logo

ఎరువు.. ధరల దరువు

జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ రంగానికి సంబంధించి ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం కర్షకులపై పడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు

Published : 19 Jan 2022 02:43 IST

ఈనాడు డిజిటల్‌, వికారాబాద్‌, న్యూస్‌టుడే, దౌల్తాబాద్‌

జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ఈ రంగానికి సంబంధించి ఏ చిన్న మార్పు జరిగినా దాని ప్రభావం కర్షకులపై పడుతోంది. ఇటీవల ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే విత్తనాలు, ట్రాక్టర్‌ అద్దె నుంచి అన్నిరకాల పెట్టుబడి ఖర్చులు పెరిగాయని, ఇలా అయితే సాగు చేయలేమని వాపోతున్నారు.  

జిల్లాలో 5.90 లక్షల ఎకరాల సాగు భూములున్నాయి. రబీ సీజన్‌లో ప్రధానంగా జొన్న, వేరుసెనగ, సెనగ, కుసుమ, వరి పంటలు సుమారు 1.30 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఆయా పంటల అవసరాలకు జిల్లాలో 28 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంచారు. ఇటీవల ప్రభుత్వం కాంప్లెక్స్‌ ఎరువుల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం జిల్లా రైతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కాంప్లెక్స్‌ ఎరువులు 50 కేజీల బస్తాపై రూ.200 నుంచి రూ.750 వరకు పెరిగింది. సాధారణంగా గత సీజన్‌లో పొటాష్‌ బస్తా రూ.వెయ్యికి లభించేది. ప్రస్తుతం రూ.1750 అయ్యింది. వేరుసెనగ, మొక్కజొన్న పంటలకు ప్రస్తుతం ఎరువుల అవసరం ఉంది. జిల్లాలో సుమారు 20 వేల ఎకరాలు వేరుసెనగ, మరో 7 వేల ఎకరాల్లో జొన్న సాగు చేస్తున్నారు. దీంతో కాంప్లెక్స్‌ ఎరువులకు గిరాకీ పెరిగింది. పొటాష్‌ అందుబాటులో లేకపోవడంతో ప్రత్యామ్నాయంగా 26.26.26 రకం కాంప్లెక్స్‌ ఎరువులు వాడుతున్నామంటున్నారు. సాగు సమయంలో అన్నింటికి పెట్టుబడులు పెరుగుతున్నాయని, పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదని, అప్పులపాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు స్థానికంగా పరిశ్రమలు లేకపోవడంతో యువత, మరికొన్ని కుటుంబాలు ముంబయి, పుణె, హైదరాబాద్‌, ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.


కృత్రిమ కొరత

కొడంగల్‌, పరిగి నియోజకవర్గాలు, బషీరాబాద్‌, యాలాల, ధారూరు మండలాల్లో వేరుసెనగ, జొన్న, వరి పంటలు విస్తారంగా సాగు చేస్తున్నారు. ఎరువుల వినియోగం ఆయా ప్రాంతాల్లోనే అధికంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కాంప్లెక్స్‌ ఎరువులకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండటంతో కొంత మంది డీలర్లు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.  తమ అనుయాయులకు, వారు సూచించిన వారికి మాత్రమే పొటాష్‌ లాంటి ఎరువులు లభిస్తున్నాయంటున్నారు. కొరత ఉండటంతో ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయని సమాచారం.


వ్యవసాయం చేయలేం
లక్ష్మప్ప, దౌల్తాబాద్‌

వ్యవసాయ పనులకే కూలీలు రావడానికి ఇష్టపడటం లేదు. అంతేకాకుండా కూలి రేట్లు పెరిగాయి. దీనికి తోడు ఇప్పుడు ఎరువుల ధరలు రెండింతలవుతున్నాయి. మాలాంటి పేద రైతులు వ్యవసాయం చేయాలంటే అప్పులు చేయడం తప్పడంలేదు. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు రైతులను ఆదుకునే విధంగా ఉండాలి.


కౌలుకు ఇవ్వడం మేలు: మల్కప్ప

డాది పొడవునా పండించిన పంటలకు రూ.50 నుంచి రూ.100 గిట్టుబాటు ధర పెంచుతున్నారు. ఇతర ట్రాక్టర్‌ అద్దె నుంచి ఎరువుల ధరల వరకు అన్నీ భారీగా పెరుగుతున్నాయి. అందుకే నష్టాలు వస్తున్నాయి. అన్నింటితో సమానంగా పంటల ధరలను పెంచితేనే బాగుపడేది. ఎరువుల ధరలు పెంచినట్లే పంటలకు పెంచాలి. లేకుంటే కౌలుకు ఇచ్చుకోవడం మేలు అనిపిస్తోంది.


ఇబ్బంది లేకుండా సరఫరా: గోపాల్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

జిల్లాలో ఈ సీజన్‌ అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితుల్లో సరఫరా చేసేందుకు బఫర్‌ స్టాక్‌ సైతం సిద్ధంగా ఉంది. ఎక్కడైనా ఇబ్బంది ఉంది, సమస్యలు ఉంటే సమీపంలోని అధికారులకు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని