logo

నిర్లక్ష్యమేపెను నిప్పు

అవే తప్పులు.. అంతే నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం.. వెరసి నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల హైదర్‌నగర్‌లో ఓ థియేటర్‌ బూడిదైంది. రాణిగంజ్‌లో ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో

Published : 19 Jan 2022 03:59 IST

షార్ట్‌ సర్క్యూట్‌తోనే 80 శాతం ప్రమాదాలు

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌.. అవే తప్పులు.. అంతే నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికార యంత్రాంగం.. వెరసి నగరాన్ని వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల హైదర్‌నగర్‌లో ఓ థియేటర్‌ బూడిదైంది. రాణిగంజ్‌లో ఓ ఎలక్ట్రానిక్స్‌ షోరూంలో మంటలతో భారీ నష్టం వాటిల్లింది. తాజాగా.. శతాబ్దానికి పైగా చరిత్రకు సాక్ష్యమైన సికింద్రాబాద్‌ క్లబ్‌ ప్రధాన భవనం అగ్నికి ఆహుతైపోయింది. ఇవన్నీ పెద్ద ప్రమాదాలైనా.. చిన్నపాటి నిర్లక్ష్యంతోనే జరిగినట్లు స్పష్టమవుతోంది. మంటలు చెలరేగితే ప్రాథమిక స్థాయిలోనే కట్టడి చేసే వ్యవస్థలు లేకపోవడం, నిబంధనలు పాటించకపోవడం, తనిఖీ చేయాల్సిన వ్యవస్థలు అప్రమత్తంగా లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగి భారీ ఆస్తి నష్టానికి కారణమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నగరంలో పదికిపైగా క్లబ్‌లు ఉండగా.. ఒక్క దాంట్లోనూ అగ్నిమాపక వ్యవస్థ పూర్తి స్థాయిలో లేదు. అగ్నిమాపక శాఖ అధికారుల అంచనా ప్రకారం.. హైదరాబాద్‌లో దాదాపు 80 శాతం అగ్ని ప్రమాదాలు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే జరుగుతున్నాయి.

ఫైరింజన్లు వెళ్లలేని పరిస్థితి.. కొన్ని భవన సముదాయాల్లో అగ్ని ప్రమాదం జరిగితే ఫైరింజన్‌ వెళ్లే చోటు లేకపోవడం ప్రమాద తీవ్రత, ఆస్తి నష్టాన్ని పెంచుతోంది. ఆసుపత్రులు, హోటళ్లు, షాపింగు కాంప్లెక్సుల చుట్టూ ఫైరింజన్‌ తిరిగేందుకు భవనం ఆవరణలో నాలుగు మీటర్ల ఖాళీ స్థలం ఉండాలి. ఇలా  లేకపోవడం, పరిసరాల్లో అడ్డగోలు నిర్మాణాలు, ప్రత్యామ్నాయ మెట్ల మార్గం లేకపోవడంతో మంటలార్పే వీలుండటం లేదు.  

తనిఖీలు అంతంత మాత్రమే..
నగరంలో ఏటా కొన్ని వేల నిర్మాణాలు పుట్టుకొస్తుండగా.. ఐదంతస్తులకు మించిన భవనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. వీటిలో అగ్నిమాపక శాఖ తనిఖీలు నామమాత్రంగానే జరుగుతున్నాయి. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో నెలకు సగటున 10 నుంచి 12 భవనాల్లో మాత్రమే తనిఖీలు జరుగుతున్నాయి. చర్యలు తీసుకొనే విషయంలో అగ్నిమాపక శాఖ అధికారులకు పరిమిత అధికారాలు ఉండటం కూడా ఇబ్బందికరంగా మారుతోంది. గ్రేటర్‌లో 15 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే జీప్లస్‌ 5 కమర్షియల్‌ భవనాలు, షాపింగ్‌ కాంప్లెక్సులు, ఆసుపత్రులు, 18 మీటర్ల కంటే తక్కువ ఎత్తుండే ఐదంతస్తుల నివాస సముదాయాల్ని జీహెచ్‌ఎంసీ తనిఖీలు చేసి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేస్తుంది. ఆపై ఎత్తుండే భవనాలకు అగ్నిమాపక శాఖ ఎన్‌వోసీ ఇవ్వాలి. నిర్ధిష్ట ఎత్తు దాటితే భవనాన్ని తనిఖీ చేసి ఎన్‌వోసీ ఇచ్చే అగ్నిమాపక శాఖకు.. నిర్మాణం పూర్తయ్యాక నిబంధనలు పాటించకపోతే సీజ్‌ చేసే అధికారం లేకపోవడం విడ్డూరం. ఇదే అవకాశంగా కొందరు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు
-ఎం.శ్రీనివాసరెడ్డి, జిల్లా అగ్నిమాపక అధికారి
అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నాం. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తున్నాం. అవగాహన కల్పించడంతో పాటు ప్రతి శుక్రవారం మాక్‌ డ్రిల్‌లు నిర్వహిస్తున్నాం. చాలా ఆసుపత్రుల్లో వీటిని నిర్వహిస్తున్నాం. భారీ ప్రమాదాలు జరిగినా ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నాం.  


భయపెడుతున్నా.. భద్రతను పాటించరా?

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు షార్ట్‌ సర్క్యూట్‌తో జరుగుతున్న అగ్నిప్రమాదాలు నగరాన్ని భయపెడుతున్నాయి.   పండగరోజు సికింద్రాబాద్‌ క్లబ్‌లో విద్యుదాఘాతంతో అగ్నిప్రమాదం జరగ్గా.. కనుమరోజు హైదర్‌గూడలోని ఒక అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తులోని ఫ్లాట్‌లో మంటలు చెలరేగాయి. కొద్దిరోజుల క్రితం హైదర్‌నగర్‌లో ఒక థియేటర్‌ బుగ్గిపాలైంది. ఆదివారం ఎల్‌బీనగర్‌లోని ఒక బహుళ అంతస్తుల భవనం ఫ్లాట్‌లోని ఓవెన్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరగ్గా.. ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు పెరిగే కొద్దీ పలుచోట్ల అగ్నిప్రమాదాల ముప్పు పెరుగుతోంది. పండక్కి ముందు కూకట్‌పల్లిలో రిప్రిజిరేటర్‌ లోంచి గ్యాస్‌ లీకై పేలుడు సంభవించింది. విద్యుత్తు సంస్థల తూతూమంత్ర తనిఖీలు, వినియోగదారుల అలసత్వంతోడై షార్ట్‌ సర్క్యూట్‌లకు దారి తీస్తోంది. ఎక్కువగా పాత భవనాల్లో సంవత్సరాల క్రితం వైరింగ్‌ కాలిపోయి ప్రమాదాలకు కారణమవుతోంది. కొత్త వాటిలోనూ షార్ట్‌ సర్క్యూట్‌లు జరుగుతున్నా.. అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  

ఇలానూ జరగవచ్చు
విద్యుదాఘాతాలకు ప్రధానంగా అధిక విద్యుత్తు వాడకంతో తీగలు కాలిపోవడం ఒకటైతే.. షార్ట్‌ సర్క్యూట్‌తో నిప్పు అంటుకోవడం రెండోది.

* తీగల వినియోగంలో ఏ మాత్రం ప్రమాణాలు పాటించడం లేదు. ఎక్కువచోట్ల అతుకులు, ఎర్తింగ్‌ లోపాలు, ఓవర్‌లోడ్‌ ప్రమాదాలకు కారణం అవుతోంది.

* ఒక బాక్స్‌ నుంచి ఎక్కువ సాకెట్లతో కరెంట్‌ వినియోగం కూడా ప్రమాదాలకు కారణం అవ్వొచ్చు.

* స్పార్క్‌ వచ్చినప్పుడు మంటలంటుకునే గుణం ఉన్న వస్తువులు దగ్గర్లో ఉంటే అగ్నిప్రమాదాలకు దారి తీస్తున్నాయి.

* విద్యుత్తు దీపాలను వేడి గ్రహించే సామగ్రికి 0.50 మీటర్‌ దూరంగా ఉండాలి. అలంకరణ సామగ్రికి అతి సమీపంలోనే బల్బులను ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ ప్రమాదాలకు దారితీస్తున్నాయి.

మేల్కొలుపు ముఖ్యం
* 15 ఏళ్లు దాటిన పాత వైరింగ్‌ స్థానంలో కొత్త తీగలు బిగించుకోవాలి. పాత తీగలున్నచోట లోడు పెరిగితే కాలిపోయే ప్రమాదం ఉంది.

* వైరింగ్‌లో ఐఎస్‌ఐ ప్రమాణాల మేరకు నాణ్యత ఉన్న వాటినే ఉపయోగించాలి. ఇన్సులేషన్‌ పటిష్ఠంగా ఉండాలి.  

*  10 యాంప్స్‌ విద్యుత్తు ఉపయోగించేచోట 20 యాంప్స్‌ భారం పడే పరికరాలు ఉపయోగిస్తే కాలిపోయే ప్రమాదం ఉంది. ఏసీలు, వాటర్‌ హీటర్స్‌, మైక్రో ఓవెన్‌, రిఫ్రిజిరేటర్‌ వాడే చోట తగిన వైరింగ్‌.. తట్టుకునే లోడు ఉందో లేదో చూసుకోవాలి.

* ఇళ్లలో, వాణిజ్య భవనాల్లో నూట్రల్‌ పరికరాల కోసం సరిపడా ఎర్త్‌ ఎలక్ట్రొడ్‌ ఏర్పాటు ఏర్పాటు చేసుకోవాలి. ఎర్తింగ్‌ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

* విద్యుత్తు స్తంభాల నుంచి ఇంటి మీటర్‌ వరకు ఉండే సర్వీసు తీగలను క్రమంతప్పకుండా మూడేళ్లకోసారి మార్చుకోవాలి.

* రక్షణ పరికరాలలైన సర్క్యూట్‌ బ్రేకర్‌, కరెంట్‌ కంట్రోలర్‌ బ్రేకర్‌లు తప్పనిసరిగా ఉండాలి.

* లైసెన్స్‌ కల్గిన ఎలక్ట్రిషియన్‌తోనే పనులు, మరమ్మతులు చేయించుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని