logo

నిలదీయొద్దు.. నిదానంగా చెప్పు

పిల్లల్లో విపరీత ధోరణులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న విషయాలకే అలగడం, కాస్త కసురుకుంటే మనసు చిన్నబుచ్చుకోవడం, విపరీత నిర్ణయాలు తీసుకోవడం వంటి ధోరణులు అలవడుతున్నాయి. తరచి చూస్తే ఇందుకు ఎన్నో కారణాలు

Published : 18 Jan 2022 02:24 IST

పిల్లల్లో పెరుగుతున్న క్షణికావేశాలు, విపరీత ధోరణులు
బుజ్జగించి చెప్పడమే మేలంటున్న మానసిక విశ్లేషకులు
శేరిలింగంపల్లి, న్యూస్‌టుడే

పిల్లల్లో విపరీత ధోరణులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. చిన్న విషయాలకే అలగడం, కాస్త కసురుకుంటే మనసు చిన్నబుచ్చుకోవడం, విపరీత నిర్ణయాలు తీసుకోవడం వంటి ధోరణులు అలవడుతున్నాయి. తరచి చూస్తే ఇందుకు ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయంటున్నారు మానసిక విశ్లేషకులు, వైద్యులు. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీన పడటం, ఇల్లు, సెల్‌ఫోనే లోకంగా మసలుకోవడం వంటివి ప్రధానంగా కనిపిస్తున్న కారణాలు.  

భార్యాభర్తలు ఇరువురు మంచి ఉద్యోగస్తులు. ఏ లోటూ లేదు. ఒక్కడే కుమారుడు. అడిగింది కాదనకుండా ఇస్తూ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ‘ఆటలు ఎక్కువయ్యాయి.. ఇక చదువుకో’ అని తండ్రి మందలించాడు. అంతే 8వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆ క్షణిక కోపాన్ని అణచుకోలేక తాము ఉంటున్న 14వ అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. తల్లిదండ్రులకు తీవ్ర వేదన మిగిల్చి వెళ్లిపోయాడు. పిల్లల్లో పెరుగుతున్న విపరీత ధోరణులకు ఈ ఘటన అద్దం పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భావితరాన్ని ఎలా కాపాడుకోవాలనే విషయాలపై మానసిక విశ్లేషకులు, వైద్యులు పలు సూచనలు చేస్తున్నారు.

చిన్న కుటుంబాల కారణంగా ఇంట్లో ఆడుకోవడానికి సరైన స్నేహితులు ఉండరు. బంధువులు, కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు తక్కువ. ఇల్లు, సెల్‌ఫోనే లోకం.   జీవితం విలువ వారికి తెలియదు. అడిగిందల్లా ఇచ్చేసి చదవడం లేదని ఒక్కసారిగా దోషిగా చేస్తామంటే పిల్లలు జీర్ణించుకోలేరు. తల్లిదండ్రులు కచ్చితంగా ఒక స్నేహితుడుగా, టీచర్‌గా, ఒక సూపర్‌వైజర్‌గా వ్యవహరించి తీరాలి. తప్పు చేసినప్పుడు వారిని దోషిని చేసి నిలబెట్టకూడదు. మన ఉద్వేగాన్ని వారి మీద రుద్దకూడదు. నిలదీయకుండా ఇలా చేయి అలా చేయి.. అని వివరించి చెప్పాలి. వారితో సమయం కేటాయించాలి. మాట్లాడాలి. వారితో కలిసిపోయి ఉండాల్సిందే. ఉమ్మడి కుటుంబాలున్నపుడు తల్లి, తండ్రి అరిస్తే పెద్దవాళ్లు దగ్గరకి వెళ్లడమో, వారు దగ్గరకి తీసుకొని మంచి మాటలు చెప్పడం జరిగేది కానీ ఇప్పుడన్నీ చిన్న కుటుంబాలు. భార్యాభర్తలు ఉద్యోగస్తులు. వారి వారి ఉద్యోగ ఒత్తిడిలో వారు ఉండిపోతున్నారు. పిల్లలు అడిగింది కొనిచ్చేస్తున్నారు. ఇంకేం కావాలి వారికి.. చక్కగా చదువు కోవడమేగా అని తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. చదవకపోతే హెచ్చరించడం, లేదంటే నాలుగు తగిలిద్దామనే ఆలోచనలో ఉంటున్నారు. ఇది ఏమాత్రం సరైన పద్ధతి కాదంటున్నారు నిపుణులు.

గతంలో పాఠశాలలు రెగ్యులర్‌గా ఉండేవి కాబట్టి వారు వారి భావాలు పంచుకోవడానికి స్నేహితుల రూపంలో, ఉపాధ్యాయుల రూపంలోనే దారి ఉండేది. ప్రస్తుత పరిస్థితులు దయనీయంగా మారాయి. ఆన్‌లైన్‌ క్లాసులతో వారికి సెల్‌ఫోన్‌ చేతికి చేరింది. గేమ్‌లు తదితర వాటి ప్రభావంతో అందులో చిక్కుకుపోతున్నారు. వారు మానవ సంబంధాలకు దూరమైపోతున్నారు. తీవ్ర కోపం, సెన్సిటీవ్‌టీ పెరిగిపోతున్నాయి. వారు మాటపడకుండా మారిపోతున్నారు. కొందరు సెల్‌ఫోన్‌ పక్కన ఉంటేనే తిండి తింటున్నారు. లేదంటే మారాం చేస్తున్నారు. ఇది పిల్లల్లో విపరీత ధోరణలకు కారణమౌతుందని అంటున్నారు.


ఇలా చేయండి - ఎం.ఉమాశంకర్‌,
సూపరింటెండెంట్‌, ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయం

కోపం, చిరాకు, సెన్సిటివిటీ, సర్దుబాటు ధోరణి లేక పోవడం వంటివి పిల్లల్లో కనిపిస్తే, ఆక్షేపణీయంగా అనిపిస్తే కౌన్సిలింగ్‌ ఇప్పిస్తే చాలా మంచిది. ఇది చాలా ఉపయుక్తమౌతుంది. అయినా మార్పు రాకపోతే తగిన చికిత్స అందిస్తే సరిపోతుంది. ఈ విషయంలో నిర్ణయం తీసుకొని పిల్లల్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు సైతం కచ్చితంగా పిల్లల పెంపకంపై కౌన్సిలింగ్‌ తీసుకోవాలి. జీవన విధానంలో మార్పులనేది అవసరం. లేదంటే ఈ ప్రభావం భావి పౌరులమీద పడుతుందనే విషయం మర్చిపోవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని