logo

పోలీసులపై యువకుల దురుసు ప్రవర్తన

మద్యం మత్తులో యువకులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. నాలుగు రోజుల కిందట తాండూరు మండలం జిన్‌గుర్తి ఉపసర్పంచి

Published : 20 Jan 2022 01:46 IST

ఉపసర్పంచితోపాటు మరో ఎనిమిది మందిపై కేసు

జిన్‌గుర్తి(తాండూరుగ్రామీణ), న్యూస్‌టుడే: మద్యం మత్తులో యువకులు పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి బుధవారం రాత్రి వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. నాలుగు రోజుల కిందట తాండూరు మండలం జిన్‌గుర్తి ఉపసర్పంచి ఆశంఅలీ గ్రామానికి చెందిన మరికొందరు యువకులతో కలిసి గ్రామంలో గొలుసు దుకాణాలను అరికట్టాలని 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కానిస్టేబుళ్లు గ్రామానికి చేరుకుని విచారిస్తుండగా మద్యం మత్తులో ఉపసర్పంచితోపాటు మరికొందరు యువకులు ఎందుకు ఆలస్యంగా వచ్చారంటూ నిలదీశారు. ఈక్రమంలో వాగ్వాదానికి దిగి ఓ కానిస్టేబుల్‌ చొక్కా కాలర్‌ పట్టుకుని లాగారు. దీంతో వారిని వెళ్లిపోవాలని పోలీసులు సూచించినా. అక్కడే ఉండి దురుసుగా ప్రవర్తించారు. కానిస్టేబుళ్లు అక్కడి నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా జీపును యువకులు రెండు గంటలపాటు అడ్డుకున్నారు. పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఎస్‌ఐ మరికొంతమంది సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకొని యువకులను అక్కడి నుంచి పంపించారు. ఈ ఉదంతాన్ని పోలీసులు చరవాణిలో చిత్రీకరించారు. ఘటనలో ఉపసర్పంచితోపాటు మరో ఎనిమిది మంది యువకులు పాల్గొన్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఘటనలో పాల్గొన్న యువకులను కేసు నుంచి తప్పించేందుకు కొందరు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిదులు మూడురోజులుగా పోలీసులపై ఒత్తిళ్లు తీసుకురావడంతో కేసు నమోదులో తాత్సారం జరిగినట్లు సమాచారం. నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరో ఏడుగురు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు