logo

కంకర మిల్లుల కాలుష్యంపై అధ్యయనానికి కమిటీ

రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న స్టోన్‌ క్రషర్స్‌ (కంకర మిల్లుల) ఉల్లంఘనలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ

Published : 19 Jan 2022 03:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో అక్రమంగా నడుస్తున్న స్టోన్‌ క్రషర్స్‌ (కంకర మిల్లుల) ఉల్లంఘనలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించడానికి చెన్నై జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) సంయుక్త కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పర్యావరణ శాఖ హైదరాబాద్‌ ప్రాంతీయ విభాగం సీనియర్‌ అధికారి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సీనియర్‌ అధికారి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లుగానీ లేదంటే వారి తరఫున అసిస్టెంట్‌ కలెక్టర్‌ హోదా ఉన్న సీనియర్‌ అధికారులు, రాష్ట్ర గనుల శాఖ సీనియర్‌ అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. స్టోన్‌ క్రషర్స్‌ వల్ల ఏర్పడిన పర్యావరణ నష్టం అంచనా, పరిహారం, పునరుద్ధరణ వివరాలతో ఫిబ్రవరి 25లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పీసీబీ అనుమతుల్లేకుండా, చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న కంకర మిల్లులపై చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన పి.వి.సుబ్రమణ్యవర్మ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, సాంకేతిక సభ్యులు డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  

మైనింగ్‌ అక్రమాలపై విచారణ
ఈనాడు, చెన్నై: హైదరాబాద్‌ శివారులో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపడుతుండటం వల్ల పలురకాల దుష్ప్రభావాలు వస్తున్నాయని తెలంగాణకు చెందిన పి.ఇందిరారెడ్డి, ఎ.నిఖిల్‌కుమార్‌రెడ్డి చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ సదరన్‌ జోన్‌లో పిటిషన్‌ వేశారు. ఈ వ్యవహారంపై స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లాల కలెక్టర్లను ఎన్జీటీ ఆదేశించింది. దీనిపై ఫిబ్రవరి 28న తదుపరి విచారణ జరుగుతుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని