. రహదారులపై వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు ఏఏ ప్రాంతాల్లో రహదారులను విస్తరించాలి? ఎక్కడ పై వంతెనలు నిర్మించాలన్న అంశాలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటున్నాం. ఈ కారణంగానే హైదరాబాద్‌ నగరంలో సగటువేగం గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది కూడా సగటు వేగాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. హైదరాబాద్‌ వాహనాదారులకు సురక్షిత గమ్యస్థానంగా మార్చాలని ప్రణాళికలను సిద్ధం చేశాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని