Ts News: మహిళా వర్సిటీగా కోఠి మహిళా కళాశాల.. ఏర్పాట్లపై మంత్రి సబిత సమీక్ష

త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు..

Published : 19 Jan 2022 01:24 IST

హైదరాబాద్‌: త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు. ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ లక్ష్మీనారాయణ, కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ విజులత తదితరులు సమీక్షకు హాజరయ్యారు.

‘‘ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంటూ.. యూజీసీ స్వయం ప్రతిపత్తి, న్యాక్ గుర్తింపు కలిగిన కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా మార్చేందుకు అన్ని అర్హతలు కలిగి ఉందని ప్రభుత్వం భావించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటును వేగవంతం చేసే దిశగా అధికారులు పనులు చేపట్టాలి. కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చితే అవసరమయ్యే బోధనా సౌకర్యాలు, విద్యార్థులకు వసతులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై కూలంకుషంగా పరిశోధించి ఒక నివేదిక రూపొందించాలి. మహిళా వర్సిటీ ఏర్పాటుకు విధివిధానాలు, తీసుకోవాల్సిన అనుమతులపై పూర్తి వివరాలు అందించాలి. ఆ దిశగా చర్యలు చేపట్టేందుకు విద్యా శాఖలో అంతర్గతంగా కమిటీ వేసుకోవాలి. ప్రస్తుతం కోఠి మహిళా కళాశాలలో 4,159 మంది విద్యార్థినులు చదువుతున్నారు. కళాశాలను మహిళా వర్సిటీగా మార్చితే విద్యార్థినుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కోఠి మహిళా కళాశాలకు చారిత్రక వైభవం ఉంది. మహిళా విశ్వవిద్యాలయంగా మారిస్తే తెలంగాణ మహిళల ఉన్నత విద్యలో గణనీయమైన మార్పు వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్నత విద్యలో హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతోంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే విశ్వవిద్యాలయం వల్ల మరింత పేరు, ప్రఖ్యాతులు వస్తాయి. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేసి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయాలి’’ అని అధికారులను మంత్రి ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని