logo

కాలనీ రోడ్లపై కన్నీరే!

ప్రధాన రహదారులపై బల్దియా చూపుతున్న శ్రద్ధ కాలనీ అంతర్గత మార్గాలపై ఉండడం లేదు. ముఖ్యంగా శివారులోని మట్టి రోడ్లున్న బస్తీలు, కాలనీల పరిస్థితి మరీ దారుణం. ఏడాదంతా గుంతలు పడి, మురుగుమయంగా ఉంటాయి.

Published : 19 Jan 2022 04:18 IST

ప్రధాన మార్గాలపైనే బల్దియా ఖర్చు
ఈనాడు, హైదరాబాద్‌

బురదమయంగా సూరారం సుందర్‌నగర్‌ దారి

ప్రధాన రహదారులపై బల్దియా చూపుతున్న శ్రద్ధ కాలనీ అంతర్గత మార్గాలపై ఉండడం లేదు. ముఖ్యంగా శివారులోని మట్టి రోడ్లున్న బస్తీలు, కాలనీల పరిస్థితి మరీ దారుణం. ఏడాదంతా గుంతలు పడి, మురుగుమయంగా ఉంటాయి. వాటన్నింటినీ సీసీ రోడ్లుగా మార్చుతామని రెండేళ్ల క్రితం బల్దియా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది.

రూ.800కోట్లకుపైగా ఖర్చు చేసినా..
గ్రేటర్‌ పరిధిలో 10 వేల కిలోమీటర్ల రోడ్లుండగా అందులో 790 కి.మీ మేర రెండేళ్ల క్రితం ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఐదేళ్లపాటు ఆయా రోడ్లను మెరుగ్గా నిర్వహించేందుకు రూ.1850 కోట్లను దశలవారీగా చెల్లిస్తోంది. ఇప్పటికే సగం నిధులను బల్దియా వెచ్చించింది కూడా. మిగిలిన రోడ్లకు రూ.450 కోట్ల వరకు ఖర్చు చేసింది. అంటే గడిచిన రెండేళ్లలో మొత్తంగా ఏడాదికి రూ.800-900 కోట్ల వరకు రహదారుల నిర్వహణ, నిర్మాణంపై ఖర్చయింది. ఫలితం మాత్రం వివక్షపూరితంగా ఉందన్న విమర్శలొస్తున్నాయి. ఇన్నర్‌ రింగు రోడ్డు, కొన్ని అంతర్గత ప్రధాన రహదారులను ఎప్పటికప్పుడు కొత్తగా నిర్మిస్తుండగా మిగిలిన రోడ్లన్నీ గుంతలు, బురద, మురుగుతో నిండిపోయాయి.

హామీకి రెండేళ్లు..
జీహెచ్‌ఎంసీలో 2007లో శివారు మున్సిపాలిటీలు విలీనమయ్యాయి. నగరీకరణలో భాగంగా ఆయా ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువైంది. దానికి తగ్గట్లుగా మౌలిక సౌకర్యాలు మెరుగుపడలేదు. తాగునీరు, మురుగునీటి పైపులైన్లు, వీధిదీపాల వరకే పరిమితమయ్యాయి. రోడ్ల నిర్మాణం జరగట్లేదు. వివాదాస్పద భూములు, నోటరీ స్థలాలంటూ కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వేయట్లేదు. లక్షలాది మంది ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న ఈ రహదారి సమస్యను పరిష్కరిస్తామని 2020 ఫిబ్రవరిలో బల్దియా ప్రకటన చేసింది. కమిషనర్‌ డి.ఎస్‌.లోకేష్‌కుమార్‌ జోనల్‌ కమిషనర్లతో సమావేశమై ఎన్నికల నాటికి యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 2020 డిసెంబరులో బల్దియా ఎన్నికలు జరిగితే పాలకమండలి ఏర్పాటై ఏడాది దాటినా సీసీ రోడ్ల నిర్మాణం మాత్రం 10 శాతానికి మించలేదని ఇంజినీర్లు చెబుతుండటం గమనార్హం.


సమస్య ఇక్కడ

కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి జోన్లలో మట్టి రోడ్లున్న ప్రాంతాలు అధికం. గాజులరామారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌, సూరారం, హయత్‌నగర్‌, ఉప్పల్‌, కాప్రా, లింగంపల్లి తదితర ప్రాంతాల్లోని కాలనీల్లో సమస్య తీవ్రంగా ఉంది. వర్షాకాలం ఆయా ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు బురదలో ఇరుక్కుపోతుంటాయి. నడిచి వెళ్లాలంటే నరకం.  

శివారు సీసీ రోడ్ల ప్రాజెక్టులు ఇలా..
ప్రకటించిన తేదీ: 26.02.2020
మట్టి రోడ్లున్న ప్రాంతాలు: 580
వాటి పొడవు: 291.28 కి.మీ
కేటాయించిన నిధులు: రూ.170.72 కోట్లు
ఇప్పటివరకు పూర్తయింది: 10 శాతం


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని