మారని ‘దొంగ’బుద్ధి: 32 కేసుల్లో నిందితుడు.. 25 సార్లు జైలుకు
నిందితుడు శ్రీనివాస్
సికింద్రాబాద్, న్యూస్‌టుడే: అతను 32 చోరీ కేసుల్లో నిందితుడు. 25 సార్లు జైలుకెళ్లొచ్చాడు. అతన్ని ప్రవర్తన మార్చాలని పీడీ యాక్ట్ పెట్టారు.. ఉపాధి కోసం టీకొట్టు పెట్టించారు. అయినా తీరు మార్చుకోలేదు. మళ్లీ చోరీలకు తెగబడ్డాడు. ఓ ఇంటికి కన్నమేసిన కేసులో పోలీసులకు చిక్కాడు. గోపాలపురం ఏసీపీ సుధీర్, చిలకలగూడ సీఐ నరేష్ వివరాల ప్రకారం.. వికారాబాద్ మైలార్‌దేవ్‌పల్లికి చెందిన కొమ్మాని శ్రీనివాస్(33) తాళాలు వేసిన ఇళ్లను ఎంచుకుని చోరీలు చేస్తుంటాడు. అదే ప్రాంతానికి చెందిన కనుమర్తి ప్రియ అలియాస్ కస్తూరి అలియాస్ మోటీ(27) అతనితో సహజీవనం చేస్తోంది. భార్యాభర్తలుగా చలామణి అవుతూ చోరీ సొత్తును తాకట్టుపెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నారు. డిసెంబరు 23న చిలకలగూడ ఠాణా పరిధి పద్మారావునగర్‌లో ఇంటి తాళాలు పగలగొట్టి 15 తులాల బంగారు నగలు అపహరించారు. ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ద్వారా చోరీకి పాల్పడింది పాతనేరస్తుడు శ్రీనివాస్‌గా నిర్ధారించారు. చోరీ సొత్తును టోలీచౌకి, హుమాయూన్‌నగర్, లక్డీకాపూల్, పంజాగుట్టలోని అట్టికా గోల్డ్ కంపెనీ శాఖల్లో ప్రియ నేతృత్వంలో విక్రయించినట్లు గుర్తించారు. నిందితులతోపాటు ఆ గోల్డ్ కంపెనీ ఉద్యోగి మహ్మద్ ఖాదర్ అలీలను బుధవారం అత్తాపూర్‌లో అరెస్టు చేశారు. 54 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు చోరీ సొత్తుతో కొన్న బైకు, ఇతర సామగ్రి స్వాధీనం చేసుకుని.. రిమాండ్‌కు తరలించారు. వారికి సహకరించిన మరో వ్యక్తితోపాటు బెంగళూర్‌లోని ఆ గోల్డ్ కంపెనీ మేనేజర్‌పై కేసు నమోదు చేశారు.
ఉదయం టీ అమ్మడం.. రాత్రుళ్లు చోరీలు
శ్రీనివాస్‌పై గ్రేటర్‌లోని మూడు కమిషనరేట్ల పరిధిలో ఠాణాల్లో 32 కేసులు నమోదై ఉన్నాయి. 25 కేసుల్లో జైలుశిక్ష అనుభవించాడు. అతనిపై పీడీయాక్ట్ నమోదుచేసి ఏడాదిపాటు జైల్లో పెట్టారు. బతుకుదెరువు ఉంటే మారుతాడని రాజేంద్రనగర్ పోలీసులు టీస్టాల్ పెట్టించారు. పొద్దంతా బుద్ధిమంతుడిలా టీకొట్టు నడపడం, రాత్రయితే చోరీల బాట పట్టేవాడు. చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో పోలీసులు వేలాది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.