logo

ఉస్మానియాలో ముగ్గురు చిన్నారులకు పునర్జన్మ!

అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు చిన్నారులకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్సలతో పునర్జన్మ ప్రసాదించారు. వివరాలను ఉస్మానియా ఆసుపత్రికి చెందిన సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి

Published : 18 Jan 2022 02:24 IST

ఏడాది చిన్నారికి కాలేయ మార్పిడి

కాలేయ మార్పిడి తర్వాత ఏడాది బాబు

ఈనాడు, హైదరాబాద్‌: అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న ముగ్గురు చిన్నారులకు ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్సలతో పునర్జన్మ ప్రసాదించారు. వివరాలను ఉస్మానియా ఆసుపత్రికి చెందిన సర్జికల్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్‌ మధుసూదన్‌ మీడియాకు వెల్లడించారు. కరీంనగర్‌కు చెందిన వివాన్‌(1)తో పాటు ఖమ్మంకు చెందిన అన్నదమ్ములు విజయ్‌(14), సిద్ధార్థ(16) పుట్టుకతోనే ప్రొగ్రెసివ్‌ ఫ్యామిలీల్‌ ఇంట్రాహెపాటిక్‌ కొలెస్టాసిస్‌(పీఎఫ్‌ఐసీ) అను జన్యు సంబంధిత కాలేయ వ్యాధితో బాధపడుతున్నారు. దగ్గరి బంధువులు, మేనరిక వివాహాలు చేసుకునే దంపతులకు పుట్టే పిల్లల్లో ఇలాంటివి కన్పిస్తుంటాయి. సాధారణంగా కాలేయం బైలురూబిన్‌, బైలువర్ధిన్‌ అనే స్రావకాలను ఉత్పత్తి చేస్తుంది. జీర్ణ వ్యవస్థలో ఈ రెండు కీలకం. పీఎఫ్‌ఐసీ సమస్య ఉన్నవారిలో ఈ రెండు కాలేయం నుంచి చిన్న పేగుల్లోకి చేరవు. దురద, బరువు తగ్గడం, ఎదుగుదల ఉండకపోవడం, పచ్చకామెర్లు, నీరసం తదితర సమస్యలు కన్పిస్తాయి.  ఇలాంటి రోగులకు కాలేయ మార్పిడియే శరణ్యం. ఈ ముగ్గురు పిల్లల తల్లిదండ్రులకు అంత స్థోమత లేదు. కూలీ పనులు చేస్తారు.వివిధ పరీక్షలు చేసిన వైద్యులు.. ఏడాది బాబుకు లివర్‌ పూర్తిగా పాడైపోయినట్లు గుర్తించారు.  తల్లి నుంచి కొంత కాలేయ భాగాన్ని తీసుకొని ఏడాదికి బాబుకు లివర్‌ మార్పిడిని విజయంతంగా పూర్తి చేశారు. మిగతా ఇద్దరికి శస్త్రచికిత్స చేసి పేగుల్లోకి బైలు స్రావాలు చేరేలా చేశామని, అందరూ కోలుకుంటున్నారని డాక్టర్‌ మధుసూదన్‌ వివరించారు. ఈ శస్త్రచికిత్సలను ఉస్మానియా వైద్యుల బృందం డాక్టర్లు పాండునాయక్‌, రమేష్‌కుమార్‌, జ్యోతి, సుదర్శన్‌, వేణు, వరుణ్‌ విజయంతంగా నిర్వహించింది. సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేందర్‌ వైద్యులందరిని అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని