దగ్గరి దారి కంటే ప్రాచుర్యం పొందిన మార్గాలే ఉత్తమం
కృష్ణారెడ్డి రేవంత్‌రతన్
ఈనాడు, హైదరాబాద్: గమ్యస్థానాలకు చేరుకునేందుకు దగ్గరి దారి కంటే బాగా ప్రాచుర్యం పొందిన మార్గాలు ఎంచుకునే సాంకేతికతను గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని బాగా ప్రాచుర్యం పొందిన మార్గాలను సూచిస్తుంది. ట్రిపుల్‌ఐటీ ఆచార్యుడు పి.కృష్ణారెడ్డి నేతృత్వంలో పీహెచ్‌డీ విద్యార్థి పి.రేవంత్‌రతన్ ఆధ్వర్యంలో పరిశోధన చేపట్టారు. తక్కువ దూరాలతో వెళ్లే మార్గాల కంటే వీలుగా ఎక్కువగా జనం అనుసరించే మార్గాలను గుర్తించడంపై ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసి నిర్దేశిత విధానాన్ని సిద్ధం చేశారు. సాధారణంగా గమ్యస్థానాలు చేరేందుకు గూగుల్ మ్యాప్ ఎంచుకున్నప్పుడు దగ్గరి దారి చూపిస్తుంది. ఆ దారిలో ఒక్కొక్కసారి రోడ్డు సరిగా లేకపోవడం, సరైన సౌకర్యాలు లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతుంటారు. అలా కాకుండా కాస్త ఆలస్యమైనా.. దూరమైనా.. ఎక్కువ మంది వినియోగించే దారి ఎంచుకునేందుకు వాహనదారులు ప్రయత్నిస్తారు. అదీగాక ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారంటే ఆ దారి సౌకర్యవంతంగా ఉన్నట్లుగా అర్థం చేసుకోవచ్చు. ఆ దారిలో ట్రాఫిక్ రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగిపోయేందుకు వీలుంటుంది. అలా ఎక్కువ ఆదరణ ఉన్న దారిని ఎంచుకునే విధానాన్ని ట్రిపుల్‌ఐటీ పరిశోధకులు తయారు చేశారు. వీరు రూపొందించిన విధానాన్ని చైనాలోని బీజింగ్ దారులతో సరిపోల్చి చూసినప్పుడు సంతృప్తికర ఫలితాలు వచ్చాయి. వీరి పరిశోధనపత్రం ‘ఎ ఫ్రేమ్‌వర్క్ ఫర్ డిస్కవరింగ్ పాపులర్ పాథ్స్ యూజింగ్ ట్రాన్సాక్షనల్ మోడలింగ్ అండ్ పాట్రన్ మైనింగ్’ శీర్షికన స్ప్రింగర్ జర్నల్‌లో ప్రచురితమైంది. ‘‘మేం రూపొందించిన విధానంతో వాహనదారులు ఏ ఇబ్బంది లేకుండా గమ్యస్థానానికి చేరుకునేందుకు వీలుంటుంది. మా పరిశోధనను బీజింగ్ నగరానికి అన్వయించి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విధానం ఏ నగరంలోని రహదారులకైనా అమలు పరిచే వీలుంటుంది. మున్ముందు నిధులు సమకూరితే ప్రత్యేక యాప్ తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నాం.’’ అని ట్రిపుల్‌ఐటీ ఆచార్యుడు పి.కృష్ణారెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.