TS News: ప్రైవేటు వైద్య కళాశాలలకు హైకోర్టులో ఎదురుదెబ్బ

ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఫీజులు పెంచుతూ 2017లో ప్రభుత్వం

Published : 19 Jan 2022 17:15 IST

హైదరాబాద్‌: ప్రైవేటు పీజీ, వైద్య, దంత కళాశాలల్లో 2017-2020 విద్యా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఫీజులు పెంచుతూ 2017లో ప్రభుత్వం జారీ చేసిన జీవోలను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ ధర్మాసనం కొట్టివేసింది. ప్రైవేటు వైద్య కాలేజీల్లో 2017-2020కి ఫీజులు పెంచుతూ 2017 మే 9న ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సిఫార్సు లేకుండా ప్రభుత్వం ఏకపక్షంగా ఫీజులు పెంచిందని పిటిషనర్లు వాదించారు. జీవోలు చట్టానికి, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమన్నారు. పిటిషనర్ల వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. ఫీజుల పెంపు జీవోలను కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ 2016-19కి ఖరారు చేసిన ఫీజులనే తీసుకోవాలని కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజు వసూలు చేస్తే... 30 రోజుల్లో తిరిగి ఇచ్చేయాలని కాలేజీలను ధర్మాసనం ఆదేశించింది. కోర్సు పూర్తి చేసిన పీజీ వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లను ఆపవద్దని.. వారికి ఇచ్చేయాలని కాలేజీలకు ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని