logo

వేళ్లన్నీ బ్యాంక్‌ మాజీ మేనేజర్‌పైనే..

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవహారంలో అనుమానాలన్నీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీ పైనే ముసురుకుంటున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చేయించిన మస్తాన్‌వలీ.. రసీదులు మాత్రం నకిలీవి ఇచ్చాడని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌

Published : 20 Jan 2022 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వ్యవహారంలో అనుమానాలన్నీ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాజీ మేనేజర్‌ మస్తాన్‌వలీ పైనే ముసురుకుంటున్నాయి. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను చేయించిన మస్తాన్‌వలీ.. రసీదులు మాత్రం నకిలీవి ఇచ్చాడని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ శాఖ ఉన్నతాధికారులు కొద్దిరోజుల క్రితం గుర్తించారు. ఈ మేరకు వివరాలను సీసీఎస్‌ పోలీసులకు వివరించారు. గతేడాది జనవరిలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ అధికారులు యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్వాన్‌ శాఖలో రూ.3.98 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినప్పుడు మేనేజర్‌గా మస్తాన్‌వలీ విధులు నిర్వహించాడు. రెండు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల రసీదులను ఆయన గిడ్డంగుల సంస్థ ప్రతినిధులకు అప్పుడే అందజేశారు. బ్యాంక్‌ మేనేజరే ఇచ్చాడన్న నమ్మకంతో గిడ్డంగుల సంస్థ అధికారులు వాటిని రాష్ట్ర కార్యాలయంలో భద్రపరిచారు. గడువు పూర్తయ్యాక ఈ నెల 7న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ప్రతినిధులు యూనియన్‌ బ్యాంక్‌కు వెళ్లినప్పుడు ఈ విషయం తెలిసింది.

వడ్డీ సహా రూ.4.19 కోట్ల చెల్లింపు

రాష్ట్ర గిడ్డంగుల సంస్థ రూ.3.98 కోట్లు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసినట్టు అన్ని ఆధారాలు ఉండడంతో యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కార్వాన్‌ శాఖ అధికారులు గడువు పూర్తవడంతో వడ్డీతో సహా రూ.4.19 కోట్లు గిడ్డంగుల సంస్థకు ఈనెల 13న చెల్లించారు. ఈ వ్యవహారంలో గిడ్డంగుల సంస్థకు ఎలాంటి నష్టం జరగలేదని ఆ సంస్థ అధికారులు బుధవారం వివరించారు. మరోవైపు ఈ నకిలీ రసీదులు తయారు చేయించిన మస్తాన్‌వలినీ విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని సమాచారం. దీంతోపాటు తెలుగు అకాడమీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణంలో అరెస్టై జైల్లో ఉన్న కొందరు నిందితులను కస్టడీకి తీసుకుని నకిలీ రసీదుల వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు